International Football Federation
-
నాలుగు రోజుల పాటు సోషల్ మీడియాను బహిష్కరించిన ‘ఫిఫా’
లండన్: తమ ఆటగాళ్లపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతోన్న ద్వేషపూరిత కామెంట్లపై ఆగ్రహించిన అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా), యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్స్ (యూఈఎఫ్ఏ), కామన్వెల్త్ గేమ్స్ సమాఖ్య (సీజీఎఫ్), అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్)లు నాలుగు రోజుల పాటు తమ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను మూసి వేస్తున్నట్లు ప్రకటించాయి. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సోమవారం అర్ధరాత్రి 11.59 నిమిషాల వరకు ఈ బహిష్కరణ కొనసాగుతుంది. ఈ విధంగానైనా ఆటగాళ్లపై ఆకతాయిలు చేసే అసభ్యకర కామెంట్లు ఆగుతాయని యూఈఎఫ్ఏ అధ్యక్షుడు అలెగ్జాండర్ ఎఫెరిన్ ఆకాంక్షించాడు. ఇకపై ఆటగాళ్లపై చేసే ద్వేషపూరిత వ్యాఖ్యలపై ఉపేక్షించేది లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు, ప్రీమియర్‌షిప్ రగ్బీ, లాన్ టెన్నిస్ సంఘం నాలుగు రోజుల బహిష్కరణకు మద్దతు తెలిపాయి. -
బ్లాటర్పై మళ్లీ నిషేధం
జ్యూరిక్ (స్విట్జర్లాండ్): అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) మాజీ అధ్యక్షుడు సెప్ బ్లాటర్పై మళ్లీ నిషేధం విధించారు. జరిమానా కూడా కట్టమన్నారు. తన పరిపాలన దక్షతతో ‘ఫిఫా’ను ఆర్థిక పరిపుష్టి చేసిన బ్లాటర్ అదే సమయంలో స్వామి కార్యాన్ని, స్వకార్యాన్ని నెరవేర్చుకునే పనిలో ఆర్థిక అవకతవకలు చేశారు. పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. దీనిపై విమర్శలు వెలువెత్తడంతో దర్యాప్తు చేసిన ‘ఫిఫా’ ఎథిక్స్ కమిటీ అధికార దుర్వినియోగం, ఆర్థిక అవకతవకలు నిజమేనని తేల్చింది. దీంతో గతంలోనే ఆరేళ్ల నిషేధం విధించారు. ఇదింకా ముగియనే లేదు. ఈ ఏడాది అక్టోబర్‌లో గత నిషేధం పూర్తవుతుంది. దీనికి ఏడు నెలల ముందే 85 ఏళ్ల మాజీ అధ్యక్షుడిపై మరో దఫా నిషేధాన్ని విధిస్తున్నట్లు ‘ఫిఫా’ బుధవారం ప్రకటించింది. అలాగే 10 లక్షల స్విస్ ఫ్రాంక్స్ (రూ. 7 కోట్ల 75 లక్షలు) జరిమానా కూడా విధించింది. గత డిసెంబర్లో బ్లాటర్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించి కోమాలోకి వెళ్లిపోయారు. ఇటీవలే కాస్త కుదుటపడి కోమా నుంచి బయటపడినప్పటికీ నిషేధం నుంచి మాత్రం తప్పించుకోలేకపోయారు. ఈ అవకతవకల్లో భాగమైన ‘ఫిఫా’ మాజీ కార్యదర్శి వాల్కేపై 2025 అక్టోబర్ వరకు నిషేధం ఉంది. ఆయనపై ఏకంగా పదేళ్ల నిషేధం విధించారు. -
వైద్య సిబ్బందికి ‘ఫిఫా’ జేజేలు...
