‘పీడకల’ ముగిసింది!
బ్రెజిల్‌కు మళ్లీ నిరాశ
ప్లే ఆఫ్ మ్యాచ్‌లో 0-3తో పరాజయం
నెదర్లాండ్స్‌కు మూడో స్థానం
వరుసగా తొమ్మిదోసారి యూరోప్ జట్టుకే ఈ ఘనత
ఇలా జరుగుతుందనుకుంటే... బ్రెజిల్ ప్రపంచకప్‌కు ఆతిథ్యమిచ్చేది కాదేమో!
ఇలా ఆడతారనుకుంటే... కోట్లాది మంది నిరసనలను కాదని 90 వేల కోట్లు ఖర్చు చేసేవారు కాదేమో! ఆతిథ్యం పరంగా ప్రపంచంతో శెభాష్ అనిపించుకున్న బ్రెజిల్... ఆట పరంగా అథఃపాతాళానికి పడిపోయింది. కప్ గెలవడం తప్ప మరేం చేసినా తక్కువే అని ఆశించిన బ్రెజిల్ అభిమానికి ‘గుండె’ పగిలింది. సెమీస్‌లో జర్మనీ చేతిలో చిత్తుచిత్తుగా ఓడిన దృశ్యం కళ్ల ముందు మెదులుతుండగానే... నెదర్లాండ్స్ చేతిలోనూ చావుదెబ్బ తింది. మూడో స్థానం కోసం మ్యాచ్ జరుగుతున్నంతసేపు... ఈ నరకయాతన ఎప్పుడు ముగుస్తుందా? అని చూడాల్సిన స్థితి. ఫుట్‌బాల్‌ను ప్రాణం కంటే ఎక్కువగా ఆరాధించే బ్రెజిల్ కోలుకోవడానికి ఎంతకాలం పడుతుందో..!
బ్రెజీలియా: స్వదేశంలో జరిగిన ఫుట్‌బాల్ ప్రపంచకప్ బ్రెజిల్ జట్టుకు చేదు జ్ఞాపకంగా నిలిచింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో అత్యంత చెత్త ఆటతీరును ప్రదర్శించి అభిమానులకు తీవ్ర మనోవేదనను మిగిల్చింది. కనీసం ఊరట విజయాన్నైనా దక్కించుకుని పరువు నిలబెట్టుకుందామని ఆశించిన బ్రెజిల్‌కు నెదర్లాండ్స్ చేతిలోనూ నగుబాటు తప్పలేదు. శనివారం అర్ధరాత్రి మూడో స్థానం కోసం జరిగిన ‘ప్లే ఆఫ్’ మ్యాచ్‌లో బ్రెజిల్ 0-3తో ఓడి అవమాన భారంతో టోర్నీ నుంచి నిష్ర్కమించింది. 1940 తర్వాత సొంతగడ్డపై వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవడం బ్రెజిల్‌కిదే తొలిసారి.
ఆట ప్రారంభం నుంచే విరుచుకుపడిన నెదర్లాండ్స్ దూకుడును అడ్డుకోవడంలో ఆతిథ్య జట్టు పూర్తిగా విఫలమైంది. తొలి 17 నిమిషాల్లోనే రెండు గోల్స్ సమర్పించుకోవడంతో మరోసారి జట్టుపై గోల్స్ వర్షం ఖాయమనిపించినా ఎలాగోలా ఆ ‘దారుణాన్ని’ అడ్డుకోగలిగింది.
డచ్ తరఫున రాబిన్ వాన్ పెర్సీ, డేలీ బ్లైండ్, జియార్జినో విజ్నాల్డమ్ గోల్స్ సాధించారు. వార్మప్‌లో తొడ కండరాలు పట్టేయడంతో హాలెండ్ మిడ్‌ఫీల్డర్ స్నైడర్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. 2002 అనంతరం అతను లేకుండా ప్రపంచకప్ ఆడడం జట్టుకిదే తొలిసారి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా అర్జెన్ రాబెన్ నిలిచాడు. నెదర్లాండ్స్ విజయంతో వరుసగా తొమ్మిదో ప్రపంచకప్‌లోనూ యూరోప్ జట్టుకే మూడో స్థానం లభించింది.
