గెట్..సెట్...కిక్ | Brazil Scrambles to Get Ready as World Cup Looms | Sakshi
Sakshi News home page

గెట్..సెట్...కిక్

Jun 12 2014 1:42 AM | Updated on Oct 22 2018 5:58 PM

గెట్..సెట్...కిక్ - Sakshi

గెట్..సెట్...కిక్

ఇప్పటివరకు ఐదుసార్లు ప్రపంచ చాంపియన్లు... గత 12 ఏళ్లుగా తమ గడ్డపై ఓటమి ఎరుగని ఘన చరిత్ర... ప్రపంచంలో ఏ మూలన సాకర్ టోర్నీ జరిగినా టైటిల్ ఫేవరెట్లలో ముందుండే జట్టు...

నేటి నుంచి సాకర్ ప్రపంచకప్   
 అందరి దృష్టి బ్రెజిల్ పైనే
 
 బ్రెజిల్ xక్రొయేషియా
 రాత్రి గం. 1.30 నుంచి
 సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
 
 సావో పాలో: ఇప్పటివరకు ఐదుసార్లు ప్రపంచ చాంపియన్లు... గత 12 ఏళ్లుగా తమ గడ్డపై ఓటమి ఎరుగని ఘన చరిత్ర... ప్రపంచంలో ఏ మూలన సాకర్ టోర్నీ జరిగినా టైటిల్ ఫేవరెట్లలో ముందుండే జట్టు... ఫుట్‌బాల్ ప్రపంచంలో బ్రెజిల్ జట్టు గురించి చెప్పడానికి ఈ ఉపమానాలు సరిపోతాయి. కానీ సొంతగడ్డపై ప్రతిష్టాత్మక ప్రపంచకప్‌ను గెలవలేదన్న ఒకే ఒక్క లోటు మాత్రం బ్రెజిల్‌ను పీడిస్తోంది. అలాంటి జట్టుకు వరల్డ్‌కప్‌ను గెలుచుకునే అరుదైన అవకాశం ఇప్పుడు వచ్చింది.
 
 నేటి నుంచి ప్రారంభం కానున్న ఫుట్‌బాల్ ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో పటిష్టమైన బ్రెజిల్.. ప్రపంచ 18వ ర్యాంకర్ క్రొయేషియాతో తలపడనుంది. ప్రస్తుత ఫామ్‌ను చూస్తే ఈ మ్యాచ్‌లో బ్రెజిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. అయితే సొంతగడ్డపై టోర్నీ జరుగుతుండటంతో జట్టుపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో సహజంగానే జట్టుపై ఒత్తిడి పెరిగింది.
 
 నెమార్ చుట్టే వ్యూహాలు
 బ్రెజిల్ జట్టులో స్టార్ ప్లేయర్లకు కొదువలేదు. పటిష్టమైన లైనప్.. ఫార్వర్డ్స్ అటాకింగ్.. అంచనాలకు మించి ఆడే ఆటగాళ్లు... ప్రత్యర్థి వ్యూహాలను క్షణంలో పసిగట్టే కోచ్..ఇలా ప్రతి అంశంలోనూ బ్రెజిల్ ప్రత్యేకత చాటుకుంది. దీంతో గత కొన్నేళ్లుగా సాకర్‌లో ఆధిపత్యం చెలాయిస్తోంది. అయితే ఓవరాల్‌గా బ్రెజిల్ ప్రణాళికలన్నీ నెమార్ చుట్టే తిరుగుతుంటాయి. ఇతన్ని అడ్డుకుంటే ప్రత్యర్థి జట్టు విజయావకాశాలు సగంపైగా మెరుగుపడతాయి. గ్రూప్-ఎలో బ్రెజిల్‌కు ఎదురులేకున్నా... తొలి మ్యాచ్ కోసం మాత్రం అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.   
 
 తక్కువ అంచనా వేస్తే...
 మరోవైపు క్రొయేషియా జట్టు కూడా సమతుల్యంగా ఉంది. అనుభవజ్ఞులు, యువకులతో జట్టు మేళవింపు బాగుంది. అయితే కీలక ఆటగాళ్లు మారియో మండ్‌జుకిచ్, బెరైన్ మునిచ్‌లు ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు.
 
