Trigulla Nagaraju
-
ఫేస్బుక్ ఓపెన్ చేసే కొద్దీ పుట్టుకొస్తున్న..
ఒకప్పుడు స్నేహితులంటే క్లాస్మేట్స్.. పక్కింటి పిల్లలు..!! కాస్త కలివిడితనం ఉన్నవారు సదరు స్నేహితుల మిత్రులను కూడా నేస్తాలుగా చేసుకునేవారు. అరచేతిలో.. స్మార్ట్ ప్రపంచం వచ్చి పడ్డాక విశ్వ మంతా స్నేహితులే. ఫ్రెండ్స్.. ఫ్రెండ్స్.. ఆ ఫ్రెండ్స్‌ను ఫాలో అయ్యేవారు.. ఇలా.. ముక్కూముఖం తెలియని వారు కూడా ఫ్రెండ్స్ లిస్ట్‌లో చేరిపోతున్నారు. ఫేస్బుక్ ఓపెన్ చేసే కొద్దీ పుట్టుకొస్తున్న కొత్త స్నేహాల వికృత చేష్టలు నిఖార్సయిన మిత్రులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. - త్రిగుళ్ల నాగరాజు రమేష్, సురేష్ కొత్త స్నేహితులు.. ఇద్దరినీ కలిపింది ఫేస్బుక్కే. రమేష్ ఓ ఫొటో పోస్ట్ చేశాడు. సురేష్ దాన్ని లైక్ చేయలేదు. ఇంకేముంది మిత్రబేధం స్టార్ట్. సురేష్‌ను క లవమని చెప్పిన రమేష్.. ‘లైక్ ఎందుకు కొట్టలేదురా..!’ అంటూ అతడ్ని చితకబాదాడు. ఈ సంఘటన ఇటీవల మన సైబరాబాద్ పరిధిలో జరిగిందే. వాట్సప్ గ్రూప్‌లో తను కోరిన అమ్మాయి ఫొటో అప్లోడ్ చేయనందుకు మరో యువకుడు గ్రూప్ అడ్మిన్‌పై దాడి చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే.. సోషల్ మీడియాకెక్కిన స్నేహితులు.. సోషల్ యానిమల్స్‌లా బిహేవ్ చేయడం మరిచిపోయారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు, యువతకు ఆన్లైన్ భద్రతపై ఇటీవల ఓ టెక్నాలజీ సంస్థ సిటీ వేదికగా నిర్వహించిన సర్వేలో తేలిన వివరాలివీ.. ఫేక్‌ఫ్రెండ్స్.. ఆన్లైన్ తప్ప అన్యమెరగని సిటీ యువత.. ఉనికి చాటుకోవడానికి ఫేస్‌బుక్‌ను మించిన వేదిక లేదని భావిస్తోంది. ఆన్లైన్ ఫ్రెండ్స్‌ను లెక్కకు మించి పెంచేసుకోవాలని ఆరాటపడుతున్న వారి సంఖ్య సిటీలో రోజురోజుకూ పెరుగుతోందని సదరు సర్వే సారాంశం. ఫేస్బుక్ వాడుతున్న వారిలో తాము పోస్ట్ చేసిన వాటికి వచ్చిన లైకులను లెక్కకట్టి మరీ గొప్పలుగా చెప్పుకునే వారు 72 శాతం మంది ఉన్నారని తెలిసింది. ఇక 75 శాతం మంది తమ పోస్ట్‌లకు అత్యధికంగా లైక్‌లు రావాలని కోరుకుంటున్నారట. 73 శాతం మంది తప్పుడు సమాచారంతోనైనా.. తమ గొప్పతనం చాటుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారట. ఇక ఆశించిన మేర లైకులు, షేర్లు రాకపోతే.. 