విదేశీ సందర్శకులకు వీసాలు సులభతరం!
న్యూఢిల్లీ: విదేశీ సందర్శకులు సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న ఎలక్ట్రానిక్ వీసా (ఈ-వీసా) విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అమెరికా, జర్మనీ, ఇజ్రాయెల్, పాలస్తీనా సహా 43 దేశాల నుంచి వచ్చే వారికి ఈ-వీసా సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. కేంద్ర పర్యాటకశాఖ మంత్రి మహేష్ శర్మతో కలసి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఈ నెల 27న ఈ సదుపాయాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు, కొచ్చి, తిరువనంతపురం, గోవాలలోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఏర్పాట్లు చేశారు.
ఈ-వీసా పొందాలనుకునే వారు సంబంధిత వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకొని రుసుము చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసిన 96 గంటల వ్యవధిలో వారికి ఈ-వీసాను జారీ చేస్తారు. రష్యా, బ్రెజిల్, జర్మనీ, థాయ్‌లాండ్, యూఏఈ, ఉక్రెయిన్, జోర్డాన్, నార్వే, మారిషస్‌తోపాటు మరికొన్ని దేశాలకు తొలి దశలో ఈ-వీసా సదుపాయాన్ని కల్పించనున్నామని పర్యాటకశాఖ అధికారి ఒకరు తెలిపారు. మెక్సికో, కెన్యా, ఫిజీలకు కూడా దీన్ని వర్తింపజేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన చెప్పారు. పాకిస్థాన్, సూడాన్, అఫ్ఘానిస్థాన్, ఇరాన్, ఇరాక్, నైజీరియా, శ్రీలంక, సొమాలియా వంటి దేశాలు మినహా ఇతర దేశాలన్నింటినీ దశల వారీగా రెండేళ్లలో ఈ-వీసా పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రస్తుతం దక్షిణ కొరియా, జపాన్, ఫిన్లాండ్, సింగపూర్, న్యూజిలాండ్, ఇండోనేసియా, మయన్మార్, వియత్నాం, లావోస్ వంటి 13 దేశాల నుంచి వచ్చే వారికి 'వీసా-ఆన్-ఎరైవల్' సదుపాయం అందుబాటులో ఉంది. ఈ-వీసాల జారీ విధానం వల్ల దేశంలో విదేశీ పర్యాటకుల సంఖ్య పెరిగే అలవకాశం ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకూ దేశాన్ని 51.79 లక్షల మంది విదేశీ పర్యాటకులు సందర్శించారు. ప్రభుత్వ నిర్ణయంపై అఖిల భారత టూర్ ఆపరేటర్ల సంఘం అధ్యక్షుడు సుభాష్ గోయల్ హర్షం వ్యక్తం చేశారు. చాలా దేశాలకు ఈ-వీసాల విధానాన్ని ప్రవేశపెట్టడం పర్యాటక రంగానికి ఊతమిస్తుందన్నారు.
**