న్యూఢిల్లీ: కరోనా బారిన పడిన ప్రజల్ని బతికించేందుకు తమ ప్రాణాలను పణంగా పెట్టి చికిత్స చేస్తున్న వైద్య సిబ్బందికి ఫుట్‌బాల్ లోకం జై కొట్టింది. జగద్విఖ్యాత సాకర్ స్టార్లు పీలే, డీగో మారడోనా, భారత మాజీ కెప్టెన్ బైచుంగ్ భూటియా తదితర 50 మంది ఆటగాళ్లతో వైద్య, సహాయ సిబ్బందికి జేజేలు పలుకుతూ సంఘీభావ సందేశాన్ని అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) విడుదల చేసింది. ఫుట్‌బాల్ ఆడే దేశాల ఆటగాళ్లు ఈ సంఘీభావంలో పాల్గొన్నారు. కరోనాపై అలుపెరగని పోరాటం చేస్తోన్న వైద్యులకు కరతాళధ్వనులతో సాకర్ స్టార్లు మద్దతు తెలిపారు. ‘మహమ్మారిపై పోరాటంలో దినదిన గండాలు ఎదురవుతున్నా... ప్రాణాలను లెక్కచేయకుండా పరుల స్వస్థత కోసం ప్రపంచవ్యాప్తంగా వైద్యులు, సిబ్బంది విశేష కృషి చేస్తోంది. వైరస్‌ను కట్టడి చేసేందుకు వలంటీర్లు, ఫార్మాసిస్టులు... ఇతరులకు సోకకుండా పోలీసులు, సెక్యూరిటీ వర్గాలు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నాయి. ఇంతటి భయానక పరిస్థితుల్లో ప్రజలకు నిత్యావసరాలు అందించేందుకు పాటుపడుతున్న వర్గాలు... ఇలా వీరంతా నిజమైన హీరోలు. వీరికి ఫుట్‌బాల్ కృతజ్ఞతలు తెలుపుతోంది. వీరిని ఫుట్‌బాల్ సదా స్మరిస్తుంది. వీరందరికి ఫుట్‌బాల్ మద్దతు తెలుపుతోంది’ అని ‘ఫిఫా’ ఈ సందేశంలో తెలిపింది. -
కరోనా కట్టడికి 5 పెనాల్టీ ‘కిక్’లు
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్‌పై ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు వినూత్న ప్రయోగానికి బీజం పడింది. విశ్వవ్యాప్తంగా ఎక్కువ మంది అభిమానులు ఇష్టపడే ఆట ఫుట్‌బాల్. ఈ క్రీడను పర్యవేక్షించే అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా), ప్రపంచ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు నిబద్ధతతో సేవలందించే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)లు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్న 28 మంది పురుష, మహిళా ఫుట్‌బాల్ క్రీడాకారులను ఎంపిక చేసి వారి చేత 13 జాతీయ భాషల్లో కరోనా వైరస్ నివారణకుగాను తీసుకోవాల్సిన ఐదు చర్యల గురించి అవగాహన కల్పించేలా వీడియో రూపంలో చిత్రీకరించారు. ఇందులో మన దేశం గర్వించదగిన ఫుట్‌బాల్ క్రీడాకారుడు సునీల్ ఛెత్రి కూడా ఉన్నారు. కరోనా వ్యాప్తి నిరోధానికిగాను సహాయక కార్యక్రమాలకు గాను కోటి డాలర్లను (రూ. 76 కోట్లు) సాయం చేసేందుకు ‘ఫిఫా’ ముందుకు వచ్చింది. ఆ ఐదు కిక్‌లు ఇవే...! ముఖ్యంగా ఈ వైరస్ విజృంభణను నియంత్రించేలా తీసుకోవాల్సిన ఐదు చర్యల గురించి ఈ వీడియోలో జాతీయ భాషల్లో వివరించనున్నారు. చేతులు తరచుగా కడుక్కోవడం... తుమ్ము, దగ్గు వచ్చినప్పుడు మోచేతిని అడ్డుపెట్టుకోవడం... ముఖాన్ని తాకకుండా ఉండడం... సామాజిక దూరాన్ని పాటించడం... ఆరోగ్యం సరిగా లేదనే భావన కలిగితే వెంటనే పరీక్షలు చేయించుకోవడం... తద్వారా ఈ వైరస్‌ను ఎలా నియంత్రించవచ్చో ఆ వీడియోల్లో ఫుట్‌బాల్ దిగ్గజాలు చేసి చూపించనున్నారు. ఈ వీడియోలను ‘ఫిఫా’ డిజిటల్ చానెళ్లు, 211 ఫిఫా సభ్య అసోసియేషన్లు, స్థానిక మీడియా ఏజెన్సీలకు పంపనున్నారు. వీటిని సోషల్ మీడియాలో వ్యాప్తి చేసేందుకు అవసరమైన టూల్ కిట్లను కూడా పంపనున్నట్టు ‘ఫిఫా’, డబ్ల్యూహెచ్ఓలు వెల్లడించాయి. -
‘ఆ సత్తా భారత్‌కు ఉంది’