58 శాతం మంది ఏదో కోల్పోయామన్న ఫీలింగ్‌తో ఒత్తిడికి గురవుతున్నారని సర్వేలో తేలింది. అజ్ఞాతానందకారులు.. స్మార్ట్‌ఫోన్‌ను రెండు వేళ్లతో స్మార్ట్‌గా డీల్ చేస్తున్న ఎదిగిన బిడ్డల చేష్టలను చూసిన తల్లిదండ్రుల్లో కొందరు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంటర్నెట్ వాడకాన్ని స్ట్రిక్ట్‌గా నిషేధిస్తున్నారు కూడా. 64 శాతం మంది తల్లిదండ్రులు తమ సంతానగోపాలం చర్యలను ఓ కంట కనిపెడుతున్నారని సర్వే లెక్కలు చెప్పాయి. పేరెంట్స్ స్పందన ఇలా ఉంటే.. తల్లిదండ్రులకు తెలియకుండా.. ఆన్లైన్లో విహరించే యువత సంఖ్య సిటీలో రమారమీగా 68 శాతంగా లెక్క తేలింది. వీరంతా తమ ఆన్లైన్ లాఘవం గురించి తల్లిదండ్రులకు తెలియాల్సిన అవసరం లేదని వాదిస్తున్నారు. ఈ లెక్కలు ఇలా ఉంటే.. స్మార్ట్ గేర్‌లో దూసుకుపోతున్న సిటీ యువతలో 57 శాతం మంది ఆన్లైన్లో అజ్ఞాత వ్యక్తులతో లింకవుతున్నారు. అంతేకాదు.. అకౌంట్ హ్యాకింగ్, సైబర్ వేధింపులు ఎదురైతే ఎలా స్పందించాలో తెలియని వారి లెక్క 70 శాతంగా తేలింది. ఈ లెక్కన ఆన్లైన్లో విహరిస్తున్న యువతీయువకులను తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు ఐటీ నిపుణులు. అందుబాటులో ఉన్న పరిజ్ఞానాన్ని అవరసం మేరకే ఉపయోగించుకోవాలే తప్ప.. అదే ప్రపంచంగా భావించొద్దని హితవు పలుకుతున్నారు. -
వీ బ్లాగ్.. యూ లాగ్
బ్లాగింగ్ దునియా.. సోషల్ మీడియాలో ఓ సంచలనం. కొద్దిగా సామాజిక స్పృహ, మంచి చెడులపై స్పందించే తత్వం.. కాస్త రాయగలిగే తనం.. ఈ గుణాలు ఉన్నవారు బ్లాగర్స్గా రాణిస్తూ బాగు బాగు అని పదుగురి కితాబు అందుకుంటున్నారు. అయితే దీనికే కాస్త ఆధునికతను జోడించి కదిలే చిత్రాలుగా మలిచి సంచలనం సృష్టిస్తున్నారు వీడియో బ్లాగర్స్. యూట్యూబ్ వేదికగా పురుడుపోసుకున్న వీబ్లాగ్స్ .. నయా జనరేషన్‌కు నవ ఆనందాన్ని పంచుతున్నాయి. - త్రిగుళ్ల నాగరాజు కవితకు అనర్హమైన వస్తువేదీ లేదు. ఇదే సూత్రాన్ని కథనానికీ అప్లై చేస్తున్నారు వీబ్లాగర్స్. వంటింటి చిట్కాలు.. పడకింటి ముచ్చట్లు.. పక్కింటి అచ్చట్లు.. అన్నింటినీ సంక్షిప్త చిత్రాలుగా మలిచి వీబ్లాగ్స్లో అప్లోడ్ చేస్తూ విస్తుపోయేలా చేస్తున్నారు. విషయం పాత చింతకాయ పచ్చడే అయినా.. దానికి కొంత క్రియేటివిటీ.. ఇంకాస్త హాస్యాన్ని జోడించి.. వహ్వా అనిపిస్తున్నారు. