Baichung Bhutia
-
AIFF: తొలిసారి అధ్యక్షుడిగా ఆటగాడు
న్యూఢిల్లీ: మైదానంలో ఆటగాళ్లు గోల్ కోసం శ్రమిస్తుంటే... కేంద్ర మంత్రి స్థాయి వారు ఫుట్‌బాల్ సంఘంలో ఏళ్ల తరబడి తిష్టవేసి రాజకీయాలు చేశారు. ఇలా ఆటకు సంబంధంలేని వారే 85 ఏళ్ల పాటు అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్)ను ఏలారు. ఏనాడూ మాజీ కెప్టెన్ కానీ, దిగ్గజ ప్లేయర్ కానీ సమాఖ్యలో అధ్యక్ష స్థానంలో లేనే లేరు. దీంతో రాజకీయాలతో మసక బారిన ఏఐఎఫ్ఎఫ్ చివరకు మన ఫుట్‌బాల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ‘ఫిఫా’ నిషేధానికి గురైంది. చివరకు రోజుల వ్యవధిలోనే సడలింపుతో ఊపిరి పోసుకున్న ఏఐఎఫ్ఎఫ్కు ఇప్పుడు కొత్త జవసత్వాలు మాజీ ఆటగాడి రూపంలో వచ్చాయి. భారత మాజీ గోల్ కీపర్ కల్యాణ్ చౌబే 85 ఏళ్ల ఏఐఎఫ్ఎఫ్ చరిత్రలో అధ్యక్షుడైన ఆటగాడిగా నిలిచారు. మాజీ కెప్టెన్, దిగ్గజం బైచుంగ్ భూటియా ఈ ఎన్నికలో ఓడినప్పటికీ మైదానంలోలాగే ఓ ఆటగాడి చేతిలోనే ఓడాడు. రాజకీయ నాయకుడి చేతిలో కాకపోవడం గొప్ప ఊరట. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో 46 ఏళ్ల కల్యాణ్ చౌబే అధ్యక్షుడిగా ఏకపక్ష విజయం సాధించారు. ఆయన 33–1 ఓట్ల తేడాతో భూటియాను ఓడించారు. ఆశ్చర్యకరంగా మాజీ కెప్టెన్‌కు ఒక్క ఓటే రావడం విచిత్రం! భూటియా, ఐఎం విజయన్, లారెన్స్, హైదరాబాద్‌కు చెందిన భారత మాజీ కెప్టెన్ షబ్బీర్ అలీ ఆటగాళ్ల ప్రతినిధులుగా ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ) సభ్యులుగా వ్యవహరిస్తారు. మిగతా 14 మంది ఈసీ మెంబర్లంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందులో తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం జనరల్ సెక్రటరీ జీపీ ఫల్గుణతో పాటు అవిజీత్ పాల్, పి.అనిల్ కుమార్, వాలంక నటాష, మాలోజి రాజే ఛత్రపతి, మేన్ల ఎతెన్పా, మోహన్ లాల్, ఆరిఫ్ అలీ, కె.నీబౌ సెఖోస్, లాల్గింగ్లోవా, దీపక్ శర్మ, విజయ్ బాలి, ఇంతియాజ్ హుస్సేన్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన గోపాలకృష్ణ కొసరాజు కోశాధికారి పదవి కోసం పోటీపడి 1–32తో కిపా అజయ్ (అరుణాచల్ ప్రదేశ్) చేతిలో ఓడారు. మంచి గోల్ కీపర్... కల్యాణ్ చౌబే మాజీ గోల్ కీపర్, మంచి గోల్‌కీపర్ కూడా. 1996లో మోహన్ బగాన్ సీనియర్ క్లబ్ తరఫున అరంగేట్రం చేశారు. తదనంతరం ఈస్ట్ బెంగాల్, జేసీటీ, సాల్గావ్కర్ తదితర క్లబ్‌లకు 2003 ఏడాది వరకు ప్రాతినిధ్యం వహించారు. అంతకంటే ముందు జూనియర్ స్థాయిలో భారత అండర్–17, అండర్–20 జట్ల తరఫున ఆసియా యూత్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నారు. 1999–2000లో ప్రి–ఒలింపిక్ క్వాలిఫికేషన్లో భారత సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. దక్షిణాసి యా ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో భారత్ మూడుసార్లు విజేతగా నిలువడంలో గోల్‌కీపర్ గా చౌబే కీలకపాత్ర పోషించారు. ప్రత్యక్ష రాజకీయాల్లో 2019లో బీజేపీ తరఫున బెంగాల్లో ఎంపీ పదవికి పోటీ చేసి ఓడిపోయారు. -
బైచుంగ్ భుటియా ఘోర పరాజయం.. ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడిగా కళ్యాణ్ చౌబే
అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) కొత్త అధ్యక్షుడిగా మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు.. బీజేపీ నేత కళ్యాణ్ చౌబే ఎన్నికయ్యాడు. టీమిండియా మాజీ ఫుట్‌బాల్ స్టార్ బైచుంగ్ భుటియాతో జరిగిన పోటీలో 33-1 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించాడు. మొత్తం 34 ఓట్లలో భుటియాకు కేవలం ఒక్క ఓటు మాత్రమే పడింది. కాగా 34 సభ్యుల ఓటర్ల జాబితాలో భూటియాకు మద్దతుదారులు కరువయ్యారు. 85 ఏళ్ల భారత ఫుట్‌బాల్ సమాఖ్య చరిత్రలో ఒక మాజీ ఆటగాడు అధ్యక్షుడిగా ఎంపికవ్వడం ఇదే తొలిసారి. ఇక మాజీ ప్లేయర్ అయిన చౌబే గతంలో మోహన్ బగాన్, ఈస్ట్ బెంగాల్ జట్లకు ఆడాడు. అయితే చౌబే ఇండియా సీనియర్ జట్టుకు ఎప్పుడూ ఆడింది లేదు. కానీ పలుమార్లు జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ఇండియా తరపున ఏజ్ గ్రూపు ఇంటర్నేషనల్ టోర్నీల్లో మాత్రం అతను ప్రాతినిధ్యం వహించాడు. తన ప్రత్యర్థి ఉన్న భూటియాతో కలిసి చౌబే గతంలో ఈస్ట్ బెంగాల్ జట్టుకు కలిసి ఆడాడు. ఏఐఎఫ్ఎఫ్ ఉపాధ్యక్షుడి పోస్టుకు కర్నాటక ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్.ఏ హరిస్ గెలుపొందాడు. రాజస్థాన్‌కు చెందిన మన్వేందర్ సింగ్‌పై హరిస్ విజయం సాధించాడు.అలాగే ట్రెజరరీ పోస్టును అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన కిపాఅజయ్ దక్కించుకున్నాడు. ఇక చౌబే గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తరపున బెంగాల్‌లోని కృష్ణానగర్ సీటు నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యాడు. కాగా ఆగస్టు 17న ఏఐఎఫ్ఎఫ్లో తృతీయ పక్షం జోక్యం సహించేది లేదని 'ఫిఫా' పలుమార్లు హెచ్చరించినప్పటికి అఖిల భారత సమాఖ్య ఫుట్‌బాల్ ఫెడరేషన్ పట్టించుకోలేదు. దీంతో ఫిఫా భారత్ ఫుట్‌బాల్ సమాఖ్యపై నిషేధం విధించింది. ఏఐఎఫ్ఎఫ్ పూర్తిస్థాయి కార్యవర్గంతో పనిచేస్తేనే నిషేధం ఎత్తివేస్తామని ఫిఫా తెలిపింది. కాగా భారత ఫుట్‌బాల్ సమాఖ్యపై విధించిన నిషేధాన్ని ఫిఫా ఆగస్టు 27న ఎత్తివేసింది. ఏఐఎఫ్ఎఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీని రద్దు చేసి రోజూవారీ కార్యకలాపాలపై సమాఖ్య పరిపాలనా వర్గం పూర్తిగా పట్టు చేజిక్కించుకున్నట్లు తెలియడంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ‘ఫిఫా’ ప్రకటించింది. భారత్‌లో పరిస్థితిని సమీక్షిస్తూ ఉంటామని, ఎన్నికలను సరైన రీతిలో నిర్వహించేందుకు సహకారం అందిస్తామని స్పష్టం చేసింది. దీంతో అక్టోబర్ 11నుంచి భారత్‌లో జరగాల్సిన అండర్–17 మహిళల ప్రపంచ కప్‌ను యథావిధిగా నిర్వహించేందుకు అనుమతిచ్చింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఏఐఎఫ్ఎఎఫ్లో జరిగిన ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. We congratulate Mr. @kalyanchaubey on being elected as the President, Mr. @mlanaharis as the Vice President, and Mr. Kipa Ajay as the Treasurer of the All India Football Federation 🙌🏼#AIFFGeneralBodyElections2022 🗳️ #IndianFootball ⚽ pic.twitter.com/YRwexiUntx — Indian Football Team (@IndianFootball) September 2, 2022 -
వైద్య సిబ్బందికి ‘ఫిఫా’ జేజేలు...
న్యూఢిల్లీ: కరోనా బారిన పడిన ప్రజల్ని బతికించేందుకు తమ ప్రాణాలను పణంగా పెట్టి చికిత్స చేస్తున్న వైద్య సిబ్బందికి ఫుట్‌బాల్ లోకం జై కొట్టింది. జగద్విఖ్యాత సాకర్ స్టార్లు పీలే, డీగో మారడోనా, భారత మాజీ కెప్టెన్ బైచుంగ్ భూటియా తదితర 50 మంది ఆటగాళ్లతో వైద్య, సహాయ సిబ్బందికి జేజేలు పలుకుతూ సంఘీభావ సందేశాన్ని అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) విడుదల చేసింది. ఫుట్‌బాల్ ఆడే దేశాల ఆటగాళ్లు ఈ సంఘీభావంలో పాల్గొన్నారు. కరోనాపై అలుపెరగని పోరాటం చేస్తోన్న వైద్యులకు కరతాళధ్వనులతో సాకర్ స్టార్లు మద్దతు తెలిపారు. ‘మహమ్మారిపై పోరాటంలో దినదిన గండాలు ఎదురవుతున్నా... ప్రాణాలను లెక్కచేయకుండా పరుల స్వస్థత కోసం ప్రపంచవ్యాప్తంగా వైద్యులు, సిబ్బంది విశేష కృషి చేస్తోంది. వైరస్‌ను కట్టడి చేసేందుకు వలంటీర్లు, ఫార్మాసిస్టులు... ఇతరులకు సోకకుండా పోలీసులు, సెక్యూరిటీ వర్గాలు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నాయి. ఇంతటి భయానక పరిస్థితుల్లో ప్రజలకు నిత్యావసరాలు అందించేందుకు పాటుపడుతున్న వర్గాలు... ఇలా వీరంతా నిజమైన హీరోలు. వీరికి ఫుట్‌బాల్ కృతజ్ఞతలు తెలుపుతోంది. వీరిని ఫుట్‌బాల్ సదా స్మరిస్తుంది. వీరందరికి ఫుట్‌బాల్ మద్దతు తెలుపుతోంది’ అని ‘ఫిఫా’ ఈ సందేశంలో తెలిపింది. -
భవిష్యత్తు ‘6 ఎ సైడ్’ మ్యాచ్లదే!
సాక్షి, హైదరాబాద్: ఫుట్‌బాల్ క్రీడలోకి కొత్తగా వచ్చిన లీగ్‌ల వల్ల ఆటకు ఆదరణ పెరగడమే కాకుండా, ప్రతిభావంతులు కూడా వెలుగులోకి వస్తున్నారని భారత మాజీ కెప్టెన్ భైచుంగ్ భూటియా వ్యాఖ్యానించాడు. ముఖ్యంగా ‘6 ఎ సైడ్’ టోర్నమెంట్లో ఈ ఆటలో కొత్త తరహా వినోదాన్ని అందిస్తున్నాయని అతను అన్నాడు. హైదరాబాద్ ఫుట్‌బాల్ లీగ్ (హెచ్ఎఫ్ఎల్)కు మెంటర్‌గా వ్యవహరిస్తున్న భూటియా గురువారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నాడు. హెచ్ఎఫ్ఎల్ టోర్నీలో పాల్గొంటున్న 12 జట్ల జెర్సీలను భూటియా ఆవిష్కరించాడు. ఈ లీగ్ నవంబర్ 26న ప్రారంభమై జనవరి 27 వరకు పది వారాల పాటు కొనసాగుతుంది. ‘సాధారణంగా 11 మంది ఉండే ఫుట్‌బాల్‌తో పోలిస్తే 6 ఎ సైడ్‌లో వినోదం పాలు ఎక్కువ. ఎక్కువ సేపు ఆటగాళ్లు బంతిని తమ నియంత్రణలో ఉంచుకొని విన్యాసాలు ప్రదర్శించవచ్చు. ముఖ్యంగా దక్షిణ అమెరికా దేశాల్లో దీనికి మంచి ఆదరణ ఉంది. మన దగ్గర కూడా ఈ సంస్కృతి పెరిగింది. గతంలో అనేక మంది దిగ్గజాలను అందించిన హైదరాబాద్‌లో హెచ్ఎఫ్ఎల్ నిర్వహణ వల్ల మరింత మంది ఆట వైపు ఆకర్షితులవుతారని నమ్ముతున్నా’ అని భూటియా అభిప్రాయ పడ్డాడు. మెంటర్ హోదాలో భూటియా నేరుగా ఆటగాళ్లు, వ్యూహాలకు సంబంధించి కాకుండా... తగిన మార్గనిర్దేశనం చేసేందుకు, లీగ్‌ను సమర్థంగా నిర్వహించేందుకు సహకరిస్తాడు. హెచ్ఎఫ్ఎల్లో విజేతగా నిలిచిన జట్టుకు రూ.3 లక్షల నగదు బహుమతి లభిస్తుంది. మీడియా సమావేశంలో హెచ్ఎఫ్ఎల్ ప్రతినిధులు మురాద్ జసాని, ఆదిల్ మిస్త్రీ, నవీద్ కేశ్వాని తదితరులు పాల్గొన్నారు. -
భూటియాపై వేటు
కోల్‌కతా: రెండేళ్లపాటు అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) సలహాదారుగా పనిచేసిన భారత మాజీ కెప్టెన్ బైచుంగ్ భూటియాను తప్పించారు. గత డిసెంబర్లోనే అతనితో ఒప్పందం గడువు పూర్తయిందని... మళ్లీ ఆ ఒప్పందాన్ని పునరుద్ధరించలేదని ఏఐఎఫ్ఎఫ్ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్‌కు సాంకేతిక సలహాదారుడిగా కూడా పనిచేసిన భూటియా... ఆ సమయంలో స్టీఫెన్ కాన్స్టాంటైన్ భారత జట్టుకు మళ్లీ కోచ్‌గా రావడంలో కీలకపాత్ర పోషించారు. ఏఐఎఫ్ఎఫ్ ప్రముఖులతో అభిప్రాయబేధాలు రావడంతోనే భూటియా కాంట్రాక్ట్‌ను పొడిగించలేదని సమాచారం. భారత అండర్–17 కోచ్‌గా నికొలాయ్ ఆడమ్‌ను తప్పించాక... ఆయన స్థానంలో కామ్ టోయల్ను కోచ్‌గా తీసుకురావాలని భూటియా సూచించాడు. అయితే భూటియా సూచనలను పట్టించుకోకుండా ఏఐఎఫ్ఎఫ్ పోర్చుగల్‌కు చెందిన లూయిస్ నార్టన్ డి మాటోస్ను అండర్–17 జట్టుకు కోచ్‌గా నియమించింది. -
ఫుట్‌బాల్‌కు గుడ్ డేస్
హైదరాబాద్‌లో ఫుట్‌బాల్‌కు మళ్లీ మంచిరోజులు వస్తాయని భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ బైచుంగ్ భుటియా ఆశాభావం వ్యక్తం చేశారు. బంజారాహిల్స్‌లోని తాజ్ డెక్కన్‌లో సనోఫీ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటైన వరల్డ్ ఆర్థరైటిస్ అవగాహన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన భుటియా కొద్దిసేపు ‘సిటీప్లస్’తో ముచ్చటించాడు. అవి ఆయున మాటల్లోనే.. ‘హైదరాబాద్ నుంచి విక్టరీ అమల్‌రాజ్ వంటి మేటి ఫుట్‌బాల్ ఆటగాళ్లు భారత జట్టుతో పాటు వివిధ క్లబ్‌లకు ప్రాతినిధ్యం వహించారు. ఇండియన్ సూపర్లీగ్తో (ఐఎస్ఎల్) ఈ సిటీలోనూ ఫుట్‌బాల్‌కు మళ్లీ క్రేజ్ వస్తుంది. హైదరాబాద్ అంటే నాకు చాలా అభిమానం. ఇక్కడి రుచులు నాకు చాలా నచ్చుతాయి.. కొద్దిరోజుల్లో ప్రారంభం కానున్న ఐఎస్ఎస్ లీగ్ ఫ్రాంచైజీల్లో క్రికెట్ స్టార్లు మహేంద్రసింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ, బాలీవుడ్ నటులు జాన్ అబ్రహాం, రణబీర్ కపూర్, సల్మాన్ ఖాన్ వంటి వారే భాగస్వాములుగా ఉండటం శుభపరిణామం. ఐపీఎల్ తరహాలోనే ఐఎస్ఎల్లోనూ మెరికల్లాంటి ప్లేయుర్స్ రాణించే అవకాశాలు ఉన్నాయి. క్రికెట్‌ను అమితంగా ఆరాధించే మనదేశంలో స్వయంగా క్రికెటర్లే ఫుట్‌బాల్ వైపు చూస్తున్నారంటే, యువత తప్పకుండా ఈ పరిణామంపై ఆలోచిస్తారు. అయితే, ఫుట్‌బాల్ ఆడే సమయంలో ఫిట్‌గా ఉండటం చాలా ముఖ్యం. గాయాల పట్ల అలసత్వం పనికిరాదు. నా కెరీర్లో ఇప్పటి వరకు ఆరుసార్లు మోకాలికి ఆపరేషన్లు జరిగాయి. నాలుగేళ్ల కిందట ఆర్థోపెడిక్స్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ సచిన్ యాదవ్ సలహాపై విస్కో సప్లిమెంటేషన్ తీసుకుంటుండటంతో ఇప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటున్నా’. - వీఎస్ -
‘గోల్’ కొడతారా!
ఎన్నికల బరిలో పలువురు క్రీడాకారులు న్యూఢిల్లీ: ఫుట్‌బాల్ ఆటగాడు బైఛుంగ్ భుటియా, షూటింగ్లో ఒలింపిక్ పతకం సాధించిన రాజ్యవర్దన్ రాథోడ్, చిన్న వయసులోనే యువ భారత క్రికెట్ జట్టుకు సారథ్యం వహించిన మహమ్మద్ కైఫ్ వరకు పలువురు క్రీడాకారులు ఈసారి ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. భుటియా డార్జిలింగ్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ టికెట్‌పై ఎంపీగా పోటీ చేస్తున్నారు. 2011 ఆగస్టులో అంతర్జాతీయ ఫుట్‌బాల్ నుంచి ఆయన రిటైర్మెంట్ ప్రకటించాడు. ఫుట్‌బాల్ ఆటగాడిగా పలు గోల్స్ సాధించిన భుటియా ఎన్నికల సమరంలో ఎంతవరకు నెగ్గుకొస్తాడో ఓటర్ల కరుణపైనే ఆధారపడి ఉంది. క్రీడా మైదానంలో చురుకైన కదలికలతో సత్తా చాటిన మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ యూపీ ఫూల్పూర్ నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేస్తున్నాడు. మరో మాజీ క్రికెటర్, ఎంపీ అజహరుద్దీన్ ఈసారి రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తుండటం తెలిసిందే. జైసల్మేర్‌కు చెందిన ఒలింపిక్ షూటర్ రాజ్యవర్దన్‌సింగ్ రాథోడ్ జైపూర్ రూరల్ (బీజేపీ) నుంచి పోటీచేస్తున్నారు.