కాబూల్: భద్రతా బలగాలే లక్ష్యంగా తాలిబన్ ఉగ్రవాదులు బాల్క్ ప్రావిన్స్‌లో మంగళవారం జరిపిన దాడి కారణంగా ఏడుగురు పౌరులు మరణించారని అఫ్గనిస్తాన్ అధికారులు తెలిపారు. షోల్గారా జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం ఇరు వర్గాల మధ్య దాడులు జరగ్గా ఏడుగురు పౌరులను తాలిబన్ ఉగ్రవాదులు అపహరించారు. అనంతరం వారిని హతమార్చారని స్థానిక పోలీస్ చీఫ్ సయ్యద్ ఆరిఫ్ ఇక్బాల్ చెప్పారు. అయితే ఈ దాడికి సంబంధించి తాలిబన్ ఇప్పటివరకు స్పందించలేదన్నారు. కాగా, గత ఫిబ్రవరి చివరలో తమతో కుదిరిన శాంతి ఒప్పందానికి అమెరికా తూట్లు పొడిచిందని తాలిబన్ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.
(చదవండి: నకిలీ ‘శాంతి ఒప్పందం’)
ఇక దక్షిణ కాందహార్ ప్రావిన్స్‌లో కూడా అదేరోజు సాయంత్రం జరిగిన మోటార్ షెల్ దాడిలో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, ఈ దాడిని తాలిబన్ ఉగ్రవాదులే చేశారని యూఎస్ బలగాలు ఆరోపిస్తుండగా.. అమెరికా భద్రతా బలగాల డ్రోన్ దాడిలోనే చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని తాలిబన్ ప్రతినిధి ఖరి యూసుఫ్ అహ్మది చెప్తున్నారు. అయితే, తామెలాంటి ఆయుధ ప్రయోగాం చేయలేదని అమెరికా బలగాల అధికార ప్రతినిధి సన్నీ లెగ్గెట్ స్పష్టం చేశారు. హింసను తగ్గించేందుకు తాలిబన్‌తో చర్చలు ఉంటాయని ట్వీట్ చేశారు. ఇక ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న ప్రాణాంతక కరోనా కారణంగా అఫ్గాన్‌లో 14 మంది మరణించగా.. 423 మంది వైరస్ బారిన పడ్డారు.
(చదవండి: అఫ్గాన్‌లో ఆత్మాహుతి దాడి: 11 మంది మృతి)
Comments
Please login to add a commentAdd a comment