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన స్మార్ట్ ఫోన్ ఎలా యూజ్ చేయాలి.., అనుకోకుండా ఊపిరి తీసుకోవడం ఆగిపోతే ప్రాథమిక చికిత్స ఎలా అందించాలి.. లాంటి విషయాలను రెండు, మూడు నిమిషాల నిడివి ఉన్న వీడియోగా మలిచి వీబ్లాగ్స్లో ఉంచుతున్నారు. వెస్ట్రన్ గడప దాటి.. వెస్ట్రన్ కంట్రీస్‌లో వీబ్లాగ్స్ ముచ్చట ఇప్పటిది కాదు. వీడియో గేమ్ కామెంటేటర్‌గా పేరుమోసిన ప్యూ డై పై.. వీ బ్లాగర్‌గా మారాక మరింత పేరుప్రఖ్యాతులు మూటగట్టుకున్నాడు. రెండేళ్లుగా ఈయనగారు వీబ్లాగ్లో అప్లోడ్ చేస్తున్న కథనాలు చూపరులను తెగ అట్రాక్ట్ చేస్తున్నాయి. వెస్ట్రన్ గడపదాటి ఇండియాకొచ్చిన వీబ్లాగ్స్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. ఇటీవల మంచి ఆదరణ పొందుతున్న వీబ్లాగ్స్కు హైదరాబాద్ కూడా ఫిదా అయిపోయింది. దీంతో రోజు రోజుకూ సిటీలో వీ బ్లాగర్ల సంఖ్య పెరుగుతోంది. అయితే వీబ్లాగ్స్కు వచ్చినంత గుర్తింపు వాటిని రన్ చేస్తున్న బ్లాగర్లకు రావడం లేదంటున్నారు నెటిజన్లు. థీమ్ ఫుల్.. పొరుగింటి పుల్లకూర మనింటికి తీసుకొచ్చి తమదైన స్టయిల్లో రీజనరేట్ చేస్తున్నారు హైదరాబాదీ వీబ్లాగర్స్. చిన్న చిన్న అంశాలను తీసుకుని దక్కనీ లాంగ్వేజ్‌లో పిక్చరైజ్ చేసి అదరహో అనిపిస్తున్నారు. సిటీలో అడ్రస్ అడగడం.. హ్యూమన్ బిహేవియర్.. ట్రాఫికర్.. ఇలా డిఫరెంట్ థీమ్స్ ఎంచుకుని సంక్షిప్త చిత్రాలను తీసి బ్లాగ్‌లో ఉంచుతున్నారు. వీటిని చూసిన జనం కాసేపు రిలాక్స్ అవ్వడంతో పాటు.. ఇంతో అంతో రియలైజ్ అవుతున్నారు. అంతెందుకు ఏదైనా సినిమా రిలీజ్ కాగానే.. రివ్యూలు చూడటం సర్వసాధారణం. రివ్యూలో రేటింగ్స్‌ను బట్టే చాలామంది థియేటర్లకు వెళ్తున్నారు. రివ్యూ చదివే ఓపిక లేని వారి కోసం వీబ్లాగర్స్ వీటిని కూడా వీడియో తీసి బ్లాగ్‌లో పెట్టేస్తున్నారు. రెండు, మూడు నిమిషాలు సరదాగా సాగిపోయే ఈ రివ్యూ పాయింట్.. ఫన్ క్రియేట్ చేయడంతో పాటు.. సదరు మూవీపై ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ చేస్తోంది. మొత్తానికి యూట్యూబ్‌లో వీబ్లాగర్స్ చేస్తున్న హడావుడి.. దానికి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే.. రానున్న రోజుల్లో వీబ్లాగ్స్కు మరింత ఆదరణ లభించడం ఖాయంగా కనిపిస్తోంది. -
పుష్పవిలాసం
