ఫేస్‌బుక్ ఓపెన్ చేసే కొద్దీ పుట్టుకొస్తున్న.. | fake friends flooding in facebook | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్ ఓపెన్ చేసే కొద్దీ పుట్టుకొస్తున్న..

Published Mon, Apr 13 2015 5:04 AM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

ఫేస్‌బుక్ ఓపెన్ చేసే కొద్దీ పుట్టుకొస్తున్న.. - Sakshi

ఫేస్‌బుక్ ఓపెన్ చేసే కొద్దీ పుట్టుకొస్తున్న..

ఒకప్పుడు స్నేహితులంటే క్లాస్‌మేట్స్.. పక్కింటి పిల్లలు..!! కాస్త కలివిడితనం ఉన్నవారు సదరు స్నేహితుల మిత్రులను కూడా నేస్తాలుగా చేసుకునేవారు. అరచేతిలో.. స్మార్ట్ ప్రపంచం వచ్చి పడ్డాక విశ్వ మంతా స్నేహితులే. ఫ్రెండ్స్.. ఫ్రెండ్స్.. ఆ ఫ్రెండ్స్‌ను ఫాలో అయ్యేవారు.. ఇలా.. ముక్కూముఖం తెలియని వారు కూడా ఫ్రెండ్స్ లిస్ట్‌లో చేరిపోతున్నారు. ఫేస్‌బుక్ ఓపెన్ చేసే కొద్దీ పుట్టుకొస్తున్న కొత్త స్నేహాల వికృత చేష్టలు నిఖార్సయిన మిత్రులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.
- త్రిగుళ్ల నాగరాజు

 
రమేష్, సురేష్ కొత్త స్నేహితులు.. ఇద్దరినీ కలిపింది ఫేస్‌బుక్కే. రమేష్ ఓ ఫొటో పోస్ట్ చేశాడు. సురేష్ దాన్ని లైక్ చేయలేదు. ఇంకేముంది మిత్రబేధం స్టార్ట్. సురేష్‌ను క లవమని చెప్పిన రమేష్.. ‘లైక్ ఎందుకు కొట్టలేదురా..!’ అంటూ అతడ్ని చితకబాదాడు. ఈ సంఘటన ఇటీవల మన సైబరాబాద్ పరిధిలో జరిగిందే.  వాట్సప్ గ్రూప్‌లో తను కోరిన అమ్మాయి ఫొటో అప్‌లోడ్ చేయనందుకు మరో యువకుడు గ్రూప్ అడ్మిన్‌పై దాడి చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే.. సోషల్ మీడియాకెక్కిన స్నేహితులు.. సోషల్ యానిమల్స్‌లా బిహేవ్ చేయడం మరిచిపోయారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు, యువతకు ఆన్‌లైన్ భద్రతపై ఇటీవల ఓ టెక్నాలజీ సంస్థ సిటీ వేదికగా నిర్వహించిన సర్వేలో తేలిన వివరాలివీ..
 
ఫేక్‌ఫ్రెండ్స్..

ఆన్‌లైన్ తప్ప అన్యమెరగని సిటీ యువత.. ఉనికి చాటుకోవడానికి ఫేస్‌బుక్‌ను మించిన వేదిక లేదని భావిస్తోంది. ఆన్‌లైన్ ఫ్రెండ్స్‌ను లెక్కకు మించి పెంచేసుకోవాలని ఆరాటపడుతున్న వారి సంఖ్య సిటీలో రోజురోజుకూ పెరుగుతోందని సదరు సర్వే సారాంశం. ఫేస్‌బుక్ వాడుతున్న వారిలో తాము పోస్ట్ చేసిన వాటికి వచ్చిన లైకులను లెక్కకట్టి మరీ గొప్పలుగా చెప్పుకునే వారు 72 శాతం మంది ఉన్నారని తెలిసింది.

ఇక 75 శాతం మంది తమ పోస్ట్‌లకు అత్యధికంగా లైక్‌లు రావాలని కోరుకుంటున్నారట. 73 శాతం మంది తప్పుడు సమాచారంతోనైనా.. తమ గొప్పతనం చాటుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారట. ఇక ఆశించిన మేర లైకులు, షేర్లు రాకపోతే.. 58 శాతం మంది ఏదో కోల్పోయామన్న ఫీలింగ్‌తో ఒత్తిడికి గురవుతున్నారని సర్వేలో తేలింది.
 
అజ్ఞాతానందకారులు..
స్మార్ట్‌ఫోన్‌ను రెండు వేళ్లతో స్మార్ట్‌గా డీల్ చేస్తున్న ఎదిగిన బిడ్డల చేష్టలను చూసిన తల్లిదండ్రుల్లో కొందరు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంటర్నెట్ వాడకాన్ని స్ట్రిక్ట్‌గా నిషేధిస్తున్నారు కూడా. 64 శాతం మంది తల్లిదండ్రులు తమ సంతానగోపాలం చర్యలను ఓ కంట కనిపెడుతున్నారని సర్వే లెక్కలు చెప్పాయి. పేరెంట్స్ స్పందన ఇలా ఉంటే.. తల్లిదండ్రులకు తెలియకుండా.. ఆన్‌లైన్‌లో విహరించే యువత  సంఖ్య సిటీలో రమారమీగా 68 శాతంగా లెక్క తేలింది. వీరంతా తమ ఆన్‌లైన్ లాఘవం గురించి తల్లిదండ్రులకు తెలియాల్సిన అవసరం లేదని వాదిస్తున్నారు.  

ఈ లెక్కలు ఇలా ఉంటే.. స్మార్ట్ గేర్‌లో దూసుకుపోతున్న సిటీ యువతలో 57 శాతం మంది ఆన్‌లైన్‌లో అజ్ఞాత వ్యక్తులతో లింకవుతున్నారు. అంతేకాదు.. అకౌంట్ హ్యాకింగ్, సైబర్ వేధింపులు ఎదురైతే ఎలా స్పందించాలో తెలియని వారి లెక్క 70 శాతంగా తేలింది. ఈ లెక్కన ఆన్‌లైన్‌లో విహరిస్తున్న యువతీయువకులను తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు ఐటీ నిపుణులు. అందుబాటులో ఉన్న పరిజ్ఞానాన్ని అవరసం మేరకే ఉపయోగించుకోవాలే తప్ప.. అదే ప్రపంచంగా భావించొద్దని హితవు పలుకుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement