జగజ్జేతలకు జేజేలు | World Cup: Champions Germany welcomed home in Berlin | Sakshi
Sakshi News home page

జగజ్జేతలకు జేజేలు

Published Wed, Jul 16 2014 12:56 AM | Last Updated on Mon, Oct 22 2018 5:58 PM

జగజ్జేతలకు జేజేలు - Sakshi

జగజ్జేతలకు జేజేలు

 జర్మనీ హీరోలకు స్వదేశంలో ఘనస్వాగతం
 విజయోత్సవాల్లో 5 లక్షల మంది
 
 ఒకటి కాదు.. రెండు కాదు.. 24 ఏళ్ల కల.. ప్రపంచకప్ నిరీక్షణకు ఫిలిప్ లామ్ సేన ఆదివారం తెరదించడంతో జర్మనీలో ఎటు చూసిన పండగ వాతావరణమే. ఇక ట్రోఫీతో జర్మనీ జట్టు స్వదేశానికి తిరిగి వచ్చిన వేళ అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి. జగజ్జేతలకు ఎర్రతివాచీతో ఘన స్వాగతం పలికారు. ఈ వేడుకల్లో ఆటగాళ్లూ అభిమానుల్లా మారిపోయి సందడి చేశారు.
 
 బెర్లిన్: రెండు పుష్కరాల తర్వాత సాకర్ ప్రపంచకప్ సాధించి కోట్ల మంది అభిమానుల ఆశల్ని నిలిపిన జర్మనీ జట్టుకు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. రియో డి జనీరో నుంచి మంగళవారం బెర్లిన్ చేరుకున్న ప్రపంచకప్ హీరోలకు లక్షల మంది అభిమానులు జేజేలు పలికారు. బెర్లిన్‌లోని టెగెల్ ఎయిర్‌పోర్టులో జట్టు విమానం ‘ఫన్హాన్సా’ దిగడమే ఆలస్యం బెర్లిన్‌లో సంబరాలు మొదలయ్యాయి.
 
 జర్మనీ జట్టు కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఓపెన్ టాప్ ట్రక్‌లో ఎయిర్‌పోర్టు నుంచి జర్మనీ ఐక్యతకు గుర్తయిన బ్రాండెన్‌బర్గ్ గేట్ వరకు ర్యాలీగా వెళ్లారు. దారి పొడవునా అశేష అభిమానులు జయజయధ్వానాలు పలికారు. కెప్టెన్ ఫిలిప్ లామ్‌తో పాటు జట్టులోని ఆటగాళ్లంతా ప్రపంచకప్ ట్రోఫీని చేతబూని, విజయ సంకేతాలతో అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు. కొందరు ప్లేయర్లు వినోదాత్మక గీతాలు ఆలపిస్తూ సంబరాల్లో జోష్ పెంచారు. మరికొందరు ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ, ఫ్యాన్స్‌తో చేతులు కలుపుతూ ఆనందాన్ని పంచుకున్నారు.  
 
 స్టేజ్‌పై ఆటా పాట
 ప్రపంచకప్ విజయోత్సవాల్లో జర్మనీ ప్లేయర్లు సందడి చేశారు. వేలాది మంది అభిమానులు మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించిన చోటైన ‘బ్రాండెన్‌బర్గ్ గేట్’ దగ్గర ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టేజ్‌పై ట్రోఫీని ప్రదర్శించి, ఆ తర్వాత జట్టుగా ఫోటోలకు పోజులిచ్చారు. ఇక కొందరు ఆటగాళ్లు స్టేజ్‌పై ‘దిస్ ఈజ్ హౌ ద జర్మన్స్ విన్’ అంటూ ఆడి పాడారు. చేతిలోని సాకర్ బంతులను అభిమానులకు విసిరారు. వీటిని అందుకునేందుకు అభిమానులు పోటీపడ్డారు. ఇక ప్రపంచకప్ సంబరాల్లో ఆటగాళ్లు ఉద్వేగానికి లోనయ్యారు. చేతిలో ట్రోఫీని పట్టుకున్న కెప్టెన్ ఫిలిప్ లామ్ తన అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ‘ఇది నా చిన్ననాటి కల. ఇప్పుడిది నెరవేరింది. ప్రపంచకప్ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది’ అని లామ్ చెప్పాడు. ‘ఈ టైటిల్ మీదే. మీరు లేకుంటే ఇక్కడ ఉండేవాళ్లమే కాదు. అందరం చాంపియన్లమే’అని కోచ్ జోకిమ్ అన్నాడు.
 
 ప్రపంచకప్ విక్టరీ స్టాంప్
 2014 ప్రపంచకప్ విజయానికి గుర్తుగా జర్మనీ ప్రభుత్వం ప్రత్యేకంగా 50 లక్షల తపాలా బిళ్లలను ముద్రించింది. అయితే ఈ స్టాంప్‌లను ప్రపంచకప్ ఫైనల్‌కు ముందే ముద్రించడం విశేషం. ఈ సారి ఎలాగైనా జర్మనీ విజేతగా నిలుస్తుందన్న నమ్మకంతోనే స్టాంపులను ముందుగానే ముద్రించామని జర్మనీ ఆర్థిక మంత్రి వోల్ఫ్‌గాంగ్ చెప్పారు. జర్మనీ జట్టు తమ నమ్మకాన్ని నిలబెట్టినందుకు చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. 60 సెంట్‌ల విలువైన ఈ స్టాంప్ గురువారం నుంచి అమ్మనున్నారు. అంతకంటే ముందు ఈ స్టాంప్‌లను కోచ్ జోకిమ్‌తో పాటు ఆటగాళ్లకు అందజేస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement