బ్రెజిల్ తీన్‌మార్
నెయ్‌మార్ ‘డబుల్’
తొలి మ్యాచ్‌లో చెలరేగిన ఆతిథ్య జట్టు
ఆడుతున్నది తొలి ప్రపంచకప్... వయసు కేవలం 22 సంవత్సరాలు... స్వదేశంలో టోర్నీ ఆడటమే ఒత్తిడయితే, స్టార్ హోదా తలమీద ఉండటం మరింత ఒత్తిడి.... దీనిని అద్భుతంగా జయించాడు బ్రెజిల్ స్టార్ నెయ్‌మార్. ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌లో సంచలన ఆటతీరు ప్రదర్శించాడు. ఏకంగా రెండు గోల్స్ చేసి కోట్లాది మంది అభిమానుల అంచనాలను నిలబెట్టుకున్నాడు.
సావోపాలో: స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలో బ్రెజిల్ జట్టు శుభారంభం చేసింది. కెరీర్‌లో తొలి ప్రపంచకప్ ఆడుతున్న యువ సంచలనం నెయ్‌మార్ తన సత్తా ఏమిటో చాటి చెప్పాడు. ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టీ తనపైనే ఉన్నా ఏమాత్రం ఒత్తిడికి లోను కాకుండా రెండు గోల్స్‌తో అభిమానులను ఆనందంలో ముంచెత్తాడు. ఫలితంగా గ్రూప్ ‘ఎ’లో భారత కాలమానప్రకారం గురువారం అర్ధరాత్రి క్రొయేషియాతో జరిగిన మ్యాచ్‌ను బ్రెజిల్ 3-1తో గెలుచుకుంది.
మిడ్ ఫీల్డర్ ఆస్కార్ అద్భుతంగా రాణించడంతో పాటు ఓ గోల్ చేశాడు. ప్రత్యర్థి ఖాతాలోని ఒక్క గోల్ కూడా బ్రెజిల్ ఆటగాడు మార్సెలో చేసిన సెల్ఫ్ గోల్ కావడం గమనార్హం. ఇది ప్రపంచకప్ చరిత్రలోనే బ్రెజిల్ చేసిన తొలి సెల్ఫ్ గోల్. మరోవైపు బ్రెజిల్‌కు లభించిన పెనాల్టీ కిక్ వివాదాస్పదమైంది.
టోర్నీలో తొలి మ్యాచ్‌తో పాటు.. ఆడుతుంది సొంత మైదానంలో కావడంతో ఆరంభంలో బ్రెజిల్ జట్టు కాస్త ఒత్తిడికి లోనైంది. దీంతో క్రొయేషియా ఆటగాళ్లు చెలరేగారు. ఏడో నిమిషంలో ఇవికా ఒలిక్ హెడర్ గోల్ చేసేందుకు యత్నించినా కుడి వైపు వైడ్‌గా వెళ్లింది.
హా11వ నిమిషంలో బ్రెజిల్ అభిమానులకు షాక్ తగిలింది. క్రొయేషియా మిడ్ ఫీల్డర్ ఇవాన్ రాకిటిక్ అందించిన పాస్‌ను ఇవికా ఒలిక్.. పిచ్‌కు ఎడమ వైపు నుంచి ధాటిగా షాట్ ఆడగా గోల్ పోస్ట్ ముందున్న బ్రెజిల్ డిఫెండర్ మార్సెలో కాలితో బంతిని టచ్ చేసి సెల్ఫ్‌గోల్ చేశాడు.
హామ్యాచ్ 29వ నిమిషంలో నెయ్‌మార్ తన మేజిక్‌ను ప్రదర్శించాడు. మిడ్ ఫీల్డ్ నుంచి నేరుగా కొట్టిన షాట్ గోల్ పోస్ట్‌కు కుడివైపు తగిలి లోనికి వెళ్లింది. స్కోరు సమం అయింది.
హాద్వితీయార్థంలో ఇరు జట్లు గోల్ కోసం బాగానే శ్రమించాయి. 71వ నిమిషంలో బ్రెజిల్‌కు పెనాల్టీ కిక్ అవకాశం దక్కింది. క్రొయేషియా ఆటగాడు డేజాన్ లోరెన్.. బ్రెజిల్ స్ట్రయికర్ ఫ్రెడ్‌ను కింద పడేశాడనే కారణంతో రిఫరీ పెనాల్టీ కిక్ అవకాశం ఇచ్చాడు. అయితే రీప్లేలో వెనకాల ఉన్న లోరెన్‌ను తాకి తనకు తానే ఫ్రెడ్ కిందపడినట్టు స్పష్టమైంది. దీంతో రిఫరీపై విమర్శలు వెల్లువెత్తాయి.
హాతమకు లభించిన పెనాల్టీ కిక్‌ను నెయ్‌మార్ పొరపాటు చేయకుండా గోల్ చేయడంతో జట్టు 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇది బ్రెజిల్ తరఫున నెయ్‌మార్‌కు 33వ గోల్ కావడం విశేషం. ఇక్కడి నుంచి బ్రెజిల్ మరింత జోరు పెంచింది. 90 నిమిషాలు ముగిసిన తర్వాత లభించిన ఇంజురీ టైమ్‌లో తొలి నిమిషంలో ఆస్కార్ గోల్‌తో బ్రెజిల్ 3-1తో విజయం సాధించింది.
స్కోరు బోర్డు
బ్రెజిల్ : 3
(నెయ్‌మార్ 29వ, 71వ ని.; ఆస్కార్ 91వ ని.)
క్రొయేషియా : 1
(మార్సెలోసెల్ఫ్‌గోల్, 11వ ని.)
నేటి టాప్ మ్యాచ్...
ఇటలీ xఇంగ్లండ్
ప్రపంచ కప్‌లో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్‌ల్లో ఇదొకటి. మాజీ విశ్వవిజేతలైన ఈ రెండు జట్లకు ఈ లీగ్ మ్యాచ్ ఎంతో కీలకం. గెలిచిన జట్టుకు గ్రూప్ ‘డి’ నుంచి నాకౌట్ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.
వేన్ రూనీ, గెరార్డ్, లాంపార్డ్‌లాంటి స్టార్ ఆటగాళ్లతో ఇంగ్లండ్... ఆండ్రియా పిర్లో, బలోటెలి, మేటి గోల్‌కీపర్ బఫన్‌లతో ఇటలీ సమతూకంగా కనిపిస్తున్నాయి. అంతర్జాతీయస్థాయిలో ఇప్పటివరకు ఈ రెండు జట్లు 24 సార్లు తలపడ్డాయి. 9 మ్యాచ్‌ల్లో ఇటలీ, 8 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ గెలుపొందగా... 7మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి.