ఫుట్‌బాల్‌కు గుడ్ డేస్
హైదరాబాద్‌లో ఫుట్‌బాల్‌కు మళ్లీ మంచిరోజులు వస్తాయని భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ బైచుంగ్ భుటియా ఆశాభావం వ్యక్తం చేశారు. బంజారాహిల్స్‌లోని తాజ్ డెక్కన్‌లో సనోఫీ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటైన వరల్డ్ ఆర్థరైటిస్ అవగాహన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన భుటియా కొద్దిసేపు ‘సిటీప్లస్’తో ముచ్చటించాడు. అవి ఆయున మాటల్లోనే.. ‘హైదరాబాద్ నుంచి విక్టరీ అమల్‌రాజ్ వంటి మేటి ఫుట్‌బాల్ ఆటగాళ్లు భారత జట్టుతో పాటు వివిధ క్లబ్‌లకు ప్రాతినిధ్యం వహించారు. ఇండియన్ సూపర్‌లీగ్‌తో (ఐఎస్‌ఎల్) ఈ సిటీలోనూ ఫుట్‌బాల్‌కు మళ్లీ క్రేజ్ వస్తుంది.
హైదరాబాద్ అంటే నాకు చాలా అభిమానం. ఇక్కడి రుచులు నాకు చాలా నచ్చుతాయి.. కొద్దిరోజుల్లో ప్రారంభం కానున్న ఐఎస్‌ఎస్ లీగ్ ఫ్రాంచైజీల్లో క్రికెట్ స్టార్లు మహేంద్రసింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ, బాలీవుడ్ నటులు జాన్ అబ్రహాం, రణబీర్ కపూర్, సల్మాన్ ఖాన్ వంటి వారే భాగస్వాములుగా ఉండటం శుభపరిణామం. ఐపీఎల్ తరహాలోనే ఐఎస్‌ఎల్‌లోనూ మెరికల్లాంటి ప్లేయుర్స్ రాణించే అవకాశాలు ఉన్నాయి. క్రికెట్‌ను అమితంగా ఆరాధించే మనదేశంలో స్వయంగా క్రికెటర్లే ఫుట్‌బాల్ వైపు చూస్తున్నారంటే, యువత తప్పకుండా ఈ పరిణామంపై ఆలోచిస్తారు. అయితే, ఫుట్‌బాల్ ఆడే సమయంలో ఫిట్‌గా ఉండటం చాలా ముఖ్యం. గాయాల పట్ల అలసత్వం పనికిరాదు. నా కెరీర్‌లో ఇప్పటి వరకు ఆరుసార్లు మోకాలికి ఆపరేషన్లు జరిగాయి. నాలుగేళ్ల కిందట ఆర్థోపెడిక్స్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ సచిన్ యాదవ్ సలహాపై విస్కో సప్లిమెంటేషన్ తీసుకుంటుండటంతో ఇప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటున్నా’.
- వీఎస్