వీ బ్లాగ్.. యూ లాగ్
బ్లాగింగ్ దునియా.. సోషల్ మీడియాలో ఓ సంచలనం. కొద్దిగా సామాజిక స్పృహ, మంచి చెడులపై స్పందించే తత్వం.. కాస్త రాయగలిగే తనం.. ఈ గుణాలు ఉన్నవారు బ్లాగర్స్‌గా రాణిస్తూ బాగు బాగు అని పదుగురి కితాబు అందుకుంటున్నారు. అయితే దీనికే కాస్త ఆధునికతను జోడించి కదిలే చిత్రాలుగా మలిచి సంచలనం సృష్టిస్తున్నారు వీడియో బ్లాగర్స్. యూట్యూబ్ వేదికగా పురుడుపోసుకున్న వీబ్లాగ్స్ .. నయా జనరేషన్‌కు నవ ఆనందాన్ని పంచుతున్నాయి.
- త్రిగుళ్ల నాగరాజు
కవితకు అనర్హమైన వస్తువేదీ లేదు. ఇదే సూత్రాన్ని కథనానికీ అప్లై చేస్తున్నారు వీబ్లాగర్స్. వంటింటి చిట్కాలు.. పడకింటి ముచ్చట్లు.. పక్కింటి అచ్చట్లు.. అన్నింటినీ సంక్షిప్త చిత్రాలుగా మలిచి వీబ్లాగ్స్‌లో అప్‌లోడ్ చేస్తూ విస్తుపోయేలా చేస్తున్నారు. విషయం పాత చింతకాయ పచ్చడే అయినా.. దానికి కొంత క్రియేటివిటీ.. ఇంకాస్త హాస్యాన్ని జోడించి.. వహ్వా అనిపిస్తున్నారు. కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన స్మార్ట్ ఫోన్ ఎలా యూజ్ చేయాలి.., అనుకోకుండా ఊపిరి తీసుకోవడం ఆగిపోతే ప్రాథమిక చికిత్స ఎలా అందించాలి.. లాంటి విషయాలను రెండు, మూడు నిమిషాల నిడివి ఉన్న వీడియోగా మలిచి వీబ్లాగ్స్‌లో ఉంచుతున్నారు.
వెస్ట్రన్ గడప దాటి..
వెస్ట్రన్ కంట్రీస్‌లో వీబ్లాగ్స్ ముచ్చట ఇప్పటిది కాదు. వీడియో గేమ్ కామెంటేటర్‌గా పేరుమోసిన ప్యూ డై పై.. వీ బ్లాగర్‌గా మారాక మరింత పేరుప్రఖ్యాతులు మూటగట్టుకున్నాడు. రెండేళ్లుగా ఈయనగారు వీబ్లాగ్‌లో అప్‌లోడ్ చేస్తున్న కథనాలు చూపరులను తెగ అట్రాక్ట్ చేస్తున్నాయి. వెస్ట్రన్ గడపదాటి ఇండియాకొచ్చిన వీబ్లాగ్స్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. ఇటీవల మంచి ఆదరణ పొందుతున్న వీబ్లాగ్స్‌కు హైదరాబాద్ కూడా ఫిదా అయిపోయింది. దీంతో రోజు రోజుకూ సిటీలో వీ బ్లాగర్ల సంఖ్య పెరుగుతోంది. అయితే వీబ్లాగ్స్‌కు వచ్చినంత గుర్తింపు వాటిని రన్ చేస్తున్న బ్లాగర్లకు రావడం లేదంటున్నారు నెటిజన్లు.
థీమ్ ఫుల్..
పొరుగింటి పుల్లకూర మనింటికి తీసుకొచ్చి తమదైన స్టయిల్‌లో రీజనరేట్ చేస్తున్నారు హైదరాబాదీ వీబ్లాగర్స్. చిన్న చిన్న అంశాలను తీసుకుని దక్కనీ లాంగ్వేజ్‌లో పిక్చరైజ్ చేసి అదరహో అనిపిస్తున్నారు. సిటీలో అడ్రస్ అడగడం.. హ్యూమన్ బిహేవియర్.. ట్రాఫికర్.. ఇలా డిఫరెంట్ థీమ్స్ ఎంచుకుని సంక్షిప్త చిత్రాలను తీసి బ్లాగ్‌లో ఉంచుతున్నారు. వీటిని చూసిన జనం కాసేపు రిలాక్స్ అవ్వడంతో పాటు.. ఇంతో అంతో రియలైజ్ అవుతున్నారు. అంతెందుకు ఏదైనా సినిమా రిలీజ్ కాగానే.. రివ్యూలు చూడటం సర్వసాధారణం.
రివ్యూలో రేటింగ్స్‌ను బట్టే చాలామంది థియేటర్లకు వెళ్తున్నారు. రివ్యూ చదివే ఓపిక లేని వారి కోసం వీబ్లాగర్స్ వీటిని కూడా వీడియో తీసి బ్లాగ్‌లో పెట్టేస్తున్నారు. రెండు, మూడు నిమిషాలు సరదాగా సాగిపోయే ఈ రివ్యూ పాయింట్.. ఫన్ క్రియేట్ చేయడంతో పాటు.. సదరు మూవీపై ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ చేస్తోంది. మొత్తానికి యూట్యూబ్‌లో వీబ్లాగర్స్ చేస్తున్న హడావుడి.. దానికి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే.. రానున్న రోజుల్లో వీబ్లాగ్స్‌కు మరింత ఆదరణ లభించడం ఖాయంగా కనిపిస్తోంది.