నేడు ఫ్లోరల్ డిజైనింగ్ డే కొమ్మ కొమ్మకు విరబూసిన సన్నాయిలు.. ఎవరో నేర్పినట్లు హరి పూజకు తొందర చేస్తుంటాయి. అలాగని కొమ్మకు పూసిన ప్రతి పువ్వూ పూజకు అంకితం కాలేవుగా..! అందుకే కొన్ని విరులు సొగసుగత్తెల సిగలో ఒదిగిపోతాయి. ఇంకొన్ని పూబాలలు గజమాలల్లో చోటు దక్కించుకుని ఒకింత గర్వంగా ఫీలవుతుంటాయి. మరికొన్ని అభినందనలు అందించే బొకేల్లో అందంగా కుదురుకుంటాయి. పుట్టిన రోజు వేడుక మొదలు.. ప్రేమికుల రాయబారాల్లో, పెళ్లి సందడిలో, ఆ వెంటనే జరిగే ఆ ముచ్చటలో.. అంతెందుకు చివరికి పరమపదానికి సాగే తుదియాత్రలోనూ పూల పరిమళం తోడుంటుంది. అందుకే తాకితే కందిపోయే విరులు డెకరేషన్ హంగులు అందుకుని ఎందరికో ఉపాధి కల్పిస్తూ సిరులు కురిపిస్తున్నాయి. పూజలుసేయ పూలు తెస్తాం. ఇంట్లో ఏ వేడుక జరిగినా పుష్ప విలాసం తప్పనిసరిగా వికసిస్తుంది. ఇక పెళ్లిళ్లకు, పేరంటాలకు రకరకాల విరులు విరివిగా గుసగుసలాడుతూనే ఉంటాయి. కొన్నేళ్లు వెనక్కి వెళ్తే పెళ్లిసందడికి నాలుగైదు రోజులు ముందుగానే.. బంధుసందడి మొదలయ్యేది. వివాహ వేడుకకు ముందు రోజు మాలికల అల్లిక తంతు ప్రత్యేకంగా ఉండేది. అమ్మలక్కలు, పరికిణీల్లో పడతులు అంతా ఒక్కచోట చేరి.. గంపలుగా కోసుకొచ్చిన పూలను.. గమ్మత్తయిన సొదలు చెప్పుకుంటూ.. గుత్తులు, గుత్తులుగా కట్టేవారు. ఆడవారే కాదు.. మగాళ్లూ ఈ పూల అల్లికల ఎపిసోడ్లో పాల్గొనేవారు. అలా అల్లిన హారాలు, ద్వారాలకు తోరణాలుగా.. పెళ్లిపందిరికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి. అలంకరణ తృణప్రాయం.. ప్రస్తుతం ఏ వేడుకకైనా బంధుగణం.. సుముహూర్తానికి గంట ముందు విచ్చేస్తోంది. రొటీన్ లైఫ్‌లో వచ్చిన స్పీడే.. ఫంక్షన్స్‌లోనూ వచ్చేసింది. వెరసి.. బర్త్‌డేలు, పెళ్లిళ్లు, ఇతరత్రా శుభకార్యాలకు పూల సొబగులు అద్దడానికి ఫ్లోరిస్ట్‌లు పుట్టుకొచ్చారు. బంతులు, చామంతులే కాదు.. రకరకాల రోజాలు.. వీటికి దోస్తీగా కొత్తగా విరబూసిన డఫోడిల్, దాలియా, సూర్యకాంత పూలు, ఆర్కిడ్ వంటి మేలిజాతి పుష్పాలను కలగలిపి అందంగా డెకరేట్ చేస్తున్నారు. పూల సొగసులకు దీటుగా 17 రకాల అలంకరణ గడ్డి పరకలు కూడా పరుస్తూ కల్యాణ మంటపం ఎంట్రన్స్ నుంచే పచ్చదనంతో కనువిందు చేస్తున్నారు. ఈ వేడుకలకు హాజరవుతున్న అతిథులు కూడా పూల బొకేలను తీసుకొచ్చే ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. క్రియేటివిటీతో ముందుకు.. ప్రస్తుతం ఫ్లోరిస్ట్ సెక్టార్ వేగంగా విస్తరిస్తోంది. సిటీ సెంట్రల్ నుంచి శివార్ల వరకూ వీళ్లు పాతుకుపోయారు. సిటీలో చిన్న బర్త్ డే పార్టీల నుంచి రాజకీయ నేతల ప్రమాణస్వీకార మహోత్సవాల వరకూ పూల అలంకరణ సర్వసాధారణమైంది. దీంతో ఈ రంగంలో ఉపాధి అవకాశాలు విపరీతంగా పెరిగాయి. చదువు అంతంత మాత్రంగా ఉన్నా, కాస్త క్రియేటివిటీ, ఇంకాస్త బిజినెస్ మైండ్ ఉన్నవారు ఈ రంగంలో బాగానే రాణిస్తున్నారు. బొకేల తయారీతో బిజినెస్ చేస్తూనే ఈవెంట్లకు డెకరేటర్స్గా మారిపోతున్నారు. ఫ్లవర్స్ ఫ్రమ్ బెంగళూరు.. ఇక్కడ తయారయ్యే బొకేలకు, డెకరేషన్స్‌కు మెజార్టీ పూలు బెంగళూరు నుంచే దిగుమతి అవుతున్నాయి. అత్యవరసరమైతే విమానాల్లో కూడా తీసుకొస్తున్నారు. ‘ప్రస్తుతం గ్రీన్ కల్టివేషన్ ఇంపార్టెన్స్ పెరగడంతో నగరాన్ని ఆనుకుని ఉన్న పలు జిల్లాల్లో పూలతోటల పెంపకం జోరందుకుంది. రానున్న రోజుల్లో ఇక్కడి పూలు మార్కెట్లో భాగస్వామ్యం పంచుకోనున్నాయి’ అని వివరించారు ఫ్లోరిస్ట్ మోసిన్ ఖాన్. ఈ పూలనే పెట్టుబడిగా పెట్టి సిటీలోఎందరో జీవనం సాగిస్తున్నారు. వారందరికీ ఫ్లోరల్ డిజైనింగ్ డే శుభాకాంక్షలు. - త్రిగుళ్ల నాగరాజు -
భాగ్ మిల్కే భాగ్
గ్లోబల్ సిటీగా మారిన తర్వాత హైదరాబాద్ సరికొత్త ఈవెంట్లకు వేదికగా నిలుస్తోంది. అలా మన సిటీకి వచ్చి హైదరాబాదీలను పరుగులెత్తిస్తున్న ఈవెంటే మారథాన్ రన్. ఇటీవల ఈ బహుదూరపు పరుగు పందేనికి ఆదరణ విపరీతంగా పెరిగింది. రాజధాని వీధులు 5కే, 10కే రన్లకు తరచుగా రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. తాజాగా ఈనెల 30న హైదరాబాద్ 10కే రన్ ఫౌండేషన్ 10కే మారథాన్ నిర్వహిస్తోంది. ఫ్లయింగ్ సిఖ్ ఆఫ్ ఇండియాగా పేరొందిన మిల్కాసింగ్ దీనికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. చిన్నాపెద్దా ఇలా అందరితో సాగే ఈ రన్‌ను సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ చేయడానికి రీబాక్ రన్నర్ స్క్వాడ్ ట్రైనర్ శిబ మెహ్రా కొన్ని సూచనలు చేస్తున్నారు. - త్రిగుళ్ల నాగరాజు ఉరకలు వేసే మనసున్న ప్రతి హైదరాబాదీ మారథాన్‌లో పరుగులు తీస్తున్నారు. అయితే 5కే, 10కే ఇలా సుదూర లక్ష్యంతో సాగే రన్‌ను ఆటవిడుపు అనుకుంటే పొరపాటే. తగిన ప్రాక్టీస్, సరైన ఫిట్నెస్ లేకుండా రంగంలోకి దిగితే మీ పరుగు మధ్యలోనే ఆగిపోతుందంటున్నారు నిపుణులు. ఎంతో ఉత్సాహంగా స్టార్టయ్యే ఈ పరుగు అంతే ఉల్లాసంగా పూర్తి