సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్‌పై ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు వినూత్న ప్రయోగానికి బీజం పడింది. విశ్వవ్యాప్తంగా ఎక్కువ మంది అభిమానులు ఇష్టపడే ఆట ఫుట్‌బాల్. ఈ క్రీడను పర్యవేక్షించే అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా), ప్రపంచ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు నిబద్ధతతో సేవలందించే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)లు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్న 28 మంది పురుష, మహిళా ఫుట్‌బాల్ క్రీడాకారులను ఎంపిక చేసి వారి చేత 13 జాతీయ భాషల్లో కరోనా వైరస్ నివారణకుగాను తీసుకోవాల్సిన ఐదు చర్యల గురించి అవగాహన కల్పించేలా వీడియో రూపంలో చిత్రీకరించారు. ఇందులో మన దేశం గర్వించదగిన ఫుట్‌బాల్ క్రీడాకారుడు సునీల్ ఛెత్రి కూడా ఉన్నారు. కరోనా వ్యాప్తి నిరోధానికిగాను సహాయక కార్యక్రమాలకు గాను కోటి డాలర్లను (రూ. 76 కోట్లు) సాయం చేసేందుకు ‘ఫిఫా’ ముందుకు వచ్చింది.
ఆ ఐదు కిక్‌లు ఇవే...!
ముఖ్యంగా ఈ వైరస్ విజృంభణను నియంత్రించేలా తీసుకోవాల్సిన ఐదు చర్యల గురించి ఈ వీడియోలో జాతీయ భాషల్లో వివరించనున్నారు. చేతులు తరచుగా కడుక్కోవడం... తుమ్ము, దగ్గు వచ్చినప్పుడు మోచేతిని అడ్డుపెట్టుకోవడం... ముఖాన్ని తాకకుండా ఉండడం... సామాజిక దూరాన్ని పాటించడం... ఆరోగ్యం సరిగా లేదనే భావన కలిగితే వెంటనే పరీక్షలు చేయించుకోవడం... తద్వారా ఈ వైరస్‌ను ఎలా నియంత్రించవచ్చో ఆ వీడియోల్లో ఫుట్‌బాల్ దిగ్గజాలు చేసి చూపించనున్నారు. ఈ వీడియోలను ‘ఫిఫా’ డిజిటల్ చానెళ్లు, 211 ఫిఫా సభ్య అసోసియేషన్లు, స్థానిక మీడియా ఏజెన్సీలకు పంపనున్నారు. వీటిని సోషల్ మీడియాలో వ్యాప్తి చేసేందుకు అవసరమైన టూల్ కిట్‌లను కూడా పంపనున్నట్టు ‘ఫిఫా’, డబ్ల్యూహెచ్‌ఓలు వెల్లడించాయి.
కరోనా కట్టడికి 5 పెనాల్టీ ‘కిక్’లు
Published Thu, Mar 26 2020 6:33 AM | Last Updated on Thu, Mar 26 2020 6:33 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment