మరో ఇద్దరికి మరణశిక్షలు
ఢాకా: 1971 స్వాతంత్ర యుద్ధం సమయంలో యుద్ధ నేరాలకు సంబంధించి మరో ఇద్దరికి బంగ్లాదేశ్ లో మరణశిక్ష పడింది. అబ్దుల్ హక్ (66) అతుర్ రెహమాన్ (62 ) అనే ఇద్దరు న్యాయవాదులకు బంగ్లాదేశీ ట్రిబ్యునల్ మరణ శిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు చెప్పింది. బంగ్లాదేశ్కు వ్యతిరేకంగా పాకిస్థాన్ కు అనుకూలంగా ఈ ఇద్దరు పనిచేశారని ప్రాసిక్యూషన్ వాదించింది.
అబ్దుల్ హక్ 1971లో ఒక అనుకూల పాకిస్థాన్ రాజకీయ పార్టీ నాయకుడని.. ఆయనపై మోపిన పౌరుల మీద క్రూరమైన దాడులు, చిత్రహింసలు, మహిళలపై అత్యాచారాలు తదితర ఆరోపణలు నిర్ధారణ అయ్యాయని ట్రిబ్యునల్ వెల్లడించింది. దీనికి సంబంధించి సుమారు 23 మంది సాక్షులను విచారించినట్టు తెలిపింది. రెహమాన్ కూడా ఇదే మిలిషీయా పార్టీలో సభ్యుడుగా ఉండి అనేక దురాగతాలకు పాల్పడ్డాడని పేర్కొంది.
ట్రిబ్యునల్ తీర్పును ఉన్నత న్యాయ స్థానంలో సవాలు చేయనున్నట్టు డిఫెన్స్ న్యాయవాది గాజీ తమీమ్ విలేకరులతో చెప్పారు. ట్రిబ్యునల్ తీర్పును ప్రధానమంత్రి షేక్ హసీనా సమర్థించారు. ఆనాటి సంఘర్షణ గాయాల ఉపశమనానికి ఈ శిక్షలు అవసరమని పేర్కొన్నారు. తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్న నాయకులను పూర్తిగా తుడిచిపెట్టే పనిలో భాగంగానే ప్రభుత్వం ఈ చర్యలకు పూనుకుంటోందని ప్రతిపక్షాలు విమర్శించాయి. గతంలో ఢాకా సెంట్రల్ జైలులో ఇద్దరు ప్రతిపక్ష నాయకులను ఉరితీయడం సంచలనం రేకిత్తించింది.