భాగ్ మిల్‌కే భాగ్ | bhag milke bhag | Sakshi
Sakshi News home page

భాగ్ మిల్‌కే భాగ్

Published Thu, Nov 27 2014 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 5:10 PM

భాగ్ మిల్‌కే భాగ్

భాగ్ మిల్‌కే భాగ్

గ్లోబల్ సిటీగా మారిన తర్వాత హైదరాబాద్ సరికొత్త ఈవెంట్లకు వేదికగా నిలుస్తోంది. అలా మన సిటీకి వచ్చి హైదరాబాదీలను పరుగులెత్తిస్తున్న ఈవెంటే మారథాన్ రన్. ఇటీవల ఈ బహుదూరపు పరుగు పందేనికి ఆదరణ విపరీతంగా పెరిగింది. రాజధాని వీధులు 5కే, 10కే రన్‌లకు తరచుగా రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. తాజాగా ఈనెల 30న హైదరాబాద్ 10కే రన్ ఫౌండేషన్ 10కే మారథాన్ నిర్వహిస్తోంది. ఫ్లయింగ్ సిఖ్ ఆఫ్ ఇండియాగా పేరొందిన మిల్కాసింగ్ దీనికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. చిన్నాపెద్దా ఇలా అందరితో సాగే ఈ రన్‌ను సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ చేయడానికి రీబాక్ రన్నర్ స్క్వాడ్ ట్రైనర్ శిబ మెహ్రా కొన్ని సూచనలు చేస్తున్నారు.
- త్రిగుళ్ల నాగరాజు
 
ఉరకలు వేసే మనసున్న ప్రతి హైదరాబాదీ మారథాన్‌లో పరుగులు తీస్తున్నారు. అయితే 5కే, 10కే ఇలా సుదూర లక్ష్యంతో సాగే రన్‌ను ఆటవిడుపు అనుకుంటే పొరపాటే. తగిన ప్రాక్టీస్, సరైన ఫిట్‌నెస్ లేకుండా రంగంలోకి దిగితే మీ పరుగు మధ్యలోనే ఆగిపోతుందంటున్నారు నిపుణులు. ఎంతో ఉత్సాహంగా స్టార్టయ్యే ఈ పరుగు అంతే ఉల్లాసంగా పూర్తి చేయాలంటే ప్రొఫెషనల్ గెడైన్స్ తప్పనిసరి. ముందస్తుగా సన్నద్ధం అయితే ‘రన్’రంగంలో  అలసట మీ దరి చేరదని చెబుతున్నారు.
 
అడుగులకు తొడుగులు..
కేరింతలతో మొదలయ్యే మారథాన్ రన్ కేక అనిపించాలంటే అందుకు మీ పాదాలు సిద్ధంగా ఉండాలి. మీ అడుగులకు మడుగులొత్తే తొడుగులు ఉంటేగానీ అది సాధ్యం కాదు. సరైన షూస్ లేకుండా ట్రాక్ ఎక్కితే అరికాళ్లకు బొబ్బలు బహుమతిగా వస్తాయి. మీ పాదాలకు సూటయ్యే షూస్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మీ పరుగు మెరుగుపరచుకోవచ్చు. అంతేకాదు డ్రెస్సింగ్ కూడా రన్‌ను ప్రభావితం చేస్తుంది. ఈవెంట్ ముందు రోజు కొత్త డ్రెస్ తీసుకోవడం కరెక్ట్ కాదు. ఇంతకు ముందు ట్రై చేసిన వాటిని వేసుకోవడం మంచిది.
 
అంతకు ముందు.. ఆ తర్వాత..
పరుగు పందేనికి మానసికంగా ఎలా రెడీ అవుతారో.. శారీరకంగా కూడా సన్నద్ధంగా ఉండాలి. రన్‌కు ముందు కాసేపు వార్మప్ కంపల్సరీ. డైనమిక్ స్ట్రెచెస్ చేయడం ద్వారా పరుగులో మీ కండరాలు పట్టేయకుండా ఉంటాయి. 3..2..1.. గో అనగానే పరుగు లంఘించుకుని అందర్నీ ఓవర్‌టేక్ చేస్తూ దూసుకెళ్తుంటారు. ఇలా చేస్తే ముందు ఆయాసం.. ఆపై నీరసం వస్తుంది. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనే ఫార్ములాను ఫాలో అవ్వడం కరెక్ట్. రన్ పూర్తయిన తర్వాత కూడా కాసేపు స్ట్రెచెస్ చేయడం ద్వారా మీ బాడీ రిలాక్స్ అవుతుంది.
 
ఈట్ అండ్ డ్రింక్..
మారథాన్ రన్‌కు రెండు రోజుల ముందు నుంచి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవడం మంచిది. ఇది మీ పరుగుకు ప్రైమరీ ఫ్యూయల్‌గా పని చేస్తుంది. మీరు తీసుకునే ఆహారంలో 70 శాతం పిండి పదార్థాలు, 30 శాతం ప్రొటీన్స్ ఉండేలా చూసుకోండి. పరుగు మొదలయ్యాక బాడీని మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. దాహం డీ హైడ్రేషన్‌కు సూచిక. రన్‌లో 20 నిమిషాలకోసారి వాటర్ తీసుకోవాలి.
 
మనసు మాట వినండి..
పరుగు పందెంలో అన్‌కంఫర్టబుల్‌గా ఫీలైన మరుక్షణం ఆగిపోండి. మొండిగా ముందుకు సాగితే కండరాలు పట్టేసే ప్రమాదం ఉంది. ఇక ఫస్ట్‌టైం మారథాన్‌లో పాల్గొంటున్నవారు వీలైనంత వరకూ గ్రూప్‌లో కలసి పరిగెత్తడం మంచిది. లాంగ్ రన్‌లో అందరితో సాగితే ఎంజాయ్ చేయగలరు. ఈ సూత్రాలు ఫాలో అయితే మారథాన్‌ను ఖుషీగా పూర్తి చేయొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ భాగ్ మిల్‌కే భాగ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement