
అమ్మాయి వయసు మగాడి జీతం అడగకూడదని పెద్దలు అంటుంటారు. బహుశా ఇందుకేనేమో పాపం ఆ కంపెనీ ఇంటర్వ్యూలో అమ్మాయి వయసు అడిగినందుకు పరిహారంగా ఏకంగా రూ. 3లక్షలు చెల్లించుకోవాల్సి వచ్చింది.
అసలేం జరిగిందంటే...డోమినోస్ పిజ్జా డెలివరీ డ్రైవర్ ఉద్యోగ ఇంటర్వ్యూలో నార్తర్న్ ఐర్లాండ్‌లోని జానిస్ వాల్ష్ అనే మహిళ ఒక చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. జానిస్ వాల్ష్ అనే మహిళ ఇంటర్వ్యూ సంభాషణలో ఆమె వయసు గురించి ప్రశ్నించారు. ఆ తర్వాత ఆమె దరఖాస్తు తిరస్కరణకు గురైంది. వాస్తవానికి వాల్ష్ ఈ ఇంటర్వ్యూలో ఎంపికైంది కానీ ఆమె వయసు కారణంగా తిరస్కరణకు గురైనట్లు తెలుసుకుని తీవ్ర ఆవేదనకు గురైంది.
అదీగాక 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న యువకులనే తీసుకుంటారని తెలుసుకున్న తర్వాత తాను లింగ వివక్షతకు గురైనట్లు తెలుసుకుంది. దీంతో వాల్ష్ తాను ఇంటర్వ్యూలో వయసు వివక్షత కారణంగా ఉద్యోగాన్ని కోల్పోయానని వివరిస్తూ... డోమినోస్ స్టోర్ ఫేస్‌బుక్‌లో మెసేజ్ పెట్టింది. వెంటనే ఇంటర్వ్యూ చేసిన సదరు వ్యక్తి క్విర్క్ ఆమెకు క్షమాపణలు చెప్పడమే గాక వయసు గురించి అడగకూడదని తనకు తెలియదని వివరణ ఇచ్చాడు.
కానీ ఆ కంపెనీ మాత్రం పిజ్జా డెలీవరీ జాబ్స్ ప్రకటనను ఇస్తూనే ఉండటంతో...వాల్ష్ మరింత దిగులు చెందింది. తనకు డ్రైవింగ్ వచ్చినప్పటికీ కేవలం మహిళను కావడం వల్లే ఈ ఉద్యోగం రాలేదని భావించి వాల్ష్ కోర్టు మెట్లెక్కింది. ఐతే ఆమెకు ఐర్లాండ్ ఈక్వాలిటీ కమీషన్ మద్దతు లభించింది. వ్యాపారాలు యువతకు ఉపాధిని కల్పించడం తోపాటు సమానత్వాన్ని పాటించాలని, అలా లేనప్పుడు ఉద్యోగులు హక్కులు ఎలా రక్షింపబడతాయని సదరు కంపెనీని కోర్టు ప్రశ్నించింది. వాల్ష్‌కు సదరు డోమినోస్ కంపెనీ దాదాపు రూ. 3.7 లక్షలు పరిహారం చెల్లించాలని కోర్టు స్పష్టం చేసింది.
(చదవండి: వెరైటీ వెడ్డింగ్ కార్డు! హర్ష గోయెంకా మనసును దోచింది!)