జగజ్జేత జర్మనీ
ఫైనల్లో అర్జెంటీనాపై 1-0తో గెలుపు
ఎక్స్ట్రా టైమ్‌లో గాట్జె అద్భుత గోల్
నిరాశపరచిన అర్జెంటీనా స్టార్ మెస్సీ
ప్రైజ్‌మనీ
విజేత జర్మనీ- రూ. 210 కోట్లు
రన్నరప్ అర్జెంటీనా- రూ. 150 కోట్లు
మూడో స్థానం (నెదర్లాండ్స్) - రూ. 132 కోట్లు
నాలుగో స్థానం (బ్రెజిల్)- రూ.. 120 కోట్లు
జర్మనీ సాధించింది... 24 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ.... 8 కోట్ల మంది ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తూ... నాలుగోసారి సాకర్ ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. గత మూడు ప్రపంచకప్‌లలో సెమీస్‌కు చేరినా టైటిల్‌ను అందుకోలేకపోయిన కరువును ఎట్టకేలకు తీర్చుకుంది. ఫైనల్లో అర్జెంటీనాను ఓడించి జగజ్జేతగా అవిర్భవించింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో అదనపు సమయంలో గాట్జె గోల్ చేసి జర్మనీకి ‘గాడ్’గా అవతరించాడు.
రియో డి జనీరో: ఊహించినట్లుగానే ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్ హోరాహోరీగా సాగింది. సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ మారియో గాట్జె ఎక్స్ట్రా టైమ్ (113వ నిమిషం)లో ఏకైక గోల్ చేయడంతో... భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్లో జర్మనీ 1-0తో అర్జెంటీనాపై విజయం సాధించింది. నాలుగోసారి ప్రపంచకప్ టైటిల్‌ను సగర్వంగా అందుకుంది. జర్మనీ ఆటగాళ్లు పదేపదే దాడులు చేసినా అర్జెంటీనా డిఫెండర్లు సమర్థంగా నిలువరించడంతో నిర్ణీత సమయంలో ఇరుజట్లు గోల్స్ చేయలేకపోయాయి.
అయితే రెండో ఎక్స్ట్రా టైమ్‌లో షుర్లే ఇచ్చిన క్రాస్ పాస్‌ను గాట్జె ఎదతో అద్భుతంగా అదుపు చేస్తూ బలమైన కిక్‌తో గోల్ పోస్ట్‌లోకి పంపాడు. ప్రత్యర్థి గోల్ కీపర్ రొమెరో నిలువరించే ప్రయత్నం చేసినా బంతి అప్పటికే నెట్లోకి దూసుకుపోయింది. అంతే ఒక్కసారిగా జర్మనీ అభిమానులు సంబరాల్లో మునిగి తేలితే.. అర్జెంటీనా అభిమానులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. గాట్జెకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
సెమీస్‌లో బ్రెజిల్ మీద దాడికి దిగినట్లుగానే జర్మనీ ఆరంభం నుంచే అటాకింగ్ మొదలుపెట్టింది. బంతిని ఎక్కువగా ఆధీనంలోకి తీసుకుంటూ పదేపదే ప్రత్యర్థి రక్షణ శ్రేణి ఛేదించే ప్రయత్నాలు చేసింది. ఫలితంగా 4వ నిమిషంలో ఐదుగురు ఆటగాళ్లు బంతిని అదుపు చేస్తూ తొలి అటాకింగ్‌గా క్రూస్కు పాస్ ఇచ్చారు. అతను నెట్లోకి పంపినా మధ్యలో రోజో (అర్జెంటీనా) అడ్డుకున్నాడు.
ఆ వెంటనే రొమెరో ఏరియాలోనే ముల్లర్ (జర్మనీ) ఎదురుదాడులు చేసినా అర్జెంటీనా అడ్డుకుంది. 10 నిమిషంలో క్రామెర్ (జర్మనీ) కొట్టిన ఫ్రీ కిక్ వృథా అయ్యింది.
అదే పనిగా దాడులు చేసిన జర్మనీ 16వ నిమిషంలో క్రూస్ (జర్మనీ) కొట్టిన కార్నర్ కిక్కు సహచరులు సరిగా స్పందించలేకపోయారు.
అర్జెంటీనాకు గోల్ చేసే అవకాశం 21 నిమిషంలో లభించినా హిగుయాన్ దాన్ని నెరవేర్చడంలో విఫలమయ్యాడు. 28వ నిమిషంలో రొమెరో... ముల్లర్ షాట్‌ను సమర్థంగా తిప్పికొట్టాడు. వెంటనే ముల్లర్ ఎల్లో కార్డుకు గురయ్యాడు.
30వ నిమిషంలో హిగుయాన్ (అర్జెంటీనా) దాదాపుగా గోల్ చేశాడు. జర్మనీ రక్షణ శ్రేణిని ఛేదించుకుంటూ వచ్చి బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపాడు. కానీ లైన్ అంపైర్ ఆఫ్‌సైడ్‌గా తేల్చడంతో జర్మనీ ఊపిరి పీల్చుకుంది.