 రానున్న
 ఐదు వారాల్లో...
 ఓ వ్యక్తి గాల్లోకి చూస్తూ తనలో తానే ఏదో మాట్లాడుతుంటే ఆశ్చర్యపోవద్దు.
 రోడ్డు మీద పిల్లాడు కాలితో బలంగా రాళ్లను తంతుంటే విస్తు పోవద్దు.
 అర్ధరాత్రి హాల్లో టీవీలు హోరెత్తుతుంటే విసుక్కోవద్దు...
 
 ఎందుకంటే...
 ప్రపంచంలో చాలా దేశాల అధ్యక్షులు తమ పనులనే వాయిదా వేసుకుంటున్నారు.
 చాలా దేశాల్లో ఆలుమగలు సంసారం మానేసి టీవీలకే అతుక్కుపోతారు.
 ఫుట్‌బాల్ పిచ్చి అలాగే ఉంటుంది మరి. ‘సాకర్’ అనే మూడక్షరాలతో ప్రపంచం ఊగిపోతుంది. రేడియోలు, టీవీలలో ఆ ఆటే హోరెత్తుతుంది. ఏ ఇద్దరు క్రీడాభిమానులు కలిసినా స్కోరు గురించే చర్చ జరుగుతుంది. మామూలుగానే ఫుట్‌బాల్ ప్రపంచకప్ అంటే గ్లామర్. ఇక బ్రెజిల్ లాంటి సాంబా నృత్యాలతో హోరెత్తే దేశంలో ఈ పండగ జరిగితే... చూడటానికి రెండు కళ్లూ చాలవేమో..!
 
 32 జట్లు... 64 మ్యాచ్‌లు... ఒక్క విజేత. జులై 13న బ్రెజిల్‌లో కప్ అందుకోవాలనే లక్ష్యంతో ఆటగాళ్లు... తమ జట్టు ఓడిపోతే ప్రాణాలు తీసుకునే అభిమానులు... ముసలోళ్లను కూడా పసిపిల్లలుగా మార్చేదే ఫుట్‌బాల్ ప్రపంచకప్. ఈ మెగా క్రీడా సంరంభానికి సావోపాలోలో నేడు తెరలేవనుంది. ఇక ఈ ఐదు వారాలూ
 కావలసినంత ‘కిక్’...
 
 ప్రపంచకప్ విశేషాలు
 ఇప్పటివరకు 19 ప్రపంచకప్‌లలో ఆతిథ్య జట్టు 6 సార్లు టైటిల్ నెగ్గింది.
 ప్రపంచకప్ గెలిచిన జట్లలో సొంతగడ్డపై టైటిల్ సాధించని ఒకే ఒక జట్టు బ్రెజిల్
 1930లో జరిగిన తొలి ప్రపంచ కప్‌లో 13 జట్లు పాల్గొంటే... 2014లో 32 జట్లు బరిలోకి దిగుతున్నాయి.
 
 బ్రెజిల్ ఒక్కటే ఇప్పటివరకు అన్ని ప్రపంచకప్‌లు ఆడింది.
 
 దక్షిణ అమెరికా, యూరోప్ ఖండాలకు చెందిన దేశాలే ఇప్పటి వరకు ప్రపంచకప్‌లు గెలిచాయి.
 
 అత్యధిక సార్లు ప్రపంచ కప్ గెలిచిన జట్టు బ్రెజిల్ (5). ఇటలీ (4), జర్మనీ (3) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
 
 ప్రపంచకప్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడు రొనాల్డో (బ్రెజిల్-15). ఒకే టోర్నీలో అత్యధిక గోల్స్ రికార్డు (13) జస్ట్ ఫాంటెయిన్ (ఫ్రాన్స్-1958) పేరిట ఉంది.
 
 ప్రపంచ కప్ మ్యాచ్‌లలో ఎక్కువ సార్లు నమోదైన స్కోరు 1-0.
 ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్ గోల్ 11వ సెకన్లో నమోదైంది. హకన్ సుకుర్ (టర్కీ) 2002లో దక్షిణ కొరియాపై సాధించాడు.
 
 ఎక్కువ వయసులో (42 ఏళ్ల 39 రోజులు) ప్రపంచ కప్ బరిలోకి దిగిన ఆటగాడు రోజర్ మిల్లా (కామెరూన్)
 ఫుట్‌బాల్, క్రికెట్ ప్రపంచకప్‌లలో తమ దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఏకైక ఆటగాడు వివియన్ రిచర్డ్స్ (వెస్టిండీస్, ఆంటిగ్వా)


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement