నోబెల్ సందేశం
‘కైలాష్ సత్యార్థి’ ఎవరు..? ఈ ప్రశ్న నేను ఒక వారం ముందు అడిగి ఉంటే సమాధానం విచిత్రంగా, అయోమయంగా వచ్చి ఉండేది. వారం కిందటి వరకూ ఎవరికీ సరిగా తెలియని భారతీయుడి గురించి ఇప్పుడు అందరం మాట్లాడుకుంటున్నాం. 1979లో మదర్ థెరిసా తర్వాత నోబెల్ శాంతి పురస్కారం అందుకున్న భారతీయ వ్యక్తి కైలాష్ సత్యార్థి అని భారతీయులందరూ సగర్వంగా మాట్లాడుకుంటున్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సప్ లాంటి సోషల్ మీడియాల్లో లక్షల్లో సందేశాలు షేర్ చేసుకుంటున్నారు. ఆయన ఎవరు, ఎక్కడుంటారు, ఏం చేస్తారన్న సెర్చులు మొదలయ్యాయి.
లోకల్‌గా చర్చల్లో లేని, మీడియాలో సంచలనం కాని, ప్రభుత్వ అవార్డులకు నోచుకోని ఓ సాధారణ పౌరుడు నార్వే కంట్లో ఎలా పడ్డాడు. అంతర్జాతీయ గుర్తింపు ఎలా పొందాడు. తాలిబన్ల చేతుల్లో నరకయాతన అనుభవించి, బాలికావిద్య గురించి పోరాటం చేసిన
పాకిస్థానీ బాలిక మలాలా గురించి ప్రపంచానికి తెలుసు. ఎందుకంటే ఆమె జీవితం ఓ సంచలనం. అందుకే నోబెల్ శాంతి పురస్కారం ఆమెకు దక్కిందంటే ఎవరికీ ఆశ్చర్యం కలగలేదు. మరి మన కైలాష్‌ను కూడా ఈ అవార్డు వరించిందంటే మాత్రం అందరిలో కుతూహలం బయల్దేరింది.
ఏ రంగంలో అయినా గొప్ప ఆవిష్కరణలు చేసి నోబెల్ పురస్కారం అందుకుంటే మనమంతా గర్వించవచ్చు. పండుగ చేసుకోవచ్చు. కానీ ఈ నోబెల్ శాంతి పురస్కారం మాత్రం పండుగ చేసుకునే అవకాశం కాదు. మనదేశంలో కష్టాల్లో ఉన్న బాల్యాన్ని చూడమని ఇచ్చిన సంకేతం. నమ్మిన సిద్ధాంతం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న సత్యార్థి ఏ పురస్కారం ఆశించి ఉండరు. బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా పని చేస్తున్న ఆయన పిలుపు వినడానికి ఒక ‘నోబెల్ పురస్కారం’ కావాల్సి వచ్చింది. కరిగిపోతున్న బాల్యాన్ని ఆదుకునేందుకు మనమందరం కలసి సాగాలని
ఈ నోబెల్ పిలుపునిస్తుంది.
ఆలోచిస్తే చాలు
బాల్యం అంటే మెరిసే కళ్ల అమాయకత్వం. బాదరబందీలు లేని బాల్యంలోకి మరోసారి వెళ్తే బాగుంటుందని ఒక్కసారైనా కోరుకుంటాం. కానీ.. అందరికీ ఇలాంటి అందమైన బాల్యం ఉండే అదృష్టం లేదు. నలిగిపోతున్న బాల్యం నుంచి రక్షించమని జాలిగా చూసే కళ్లు మన చుట్టూ ఉన్న సమాజంలో ఎన్నో ఉన్నాయి. పేదరికం, వెనుకబాటుతనం పిల్లల పాలిట శాపంగా మారుతున్నాయి. అందుకే అందమైన బాల్యం కష్టాల కొలిమిలో
కార్మిక అవస్థగా మారుతోంది. దీనికి తల్లిదండ్రులనో, యాజమాన్యాలనో నిందిస్తే
సరిపోతుందా..? చట్టాలు చేసి చేతులు దులుపుకున్న ప్రభుత్వాలను, కళ్లెదుటే పసిమొగ్గలు మసిబారుతున్నా పట్టించుకోని సమాజాన్ని వదిలేద్దామా..? ఎందుకీ నిస్తేజం అని
ప్రశ్నిస్తున్న సత్యార్థి, శాంతి సిన్హా, హర్ష్ మందర్ వంటి బాలల హక్కుల ఉద్యమకారులను
మనం సీరియస్‌గా తీసుకోం.
స్పందిస్తే మేలు..
బాల కార్మికులు, బాల్య వివాహాలు, బడికి పంపకపోవడం, లైంగిక వేధింపులు ఇవన్నీ ఎక్కడో దూరంగా పేదింటి పిల్లలకే ఎదురవుతున్నాయని.. వాటితో మనకు సంబంధం లేనట్టు అంటీముట్టనట్టు ప్రవర్తిస్తాం. అదే ఓ కార్పొరేట్ స్కూల్‌లో విద్యార్థిని టీచర్ కాస్త కఠినంగా శిక్షిస్తే.. బ్రేకింగ్ న్యూస్‌లతో ఖండించి పారేస్తాం. మరి ఇదే ఆవేశం పేదింటి
పిల్లలకు వర్తించదా..? మన పిల్లలను చూసుకున్నట్టు ఊళ్లోని చిన్నారులందరినీ ఎలా
చూసుకోగలం అని ఎదురు ప్రశ్నించే వారికి నాదో చిన్నమాట. మీరు ఎవరి బాధ్యత
తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ బాలల సమస్యలపై స్పందిస్తే చాలు. వారి హక్కులను కాలరాస్తున్నవారు వెనుకడుగు వేస్తారు. అనాథ బాలలను ఆదుకోవడానికి ఏర్పడిన
సంస్థలను ప్రోత్సహిస్తే అందమైన బాల్యాన్ని ఆదరించినవారం అవుతాం.
సహకరిస్తే జేజేలు..
సరైన ఆదరణ లేక రోడ్డెక్కిన బాల్యాన్ని తప్పుదోవ పట్టించేందుకు అసాంఘిక శక్తులు కాచుకు కూర్చుంటాయి. వాటి చేతికి చిక్కకుండా బాలలను సంరక్షించే సంస్థలు కొన్ని ఉన్నాయి. ఎవరికీ అవసరం లేని ఈ పిల్లల బాధ్యతను తీసుకుని వారికి ఆసరాగా నిలుస్తున్నాయి. మన హైదరాబాద్‌లో ఎస్‌వోఎస్, ఎమ్వీ ఫౌండేషన్, రెయిన్‌బో హోమ్స్, దివ్యదశ వంటి స్వచ్ఛంద సంస్థలు పిల్లలకు తగిన హోమ్స్ నిర్వహిస్తున్నాయి. మనకు తోచిన రీతిలో వీటికి సహకరించ వచ్చు. అంతేకాదు.. మన చుట్టూ ఉన్న సమాజంలో బాలలహితంగా లేని పరిస్థితులను సరిదిద్దవచ్చు. అవసరమైతే ఎదిరించొచ్చు. అందరం కలిస్తే అందమైన బాల్యాన్ని ఆనందంగా ఎదగనివ్వవచ్చు. నోబెల్ శాంతి పురస్కారంతో దేశాన్ని తట్టిలేపిన కైలాష్ సత్యార్థి గారికి అభినందనలతో.. నేను సైతం.