రిల్ఫీస్ట్..
తల్పం ఉన్నప్పుడు గిల్పం ఎందుకు ఉండదు? ఉండే తీరుతుంది. కావాలంటే మరోసారి ‘మాయాబజార్’ సినిమా చూడండి. ఇక ‘సెల్ఫీ’ ఉన్నప్పుడు ‘రిల్ఫీ’ ఎందుకు ఉండదు? కచ్చితంగా ఉండే తీరుతుంది. ఇదే ఆలోచన వచ్చింది కొందరు నెటిజన్లకు. ఇంకేముంది? ‘సెల్ఫీ’ ట్రెండ్ ఇంకా పాతబడక ముందే, నయాట్రెండ్‌గా ‘రిల్ఫీ’ సోషల్ మీడియాలోకి దూసుకొచ్చింది.
ఎవరి ఫొటోలు వాళ్లే తీసేసుకుని ‘ఫేస్‌బుక్’ వగైరా సోషల్ మీడియా వెబ్‌సైట్లలో ఎప్పటికప్పుడు పోస్ట్‌చేసే సెల్ఫీలతో నెటిజన్లకు మొహంమొత్తినట్లే ఉంది. ఎంత తుంటరి భంగిమల్లో ‘సెల్ఫీ’లు తీసుకుని పోస్టు చేసినా, ఒంటరి ముఖాలు ఎందరినని ఆకట్టుకోగలవు? ఆచితూచి అరుదుగా పోస్టుచేసే ‘సెల్ఫీ’లకు లెక్కించదగ్గ లైకులు, సన్నిహితుల కామెంట్లు పడతాయి.
అదేపనిగా రోజూ ‘సెల్ఫీ’లను గుప్పిస్తుంటే, జిగిరీ దోస్తులకు సైతం జీవితం మీద విరక్తి కలిగే పరిస్థితి వస్తుంది. అంతవరకు ‘అదుర్స్’, ‘సూపరహో’ అని కామెంటిన వారు సైతం, ‘నీ మొహంలా ఉంది’ అంటూ ఏమాత్రం మొహమాటం లేకుండా కామెంట్ పరువు తీసేయగలరు. ఆన్‌లైన్‌లో ఇలాంటి అగ్నిపరీక్షాత్మక పరిస్థితులను తప్పించుకునేందుకే, కొందరు ఇంటెలిజెంట్ నెటిజన్లు ‘రిల్ఫీ’లతో హల్‌చల్ చేస్తున్నారు.
బంధాలు బలోపేతం..
సన్నిహిత సంబంధం ఉన్నవారితో కలసి తీసుకునే ‘సెల్ఫీ’నే ‘రిల్ఫీ’. ఇంకోలా చెప్పాలంటే, ‘సెల్ఫీ’లా ఒంటరి కాదు, జంటరి. జంటగా దిగిన ఫొటోలను చూసేందుకు ఎవరికైనా కాస్త ఆసక్తి సహజం. అందుకే, ఆన్‌లైన్‌లో ‘సెల్ఫీ’ల కంటే ‘రిల్ఫీ’లపైనే ఎక్కువగా లైకుల వర్షం కురుస్తోంది. జంటరి ఫొటోలంటే ప్రేయసీప్రియుల ఫొటోలు, భార్యాభర్తల ఫొటోలు మాత్రమే కావు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, ప్రాణస్నేహితులు.. ఇలా ఎలాంటి సంబంధాన్నయినా బంధించేదే ‘రిల్ఫీ’.
‘రిల్ఫీ’లను తరచూ పోస్టు చేసే నెటిజన్లపై సర్వే చేస్తే, వారి సంబంధాలు బలంగా ఉన్నాయని పాశ్చాత్య దేశాల్లో నిర్వహించిన సర్వేల్లో తేలింది. ఆన్‌లైన్‌లో తమ సంబంధాలకు సంబంధించిన ‘రిల్ఫీ’ ఫొటోలను పోస్టు చేసేవారు తమ సంబంధాలను జాగ్రత్తగా కాపాడుకుంటారని కూడా తేలింది. ‘రిల్ఫీ’ల హవా ఏ స్థాయికి చేరుకుందంటే, వాటి కోసం ఏకంగా relfie.tumblr.com వెబ్‌సైటే పుట్టుకొచ్చింది. ‘సెల్ఫీ’స్ ఎంతైనా కాస్త సెల్ఫిష్‌గా కనిపిస్తాయి. ‘రిల్ఫీ’లు చూస్తే కాస్త రిలీఫ్‌గా ఉంటుందనేది వివిధ దేశాల నెటిజన్ల ఉవాచ. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ‘రిల్ఫీ’లతో ‘ఆన్‌లైన్’ను అదరగొట్టండి.
- పన్యాల జగన్నాథదాసు