37వ నిమిషంలో ముల్లర్ ఇచ్చిన సెంటర్ పాస్‌ను షుర్లే గోల్ కొట్టే ప్రయత్నం చేసినా రొమెరో అడ్డుకున్నాడు. 43వ నిమిషంలో మరో షాట్‌ను ఇదే తరహాలో నిలువరించాడు.
45వ నిమిషంలో క్రూస్ కొట్టిన కార్నర్ కిక్‌ను బెనెడిక్ట్ హోవెడస్ హెడర్‌గా మల్చాడు. అయితే బంతి గోల్‌పోస్ట్‌ను తాకి రీబౌండ్ అయ్యింది. అక్కడే ఉన్న ముల్లర్ వెంటనే బంతిని మళ్లీ నెట్లోకి పంపినా రొమెరో అడ్డుకోవడంతో అర్జెంటీనా సంబరాలు చేసుకుంది.
ఓవరాల్‌గా తొలి అర్ధభాగంలో 63 శాతం బంతిని ఆధీనంలో ఉంచుకున్న జర్మనీ గోల్స్ కోసం నాలుగు ప్రయత్నాలు చేసింది. అర్జెంటీనా మూడుసార్లు ప్రయత్నించి విఫలమైంది.
దాడుల్లో పదును పెంచేందుకు రెండో అర్ధభాగంలో లావెజ్జీ స్థానంలో అగుయెరో (అర్జెంటీనా)ను రంగంలోకి తెచ్చింది. వెంటనే 47వ నిమిషంలో మెస్సీ చేసిన ప్రయత్నం విఫలమైంది.
59వ నిమిషంలో క్లోజ్ కొట్టిన షాట్‌ను రొమెరో మరోసారి నిలువరించాడు. 64వ నిమిషంలో క్లోజ్ ఫౌల్కు మస్కరెనో ఫ్రీకిక్ సంధించాడు.
గోల్స్ చేసే అవకాశాలు రాకపోవడంతో నిరాశ చెందిన అర్జెంటీనా ఆటగాళ్లు ప్రత్యర్థులకు కాస్త దాడులకు దిగారు. దీంతో నిమిషం (64, 65వ నిమిషం) వ్యవధిలో ఇద్దరు ఎల్లో కార్డుకు గురయ్యారు.
75వ నిమిషంలో మెస్సీ కొట్టిన బంతి వైడ్‌గా వెళ్లింది. మరో 2 నిమిషాలకు మస్కరెనో ఫౌల్కు షుర్లే ఫ్రీ కిక్ కొట్టినా ప్రయోజనం లేకపోయింది.
లాహిమ్, ఓజిల్ మంచి సమన్వయంతో బంతిని తీసుకొచ్చి 82వ నిమిషంలో క్రూస్కు అందించారు. అంతే వేగంతో స్పందించిన అతను నేర్పుగా నెట్ వైపు పంపినా తృటిలో పక్కకు పోయింది. ఓవరాల్‌గా రెండో అర్ధభాగం కూడా గోల్స్ లేకుండానే ముగిసింది.
అదనపు సమయంలో జర్మనీ వ్యూహాన్ని మార్చింది. ఆరంభంలోనే షుర్లే కొట్టిన బలమైన రొమెరో అడ్డుకోవడంతో మరోసారి అర్జెంటీనా గట్టెక్కింది.
97వ నిమిషంలో జర్మనీ గోల్ పోస్ట్ ముందర పలాసియో ఊహించని రీతిలో షాట్ కొట్టాడు. కానీ గోల్ కీపర్ నెయర్ తేరుకునేలోపు బంతి ఎత్తులో బయటకు వెళ్లింది. 105వ నిమిషంలో మెస్సీ, అగుయెరా మద్దతుతో పలాసియో కౌంటర్ అటాక్ చేసిన పెద్దగా పని చేయలేదు.
రికార్డులు
- ప్రపంచకప్‌లో జర్మనీకిది 4వ టైటిల్. నాలుగు ప్రపంచకప్‌లతో జర్మనీ.. ఇటలీ సరసన చేరింది. ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక టైటిల్స్ బ్రెజిల్(5) గెలిచింది.
- జర్మనీ 1954, 1974, 1990, 2014లో జగజ్జేతగా నిలిచింది.
- జర్మనీ తొలిసారి యూరోప్ బయట ప్రపంచకప్ సాధించింది.
- ఎనిమిదోసారి ఫైనల్ ఆడిన జర్మనీ 4వసారి చాంపియన్ అయింది.
- అర్జెంటీనాతో ఫైనల్లో మూడోసారి తలపడి రెండుసార్లు నెగ్గింది.
- యూరోప్, దక్షిణ అమెరికా జట్లు పదోసారి ఫైనల్లో తలపడగా.. యూరోప్ జట్లకిది మూడో టెటిల్.
- ఓ యూరోప్ జట్టు(జర్మనీ)అమెరికా ఖండాల్లో చాంపియన్‌గా నిలవడం ఇదే మొదటిసారి.
- వరుసగా మూడో ప్రపంచకప్‌లో జర్మనీ నాకౌట్ దశలో అర్జెంటీనాను చిత్తు చేసింది.
- జర్మనీ ఏడు దశాబ్దాల్లో ఏడు సార్లు ఫైనల్‌కు చేరి నాలుగుసార్లు చాంపియన్‌గా నిలిచింది.