పుష్పవిలాసం
నేడు ఫ్లోరల్ డిజైనింగ్ డే
కొమ్మ కొమ్మకు విరబూసిన సన్నాయిలు.. ఎవరో నేర్పినట్లు హరి పూజకు తొందర చేస్తుంటాయి. అలాగని కొమ్మకు పూసిన ప్రతి పువ్వూ పూజకు అంకితం కాలేవుగా..! అందుకే కొన్ని విరులు సొగసుగత్తెల సిగలో ఒదిగిపోతాయి. ఇంకొన్ని పూబాలలు గజమాలల్లో చోటు దక్కించుకుని ఒకింత గర్వంగా ఫీలవుతుంటాయి. మరికొన్ని అభినందనలు అందించే బొకేల్లో అందంగా కుదురుకుంటాయి. పుట్టిన రోజు వేడుక మొదలు.. ప్రేమికుల రాయబారాల్లో, పెళ్లి సందడిలో, ఆ వెంటనే జరిగే ఆ ముచ్చటలో.. అంతెందుకు చివరికి పరమపదానికి సాగే తుదియాత్రలోనూ పూల పరిమళం తోడుంటుంది. అందుకే తాకితే కందిపోయే విరులు డెకరేషన్ హంగులు అందుకుని ఎందరికో ఉపాధి కల్పిస్తూ సిరులు కురిపిస్తున్నాయి.
పూజలుసేయ పూలు తెస్తాం. ఇంట్లో ఏ వేడుక జరిగినా పుష్ప విలాసం తప్పనిసరిగా వికసిస్తుంది. ఇక పెళ్లిళ్లకు, పేరంటాలకు రకరకాల విరులు విరివిగా గుసగుసలాడుతూనే ఉంటాయి. కొన్నేళ్లు వెనక్కి వెళ్తే పెళ్లిసందడికి నాలుగైదు రోజులు ముందుగానే.. బంధుసందడి మొదలయ్యేది. వివాహ వేడుకకు ముందు రోజు మాలికల అల్లిక తంతు ప్రత్యేకంగా ఉండేది. అమ్మలక్కలు, పరికిణీల్లో పడతులు అంతా ఒక్కచోట చేరి.. గంపలుగా కోసుకొచ్చిన పూలను.. గమ్మత్తయిన సొదలు చెప్పుకుంటూ.. గుత్తులు, గుత్తులుగా కట్టేవారు. ఆడవారే కాదు.. మగాళ్లూ ఈ పూల అల్లికల ఎపిసోడ్‌లో పాల్గొనేవారు. అలా అల్లిన హారాలు, ద్వారాలకు తోరణాలుగా.. పెళ్లిపందిరికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి.
అలంకరణ తృణప్రాయం..
ప్రస్తుతం ఏ వేడుకకైనా బంధుగణం.. సుముహూర్తానికి గంట ముందు విచ్చేస్తోంది. రొటీన్ లైఫ్‌లో వచ్చిన స్పీడే.. ఫంక్షన్స్‌లోనూ వచ్చేసింది. వెరసి.. బర్త్‌డేలు, పెళ్లిళ్లు, ఇతరత్రా శుభకార్యాలకు పూల సొబగులు అద్దడానికి ఫ్లోరిస్ట్‌లు పుట్టుకొచ్చారు. బంతులు, చామంతులే కాదు.. రకరకాల రోజాలు.. వీటికి దోస్తీగా కొత్తగా విరబూసిన డఫోడిల్, దాలియా, సూర్యకాంత పూలు, ఆర్కిడ్ వంటి మేలిజాతి పుష్పాలను కలగలిపి అందంగా డెకరేట్ చేస్తున్నారు. పూల సొగసులకు దీటుగా 17 రకాల అలంకరణ గడ్డి పరకలు కూడా పరుస్తూ కల్యాణ మంటపం ఎంట్రన్స్ నుంచే పచ్చదనంతో కనువిందు చేస్తున్నారు. ఈ వేడుకలకు హాజరవుతున్న అతిథులు కూడా పూల బొకేలను తీసుకొచ్చే ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు.
క్రియేటివిటీతో ముందుకు..
ప్రస్తుతం ఫ్లోరిస్ట్ సెక్టార్ వేగంగా విస్తరిస్తోంది. సిటీ సెంట్రల్ నుంచి శివార్ల వరకూ వీళ్లు పాతుకుపోయారు. సిటీలో చిన్న బర్త్ డే పార్టీల నుంచి రాజకీయ నేతల ప్రమాణస్వీకార మహోత్సవాల వరకూ పూల అలంకరణ సర్వసాధారణమైంది. దీంతో ఈ రంగంలో ఉపాధి అవకాశాలు విపరీతంగా పెరిగాయి. చదువు అంతంత మాత్రంగా ఉన్నా, కాస్త క్రియేటివిటీ, ఇంకాస్త బిజినెస్ మైండ్ ఉన్నవారు ఈ రంగంలో బాగానే రాణిస్తున్నారు. బొకేల తయారీతో బిజినెస్ చేస్తూనే ఈవెంట్లకు డెకరేటర్స్‌గా మారిపోతున్నారు.
ఫ్లవర్స్ ఫ్రమ్ బెంగళూరు..
ఇక్కడ తయారయ్యే బొకేలకు, డెకరేషన్స్‌కు మెజార్టీ పూలు బెంగళూరు నుంచే దిగుమతి అవుతున్నాయి. అత్యవరసరమైతే విమానాల్లో కూడా తీసుకొస్తున్నారు. ‘ప్రస్తుతం గ్రీన్ కల్టివేషన్ ఇంపార్టెన్స్ పెరగడంతో నగరాన్ని ఆనుకుని ఉన్న పలు జిల్లాల్లో పూలతోటల పెంపకం జోరందుకుంది. రానున్న రోజుల్లో ఇక్కడి పూలు మార్కెట్‌లో భాగస్వామ్యం పంచుకోనున్నాయి’ అని వివరించారు ఫ్లోరిస్ట్ మోసిన్ ఖాన్. ఈ పూలనే పెట్టుబడిగా పెట్టి సిటీలోఎందరో జీవనం సాగిస్తున్నారు. వారందరికీ ఫ్లోరల్ డిజైనింగ్ డే శుభాకాంక్షలు.
- త్రిగుళ్ల నాగరాజు