కోల్‌కతా: అండర్–17 ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీని విజయవంతంగా నిర్వహిస్తోన్న భారత్‌పై అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) ప్రశంసల వర్షం కురిపించింది. అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ‘ఫిఫా’ టోర్నీల హెడ్ జైమే యార్జా మాట్లాడుతూ భారత్ ఆతిథ్యం అద్వితీయమన్నారు. సమీప భవిష్యత్తులో సీనియర్ సాకర్ ప్రపంచకప్‌ను నిర్వహించే సత్తా భారత్‌కు ఉందని కితాబిచ్చారు. ‘ఈ టోర్నీ ఎంతటి విజయవంతమైందో వేలాది అభిమానుల హాజరు చూపుతోంది. కోట్లాది ప్రేక్షకుల టీవీ రేటింగ్ తెలుపుతోంది. అత్యధిక సంఖ్యలో ప్రత్యక్షంగా మ్యాచ్‌లను చూసిన జూనియర్ ప్రపంచకప్‌గా ఘనతకెక్కింది. మ్యాచ్‌లు సాగిన తీరు, ఘనమైన నిర్వహణ, వాడిన సాంకేతిక నైపుణ్యం అన్ని అత్యున్నతంగా ఉన్నాయి. ఓ అద్భుతమైన టోర్నమెంట్‌ను భారత్ ఆవిష్కరించింది. ఇపుడు భారత్ కూడా ఫుట్‌బాల్ దేశమైంది’ అని యార్జా తెలిపారు. భారత జట్టు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో పోరాడిందని కితాబిచ్చారు. ఏఐఎఫ్ఎఫ్ చీఫ్ ప్రఫుల్ పటేల్ మాట్లాడుతూ 2019లో జరిగే అండర్–20 ప్రపంచకప్‌కు బిడ్ వేస్తామని చెప్పారు. -
భారత్@ 101
ప్రపంచ ఫుట్‌బాల్ ర్యాంకింగ్స్ 21 ఏళ్లలో ఇదే అత్యుత్తమం న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో భారత జట్టు 101 ర్యాంకులో నిలిచింది. గత నెలలో 132వ ర్యాంక్‌లో ఉన్న భారత్ ఏకంగా 31 స్థానాలు ఎగబాకింది. ఇటీవల 2019 ఆసియా క్వాలిఫయర్ మూడో రౌండ్లో 1–0తో మయన్మార్‌పై గెలవడంతో జట్టు ర్యాంక్ మెరుగైంది. భారత్ ఏఎఫ్సీ ఆసియా క్వాలిఫయర్స్‌లో వరుసగా ఆరు మ్యాచుల్లో విజయం సాధించింది. 1996 ఫిబ్రవరిలో భారత జట్టు అత్యుత్తమంగా 94వ ర్యాంకు సాధించింది. 1996 మేలో ఆఖరిసారిగా 101వ ర్యాంక్‌లో నిలిచిన భారత్ ఆ తర్వాత ఒక్కసారిగా దిగజారిపోయింది. తాజా ర్యాంకింగ్స్ ప్రకారం భారత్ ఆసియా జట్లలో 11వ స్థానంలో నిలిచింది.కోచ్‌గా స్టీఫెన్ కాన్స్టెంటైన్ 2015లో బాధ్యతలు తీసుకునే సరికి భారత్ 171వ ర్యాంకులో ఉంది. ఆ తర్వాత కాన్స్టెంటైన్ జట్టు ప్రదర్శనను మెరుగు పర్చడంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం అర్జెంటీనాను వెనక్కినెట్టి బ్రెజిల్ తొలి ర్యాంకుకు చేరగా.. జర్మనీ, చిలీ, కొలంబియాలు తరువాత స్థానాల్లో నిలిచాయి. -
‘ఫిఫా’ను దెబ్బతీసేందుకు యత్నం
ఖతర్‌పై ఆరోపణలకు జాతివివక్షే కారణం విరుచుకుపడిన బ్లాటర్ సావోపాలో: సాకర్ ప్రపంచకప్-2022 ఆతిథ్య హక్కులను ఖతర్ భారీగా లంచం ముట్టజెప్పి సొంతం చేసుకుందన్న ఆరోపణలపై అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) అధ్యక్షుడు సెప్ బ్లాటర్ తీవ్రస్థాయిలో స్పందించారు. ఖతర్‌పై అవినీతి ఆరోపణలకు జాతి వివక్షే కారణమని మండిపడ్డారు. అదే సమయంలో ఫిఫాను దెబ్బతీసేందుకే ప్రయత్నిస్తున్నారని బ్లాటర్ విరుచుకుపడ్డారు. ‘ఫిఫా బలంగా ఉండటాన్ని వాళ్లు ఓర్వలేకపోతున్నారు. అందుకే ఫిఫాను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. మనం కలిసి ముందుకు వెళితే ఎవరూ ఏమీ చేయలేరు’ అని బ్లాటర్ అన్నారు. ఫిఫా వార్షిక సమావేశం జరగనున్న నేపథ్యంలో ఆసియా, ఆఫ్రికాకు చెందిన ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. కొనసాగుతున్న విచారణ మరోవైపు ఈ అవినీతి ఆరోపణలపై ఫిఫా అధికారి మైకేల్ గార్సియా తన విచారణను సోమవారమే ముగించాల్సింది. అయితే ఈ విచారణ ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. గార్సియా తన నివేదికను ఫిఫా అడ్జ్యూడికేటరి చాంబర్‌కు జూలై మూడో వారంలో సమర్పించనున్నారు. మరోసారి ఫిఫా అధ్యక్షుడిగా! ఫిఫా అధ్యక్షుడిగా సెప్ బ్లాటర్ ఐదోసారి ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచకప్ సందర్భంగా ఫిఫా వార్షిక సర్వసభ్య సమావేశం జరగనున్న నేపథ్యంలో బ్లాటర్ ఇప్పటికే అధ్యక్షుడి బరిలో నిలవనున్నట్లు సంకేతాలు కూడా ఇచ్చారు.