సాక్షి, హైదరాబాద్: ఫుట్‌బాల్ క్రీడలోకి కొత్తగా వచ్చిన లీగ్‌ల వల్ల ఆటకు ఆదరణ పెరగడమే కాకుండా, ప్రతిభావంతులు కూడా వెలుగులోకి వస్తున్నారని భారత మాజీ కెప్టెన్ భైచుంగ్ భూటియా వ్యాఖ్యానించాడు. ముఖ్యంగా ‘6 ఎ సైడ్’ టోర్నమెంట్‌లో ఈ ఆటలో కొత్త తరహా వినోదాన్ని అందిస్తున్నాయని అతను అన్నాడు. హైదరాబాద్ ఫుట్‌బాల్ లీగ్ (హెచ్‌ఎఫ్‌ఎల్)కు మెంటర్‌గా వ్యవహరిస్తున్న భూటియా గురువారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నాడు. హెచ్‌ఎఫ్‌ఎల్ టోర్నీలో పాల్గొంటున్న 12 జట్ల జెర్సీలను భూటియా ఆవిష్కరించాడు. ఈ లీగ్ నవంబర్ 26న ప్రారంభమై జనవరి 27 వరకు పది వారాల పాటు కొనసాగుతుంది.
‘సాధారణంగా 11 మంది ఉండే ఫుట్‌బాల్‌తో పోలిస్తే 6 ఎ సైడ్‌లో వినోదం పాలు ఎక్కువ. ఎక్కువ సేపు ఆటగాళ్లు బంతిని తమ నియంత్రణలో ఉంచుకొని విన్యాసాలు ప్రదర్శించవచ్చు. ముఖ్యంగా దక్షిణ అమెరికా దేశాల్లో దీనికి మంచి ఆదరణ ఉంది. మన దగ్గర కూడా ఈ సంస్కృతి పెరిగింది. గతంలో అనేక మంది దిగ్గజాలను అందించిన హైదరాబాద్‌లో హెచ్‌ఎఫ్‌ఎల్ నిర్వహణ వల్ల మరింత మంది ఆట వైపు ఆకర్షితులవుతారని నమ్ముతున్నా’ అని భూటియా అభిప్రాయ పడ్డాడు. మెంటర్ హోదాలో భూటియా నేరుగా ఆటగాళ్లు, వ్యూహాలకు సంబంధించి కాకుండా... తగిన మార్గనిర్దేశనం చేసేందుకు, లీగ్‌ను సమర్థంగా నిర్వహించేందుకు సహకరిస్తాడు. హెచ్‌ఎఫ్‌ఎల్‌లో విజేతగా నిలిచిన జట్టుకు రూ.3 లక్షల నగదు బహుమతి లభిస్తుంది. మీడియా సమావేశంలో హెచ్‌ఎఫ్‌ఎల్ ప్రతినిధులు మురాద్ జసాని, ఆదిల్ మిస్త్రీ, నవీద్ కేశ్వాని తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment