ఢిల్లీ నుంచి స్వస్థలాలకు చేరుకోవడానికి ముందు స్క్రీనింగ్ పరీక్షల కోసం వేచి చూస్తున్న వలస కూలీలు
న్యూఢిల్లీ: భారతదేశంలో ఇప్పటిదాకా ప్రతి లక్ష జనాభాకు 7.1 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం తెలియజేసింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ప్రతి లక్ష జనాభాకు 60 కేసులు నమోదయ్యాయని పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నివేదిక ప్రకారం.. ప్రపంచంలో ఇప్పటివరకు 48,49,427 కరోనా కేసులు బయటపడ్డాయి. ప్రతి లక్ష మందికి అమెరికాలో 431 కేసులు, రష్యాలో 195, యూకేలో 361, స్పెయిన్‌లో 494, ఇటలీలో 372, బ్రెజిల్‌లో 104, జర్మనీలో 210, టర్కీలో 180, ఫ్రాన్స్‌లో 209, ఇరాన్‌లో 145 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలతో మంచి ఫలితాలు వచ్చాయని వివరించింది.
24 గంటల్లో 5,242 పాజిటివ్ కేసులు
భారతదేశంలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం ఆగడం లేదు. పాజిటివ్ కేసులు లక్షకు చేరుకుంటున్నాయి. మరణాలు 3 వేల మార్కును దాటేశాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా ఆదివారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు కేవలం 24 గంటల్లో 5,242 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం. అలాగే తాజాగా 157 మంది కరోనా వల్ల మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 96,169కి, మరణాల సంఖ్య 3,029కి ఎగబాకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 56,316. కరోనా బారిన పడిన వారిలో 36,823 మంది బాధితులు చికిత్సతో కోలుకున్నారు. రికవరీ రేటు 38.29 శాతంగా నమోదైంది. రికవరీ రేటు క్రమంగా పెరుగుతుండడం కొంత ఉపశమనం కలిగిస్తోంది. దేశంలో ప్రధానంగా మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాలు కరోనాతో వణికిపోతున్నాయి. అధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు ఆయా రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయి.
లాక్‌డౌన్ 4 నిబంధనలను నీరుగార్చొద్దు
దేశంలో నాలుగో దశ లాక్‌డౌన్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన తాజాగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. లాక్‌డౌన్ నిబంధనలను నీరుగార్చొద్దని పేర్కొన్నారు. లాక్‌డౌన్ విషయంలో కేంద్ర హోంశాఖ జారీ చేసిన నిబంధనలను తు.చ తప్పకుండా పాటించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని సూచించారు. ప్రభుత్వం అనుమతించిన దుకాణాలు మాత్రమే తెరిచేలా చూడాలన్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆదివారం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను విభజించాలని అజయ్ భల్లా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment