Selphu
-
ప్రింట్...
ఇది సెల్ఫీల కాలం. ఎప్పటికప్పుడు మిత్రులతో, రకరకాల హావభావాలతో ఫొటోలు తీసుకుంటూంటాం. చూసుకుంటూ ఉంటాము కూడా. ఫోన్లో పదిలంగా ఉండే ఈ ఫొటోలను ప్రింట్ చేసుకోవాలంటే మాత్రం షాపుకు వెళ్లాల్సిందే. ఈ అవసరం లేకుండా చేస్తోంది... ఫొటోలో కనిపిస్తున్న ప్రింట్ . మొబైల్ ఫోన్ కేస్ మాదిరిగా ఉండే ఈ సరికొత్త గాడ్జెట్ మీరు తీసే సెల్పీలతోపాటు అయిదు నుంచి పది సెకన్ల వీడియోలను కూడా విశ్లేషించి, అందమైన స్టిల్స్‌ను ఎంపిక చేసి ప్రింట్ చేయగలదు. ప్రస్తుతానికి ఐఫోన్ 5, 6లతోపాటు శామ్సంగ్ ఎస్4, ఎస్5 మోడళ్లతో మాత్రమే పనిచేసే ఈ గాడ్జెట్ ఖరీదు దాదాపు 6000 రూపాయలు. -
అనిల్‌కపూర్‌తో ఓ సెల్ఫీ...
అదేదో సినిమాలో హీరో ‘కంచుకట్ల వారి పట్ల’తో భామలను తన వెంట తిప్పుకుంటాడు. శాండల్‌వుడ్ భామ సంజన వరస చూస్తుంటే అలానే ఉంది. హీరోలను బుట్టలో వేసుకొనే కిటుకులు అమ్మడికి బాగా తెలిసినట్టున్నాయి. నిన్న గాక మొన్న హీరో తమిళ హీరో శింబును అతని పుట్టిన రోజు సందర్భంగా ‘ట్వీట్స్’తో ఆకాశానికెత్తేసిన సంజన... నేడు బాలీవుడ్ స్టార్ అనిల్‌కపూర్‌తో ఓ సెల్ఫీ దిగి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులే కాదు... ఇండస్ట్రీ పీపుల్ కూడా కాస్తంత ఆశ్చర్యపోయారు. అసలు అనిల్‌ను ఎందుకు కలిసిందన్నది చెప్పలేదు గానీ... ‘లెజండ్ అనిల్ కపూర్‌తో కప్పు కాఫీ... కాసిన్ని కబుర్లు పంచుకున్న అద్భుతమైన మార్నింగ్’ అంటూ ట్వీటిందీ చిన్నది! -
హాట్ సెల్ఫీస్!
ఇప్పుడు ఇంటర్నెట్లో హాట్ టాపిక్ తమిళ తార వసుంధర కశ్యప్ బెడ్రూమ్ సెల్ఫీస్. తన బాయ్‌ఫ్రెండ్‌తో బాగా క్లోజ్‌గా ఉండగా తీసుకున్న సెల్ఫీలు సోషల్ సైట్లో అప్లోడ్ అయిపోయాయి. వైరస్‌లా ఇంటర్ నెట్ అంతా పాకేశాయి. వాటిని చూసి షాక్‌తిన్న ఈ సెక్సీ సుందరి... వెంటనే తన ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ పేజీలను డిలీట్ చేసేసింది. అసలవి తనవి కావని... మార్ఫింగ్ పిక్చర్స్ అని వాపోతోంది. అయితే ఈ అమ్మడే పబ్లిసిటీ కోసం కావాలని ఈ ఫొటోలను అప్లోడ్ చేసిందనేది కొందరి అభిప్రాయం. అలాంటిదేమీ లేదని... వసుంధర స్మార్ట్ ఫోన్‌ను కొందరు ఆకతాయిలు హ్యాకింగ్ చేసి, ఆ బొమ్మలు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టారన్నది మరికొందరి వాదన. -
అంతరిక్షం నుంచి సెల్ఫీ తీసుకుంటారా...
సోషల్ నెట్వర్కింగ్ సైట్లు, స్మార్ట్ఫోన్ల హవా కారణంగా సెల్ఫీల ట్రెండ్ ఊపందుకుంది. దీనిని ముందే అంచనా వేశారు కాబట్టే.. అక్కడా ఇక్కడా తీసుకుంటే ఏం మజా ఉంటుంది? ఏకంగా అంతరిక్షం నుంచే సెల్ఫీ(స్వీయ చిత్రం) తీసుకుంటే అదిరిపోదూ? అంటూ 2011లోనే రంగంలోకి దిగారు బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ షెఫీల్డ్ మాజీ విద్యార్థులు అలెక్స్ బేకర్, క్రిస్ రోస్‌లు. ఫొటోలు, వస్తువులను స్పేస్ బెలూన్‌కు కట్టి పైకి పంపడం, బెలూన్‌కు అమర్చిన కెమెరాలు, ఫోన్లతో అంతరిక్షంలో సెల్ఫీలు క్లిక్‌మనిపించడం, బెలూన్ నేలపై పడిన తర్వాత జీపీఎస్, గాలివాటం ఆధారంగా వస్తువులను వెతికి పట్టుకోవడం. రోజూ ఇదే పని వీరికి. ఇప్పుడిదే వీరికి వ్యాపారం అయింది. ఆసక్తి ఉన్నవారు సంప్రదిస్తే ఫొటోలు, వస్తువులను రోదసికి పంపించి అందమైన సెల్ఫీలను తీసిస్తారు. చనిపోయినవారి అస్థికలనూ పైకి పంపుతామని అంటున్నారు. ఒక్కసారి మన వస్తువులను పైకి పంపాలంటే రూ. 39 లక్షలు వసూలు చేస్తారు. మనమే పంపించుకుంటామంటే రూ. 48 వేలకే స్పేస్ బెలూన్లు ఇస్తారు. ఇంతవరకూ ఒకసారి తప్ప, అన్నిసార్లూ రోదసికి పంపించిన వస్తువులను వీరు తిరిగి పట్టుకోగలిగారట. -
రిల్ఫీస్ట్..
తల్పం ఉన్నప్పుడు గిల్పం ఎందుకు ఉండదు? ఉండే తీరుతుంది. కావాలంటే మరోసారి ‘మాయాబజార్’ సినిమా చూడండి. ఇక ‘సెల్ఫీ’ ఉన్నప్పుడు ‘రిల్ఫీ’ ఎందుకు ఉండదు? కచ్చితంగా ఉండే తీరుతుంది. ఇదే ఆలోచన వచ్చింది కొందరు నెటిజన్లకు. ఇంకేముంది? ‘సెల్ఫీ’ ట్రెండ్ ఇంకా పాతబడక ముందే, నయాట్రెండ్గా ‘రిల్ఫీ’ సోషల్ మీడియాలోకి దూసుకొచ్చింది. ఎవరి ఫొటోలు వాళ్లే తీసేసుకుని ‘ఫేస్బుక్’ వగైరా సోషల్ మీడియా వెబ్సైట్లలో ఎప్పటికప్పుడు పోస్ట్‌చేసే సెల్ఫీలతో నెటిజన్లకు మొహంమొత్తినట్లే ఉంది. ఎంత తుంటరి భంగిమల్లో ‘సెల్ఫీ’లు తీసుకుని పోస్టు చేసినా, ఒంటరి ముఖాలు ఎందరినని ఆకట్టుకోగలవు? ఆచితూచి అరుదుగా పోస్టుచేసే ‘సెల్ఫీ’లకు లెక్కించదగ్గ లైకులు, సన్నిహితుల కామెంట్లు పడతాయి. అదేపనిగా రోజూ ‘సెల్ఫీ’లను గుప్పిస్తుంటే, జిగిరీ దోస్తులకు సైతం జీవితం మీద విరక్తి కలిగే పరిస్థితి వస్తుంది. అంతవరకు ‘అదుర్స్’, ‘సూపరహో’ అని కామెంటిన వారు సైతం, ‘నీ మొహంలా ఉంది’ అంటూ ఏమాత్రం మొహమాటం లేకుండా కామెంట్ పరువు తీసేయగలరు. ఆన్లైన్లో ఇలాంటి అగ్నిపరీక్షాత్మక పరిస్థితులను తప్పించుకునేందుకే, కొందరు ఇంటెలిజెంట్ నెటిజన్లు ‘రిల్ఫీ’లతో హల్చల్ చేస్తున్నారు. బంధాలు బలోపేతం.. సన్నిహిత సంబంధం ఉన్నవారితో కలసి తీసుకునే ‘సెల్ఫీ’నే ‘రిల్ఫీ’. ఇంకోలా చెప్పాలంటే, ‘సెల్ఫీ’లా ఒంటరి కాదు, జంటరి. జంటగా దిగిన ఫొటోలను చూసేందుకు ఎవరికైనా కాస్త ఆసక్తి సహజం. అందుకే, ఆన్లైన్లో ‘సెల్ఫీ’ల కంటే ‘రిల్ఫీ’లపైనే ఎక్కువగా లైకుల వర్షం కురుస్తోంది. జంటరి ఫొటోలంటే ప్రేయసీప్రియుల ఫొటోలు, భార్యాభర్తల ఫొటోలు మాత్రమే కావు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, ప్రాణస్నేహితులు.. ఇలా ఎలాంటి సంబంధాన్నయినా బంధించేదే ‘రిల్ఫీ’. ‘రిల్ఫీ’లను తరచూ పోస్టు చేసే నెటిజన్లపై సర్వే చేస్తే, వారి సంబంధాలు బలంగా ఉన్నాయని పాశ్చాత్య దేశాల్లో నిర్వహించిన సర్వేల్లో తేలింది. ఆన్లైన్లో తమ సంబంధాలకు సంబంధించిన ‘రిల్ఫీ’ ఫొటోలను పోస్టు చేసేవారు తమ సంబంధాలను జాగ్రత్తగా కాపాడుకుంటారని కూడా తేలింది. ‘రిల్ఫీ’ల హవా ఏ స్థాయికి చేరుకుందంటే, వాటి కోసం ఏకంగా relfie.tumblr.com వెబ్‌సైటే పుట్టుకొచ్చింది. ‘సెల్ఫీ’స్ ఎంతైనా కాస్త సెల్ఫిష్‌గా కనిపిస్తాయి. ‘రిల్ఫీ’లు చూస్తే కాస్త రిలీఫ్‌గా ఉంటుందనేది వివిధ దేశాల నెటిజన్ల ఉవాచ. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ‘రిల్ఫీ’లతో ‘ఆన్లైన్’ను అదరగొట్టండి. - పన్యాల జగన్నాథదాసు