బై... బై... బ్రెజిల్!
నెల రోజుల పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఉర్రూతలూగించిన ఫుట్‌బాల్ ప్రపంచకప్ ముగిసింది. బ్రెజిల్ అద్భుతంగా ఆతిథ్యమిచ్చిన టోర్నీకి రియో డి జనీరోలో ఆదివారం ముగింపు కార్యక్రమం జరిగింది. అట్టహాసంగా కాకపోయినా ఫైనల్ మ్యాచ్‌కు ముందు 15 నిమిషాల పాటు జరిగిన ఈ కార్యక్రమం అభిమానులకు ఆహ్లాదాన్ని పంచింది. ఆరంభంలో ఈ ప్రపంచకప్‌లో పాల్గొన్న 32 జట్లకు చెందిన పతాకాలు చేతబూని సాంబా కళాకారిణులు నృత్యంతో అలరించారు.
అనంతరం ప్రపంచ ప్రఖ్యాత పాప్ సింగర్ షకీరా తన గాన మాధుర్యంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇప్పటికే ఉర్రూతలూగించిన లా.. లా.. లా.. అనే ప్రపంచకప్ గీతాన్ని మరోసారి పాడి బెల్లీ డ్యాన్స్‌తో స్టేడియాన్ని వేడెక్కించింది. అలాగే సింగర్స్ వెక్లైఫ్ జీన్, కార్లోస్ సాంటానా, అలెగ్జాండర్ పైర్స్ (బ్రెజిల్) అధికారిక ప్రపంచకప్ గీతం ‘డార్ ఉమ్ జీటో’ పాడారు. గ్రామీ అవార్డు విజేత ఇవెటో సాంగాలో బ్రెజిల్‌కు సంబంధించిన గీతాలను ఆలపించగా రియో డి జనీరోకు చెందిన స్కూల్ విద్యార్థులు సాంబా నృత్యంతో ఆకట్టుకున్నారు. తర్వాతి ప్రపంచకప్ 2018లో రష్యాలో జరుగుతుంది.