చేయాలంటే ప్రొఫెషనల్ గెడైన్స్ తప్పనిసరి. ముందస్తుగా సన్నద్ధం అయితే ‘రన్’రంగంలో అలసట మీ దరి చేరదని చెబుతున్నారు. అడుగులకు తొడుగులు.. కేరింతలతో మొదలయ్యే మారథాన్ రన్ కేక అనిపించాలంటే అందుకు మీ పాదాలు సిద్ధంగా ఉండాలి. మీ అడుగులకు మడుగులొత్తే తొడుగులు ఉంటేగానీ అది సాధ్యం కాదు. సరైన షూస్ లేకుండా ట్రాక్ ఎక్కితే అరికాళ్లకు బొబ్బలు బహుమతిగా వస్తాయి. మీ పాదాలకు సూటయ్యే షూస్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మీ పరుగు మెరుగుపరచుకోవచ్చు. అంతేకాదు డ్రెస్సింగ్ కూడా రన్‌ను ప్రభావితం చేస్తుంది. ఈవెంట్ ముందు రోజు కొత్త డ్రెస్ తీసుకోవడం కరెక్ట్ కాదు. ఇంతకు ముందు ట్రై చేసిన వాటిని వేసుకోవడం మంచిది. అంతకు ముందు.. ఆ తర్వాత.. పరుగు పందేనికి మానసికంగా ఎలా రెడీ అవుతారో.. శారీరకంగా కూడా సన్నద్ధంగా ఉండాలి. రన్‌కు ముందు కాసేపు వార్మప్ కంపల్సరీ. డైనమిక్ స్ట్రెచెస్ చేయడం ద్వారా పరుగులో మీ కండరాలు పట్టేయకుండా ఉంటాయి. 3..2..1.. గో అనగానే పరుగు లంఘించుకుని అందర్నీ ఓవర్టేక్ చేస్తూ దూసుకెళ్తుంటారు. ఇలా చేస్తే ముందు ఆయాసం.. ఆపై నీరసం వస్తుంది. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనే ఫార్ములాను ఫాలో అవ్వడం కరెక్ట్. రన్ పూర్తయిన తర్వాత కూడా కాసేపు స్ట్రెచెస్ చేయడం ద్వారా మీ బాడీ రిలాక్స్ అవుతుంది. ఈట్ అండ్ డ్రింక్.. మారథాన్ రన్‌కు రెండు రోజుల ముందు నుంచి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవడం మంచిది. ఇది మీ పరుగుకు ప్రైమరీ ఫ్యూయల్‌గా పని చేస్తుంది. మీరు తీసుకునే ఆహారంలో 70 శాతం పిండి పదార్థాలు, 30 శాతం ప్రొటీన్స్ ఉండేలా చూసుకోండి. పరుగు మొదలయ్యాక బాడీని మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. దాహం డీ హైడ్రేషన్‌కు సూచిక. రన్లో 20 నిమిషాలకోసారి వాటర్ తీసుకోవాలి. మనసు మాట వినండి.. పరుగు పందెంలో అన్‌కంఫర్టబుల్‌గా ఫీలైన మరుక్షణం ఆగిపోండి. మొండిగా ముందుకు సాగితే కండరాలు పట్టేసే ప్రమాదం ఉంది. ఇక ఫస్ట్‌టైం మారథాన్‌లో పాల్గొంటున్నవారు వీలైనంత వరకూ గ్రూప్‌లో కలసి పరిగెత్తడం మంచిది. లాంగ్ రన్లో అందరితో సాగితే ఎంజాయ్ చేయగలరు. ఈ సూత్రాలు ఫాలో అయితే మారథాన్‌ను ఖుషీగా పూర్తి చేయొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ భాగ్ మిల్కే భాగ్.