ఏమాత్రం ఆత్మవిశ్వాసం లేకుండా కనిపించిన బ్రెజిల్ ఆటగాళ్లపై ప్రారంభంలోనే నెదర్లాండ్స్ పైచేయి సాధించింది. ఫలితంగా మూడో నిమిషంలోనే ప్రత్యర్థికి షాక్ ఇచ్చింది. 2వ నిమిషంలో నెదర్లాండ్స్ ఆటగాడు రాబెన్ నుంచి బంతి తీసుకునే క్రమంలో బ్రెజిల్ కెప్టెన్ థియాగో సిల్వా అతడిని దురుసుగా తోసేశాడు. దీంతో రిఫరీ సిల్వాకు యెల్లో కార్డు చూపించడంతో పాటు డచ్‌కు పెనాల్టీ కిక్ అవకాశం ఇచ్చారు. దీన్ని వాన్ పెర్సీ గోల్‌గా మలిచి జట్టును 1-0 ఆధిక్యంలోకి చేర్చాడు.
ఆ తర్వాత 17వ నిమిషంలోనే డచ్‌కు ఆధిక్యం పెంచుకునే అవకాశం దొరికింది. గోల్ పోస్టు ఎడమ వైపు నుంచి నెదర్లాండ్స్ ఆటగాడు కొట్టిన కిక్‌ను గాల్లోకి ఎగిరి డేవిడ్ లూయిజ్ (బ్రెజిల్) హెడర్‌తో దారి మళ్లించినా అది నేరుగా డచ్ డిఫెండర్ డేలీ బ్ల్రైండ్ ముందుకెళ్లింది. వెంటనే దాన్ని అతడు గోల్‌గా మలిచాడు.
21వ నిమిషంలో ఆస్కార్ షాట్‌ను నెదర్లాండ్స్ కీపర్ సమర్థవంతంగా అడ్డుకున్నాడు.
ద్వితీయార్ధంలో బ్రెజిల్ కాస్త మెరుగైన ఆటతీరును ప్రదర్శించింది. గోల్ కోసం తీవ్రంగానే ప్రయత్నించి ప్రత్యర్థి గోల్ పోస్టుపైకి పదే పదే దాడులకు దిగినా ఫలితం లేకపోయింది.
59వ నిమిషంలో బ్రెజిల్ మిడ్‌ఫీల్డర్ రామిరెస్ కొట్టిన షాట్ వైడ్‌గా వెళ్లింది. ఆ తర్వాత హల్క్ కొట్టిన బంతి కూడా గోల్ బార్ పై నుంచి వెళ్లింది.
ఇక మ్యాచ్ మరికొద్ది నిమిషాల్లో ముగుస్తుందనగా బ్రెజిల్‌పై మరో దెబ్బ పడింది.
ఇంజ్యూరీ సమయం (90+1)లో డిఫెండర్ జారిల్ జన్మాత్ నుంచి అందుకున్న పాస్‌ను మిడ్‌ఫీల్డర్ విజ్నాల్డమ్ నేరుగా గోల్‌పోస్టులోకి పంపి డచ్ ఆనందాన్ని రెట్టింపు చేశాడు.
విశేషాలు
14ఈ ప్రపంచకప్‌లో బ్రెజిల్ జట్టు సమర్పించుకున్న గోల్స్. ఓ టోర్నీలో ఇన్ని గోల్స్ ఇప్పటిదాకా ఏ జట్టు ఇవ్వలేదు
3 ప్రపంచకప్‌లో ఇరు జట్లు ఐదు సార్లు తలపడగా నెదర్లాండ్స్ మూడు సార్లు నెగ్గింది.
3 మూడో స్థానం కోసం నాలుగు సార్లు ఆడిన బ్రెజిల్ మూడు సార్లు ఓడింది.
9 గత తొమ్మిది ప్రపంచకప్‌ల్లో మూడో స్థానం యూరోప్ జట్టుకే దక్కింది.
3 వరుసగా రెండు ప్రపంచకప్‌ల్లో టాప్-3లో నిలిచిన జట్టుగా హాలెండ్ (గతంలో రన్నరప్).