బైచుంగ్ భూటియా,పీలే, డీగో మారడోనా
న్యూఢిల్లీ: కరోనా బారిన పడిన ప్రజల్ని బతికించేందుకు తమ ప్రాణాలను పణంగా పెట్టి చికిత్స చేస్తున్న వైద్య సిబ్బందికి ఫుట్‌బాల్ లోకం జై కొట్టింది. జగద్విఖ్యాత సాకర్ స్టార్లు పీలే, డీగో మారడోనా, భారత మాజీ కెప్టెన్ బైచుంగ్ భూటియా తదితర 50 మంది ఆటగాళ్లతో వైద్య, సహాయ సిబ్బందికి జేజేలు పలుకుతూ సంఘీభావ సందేశాన్ని అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) విడుదల చేసింది. ఫుట్‌బాల్ ఆడే దేశాల ఆటగాళ్లు ఈ సంఘీభావంలో పాల్గొన్నారు. కరోనాపై అలుపెరగని పోరాటం చేస్తోన్న వైద్యులకు కరతాళధ్వనులతో సాకర్ స్టార్లు మద్దతు తెలిపారు.
‘మహమ్మారిపై పోరాటంలో దినదిన గండాలు ఎదురవుతున్నా... ప్రాణాలను లెక్కచేయకుండా పరుల స్వస్థత కోసం ప్రపంచవ్యాప్తంగా వైద్యులు, సిబ్బంది విశేష కృషి చేస్తోంది. వైరస్‌ను కట్టడి చేసేందుకు వలంటీర్లు, ఫార్మాసిస్టులు... ఇతరులకు సోకకుండా పోలీసులు, సెక్యూరిటీ వర్గాలు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నాయి. ఇంతటి భయానక పరిస్థితుల్లో ప్రజలకు నిత్యావసరాలు అందించేందుకు పాటుపడుతున్న వర్గాలు... ఇలా వీరంతా నిజమైన హీరోలు. వీరికి ఫుట్‌బాల్ కృతజ్ఞతలు తెలుపుతోంది. వీరిని ఫుట్‌బాల్ సదా స్మరిస్తుంది. వీరందరికి ఫుట్‌బాల్ మద్దతు తెలుపుతోంది’ అని ‘ఫిఫా’ ఈ సందేశంలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment