భూటియాపై వేటు
కోల్‌కతా: రెండేళ్లపాటు అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) సలహాదారుగా పనిచేసిన భారత మాజీ కెప్టెన్ బైచుంగ్ భూటియాను తప్పించారు. గత డిసెంబర్‌లోనే అతనితో ఒప్పందం గడువు పూర్తయిందని... మళ్లీ ఆ ఒప్పందాన్ని పునరుద్ధరించలేదని ఏఐఎఫ్‌ఎఫ్ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఏఐఎఫ్‌ఎఫ్ అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్‌కు సాంకేతిక సలహాదారుడిగా కూడా పనిచేసిన భూటియా... ఆ సమయంలో స్టీఫెన్ కాన్‌స్టాంటైన్ భారత జట్టుకు మళ్లీ కోచ్‌గా రావడంలో కీలకపాత్ర పోషించారు.
ఏఐఎఫ్‌ఎఫ్ ప్రముఖులతో అభిప్రాయబేధాలు రావడంతోనే భూటియా కాంట్రాక్ట్‌ను పొడిగించలేదని సమాచారం. భారత అండర్–17 కోచ్‌గా నికొలాయ్ ఆడమ్‌ను తప్పించాక... ఆయన స్థానంలో కామ్ టోయల్‌ను కోచ్‌గా తీసుకురావాలని భూటియా సూచించాడు. అయితే భూటియా సూచనలను పట్టించుకోకుండా ఏఐఎఫ్‌ఎఫ్ పోర్చుగల్‌కు చెందిన లూయిస్ నార్టన్ డి మాటోస్‌ను అండర్–17 జట్టుకు కోచ్‌గా నియమించింది.