బకుళాబెన్ పటేల్‌ను సూరత్‌లో అందరూ ‘డేరింగ్ దాదీ’ అని పిలుస్తారు. 80 ఏళ్ల వయసులో నదుల్లో, సముద్రంలో ఆమె చేపలా ఈదడమే కాదు ఈత పోటీల్లో వందల మెడల్స్ సాధించడమే కారణం. 57 ఏళ్ల వయసులో మొదలెట్టిన ఈత తనకు ఆరోగ్యాన్ని, ఉత్సాహాన్ని ఇస్తున్నాయని అంటోంది బకుళాబెన్. పెద్ద వయసు వారికి పెద్ద స్ఫూర్తి ఆమె.
సూరత్‌లోని తాపి నది ఒడ్డున ఏ ఉదయాన ఐదు, ఆరు గంటల మధ్యన వెళ్లినా డేరింగ్ దాది అని ఆ ఊళ్లో పిలుచుకునే బకుళా బెన్ కనిపిస్తుంది. 80 ఏళ్ల వయసులో ఆమె దినచర్య గమనించదగ్గది. తెల్లవారు జామున 4 గంటలకు లేస్తుంది. ఒక గంటసేపు ఇంట్లో తేలికపాటి యోగా చేస్తుంది. ఆ తర్వాత జాగింగ్‌కు వీలైన దుస్తుల్లోకి మారి సూరత్ దారుల గుండా కనీసం గంటసేపు జాగింగ్ చేస్తుంది. ఆ తర్వాత తాపి ఒడ్డున ఈత దుస్తుల్లోకి మారి నదిలోకి దూరి దాదాపు రెండు గంటల సేపు ఈత కొడుతుంది. ఆ తర్వాతే ఆమె ఇంటికి చేరుతుంది. ‘నేను రోజులో ఒక పూట భోజనం అయినా లేకుండా ఉంటాను కాని ఏ రోజూ ఈత కొట్టకుండా ఉండలేను’ అంటుంది బకుళా బెన్.
కొత్త జీవితం
బకుళా బెన్‌ది అందరు సగటు ఆడవాళ్ల జీవితం వంటిదే. పెళ్లి, పిల్లలు... ఆమెకు నలుగురు సంతానం. వారిని పెంచి పెద్ద చేయడంలో జీవితం గడిచిపో యింది. ఆమెకు 50 ఏళ్లు ఉండగా భర్త మరణించాడు. కొన్నాళ్లకు ఆమెకు జీవితం బోరు కొట్టింది. ‘ఏదో ఒకటి చేయాలి’ అని క్రీడల వైపు ఆసక్తి కనపరిచింది. ‘నాకు చిన్నప్పుడు నీళ్లంటే భయం. ఈత నేర్చుకోలేదు. కాని ఎన్నాళ్లు నీళ్లకు దూరంగా జరుగుతాను. ఈత నేర్చుకుందాం అనుకున్నాను.
ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు నా వయసు 58’ అని తెలిపింది బకుళా బెన్. కాని ఆమె ఈత నేర్చుకోవడం అంత సులువు కాలేదు. బంధువులు, ఇరుగు పొరుగు వారు ‘హవ్వ’ అని నోరు నొక్కుకున్నారు. హేళన చేస్తూ వెనుక మాట్లాడుకున్నారు. ‘అవన్నీ నా చెవిన పడుతున్నా ఈత నేర్చుకోవడం మానలేదు’ అంటుంది బకుళ. ఇలా నవ్విన వారే తాపీనదిలో చేపలా ఈదుతున్న బకుళను చూసి ఆశ్చర్యపో యారు. హేళన స్థానంలో గౌరవం వచ్చింది.
అన్నీ భిన్నమే
పిల్లలు సెటిల్ కావడం వల్ల దొరికిన తీరుబడిని బకుళ సంపూర్ణంగా జీవించదలుచుకుంది. ‘నేను నా 60వ ఏట బి.ఏ. కట్టాను. పాఠాలు చదవడం గుర్తు పెట్టుకోవడం కష్టమైంది. రోజుకు 10 గంటలు చదివేదాన్ని. అలాగే ఎప్పుడో వదిలేసిన రాత కూడా ప్రాక్టీసు చేసి పరీక్షలు రాసి డిగ్రీ ΄పొందాను. అలాగే యోగా నేర్చుకున్నాను. 80 ఏళ్ల వయసులో శీర్షాసనం వేయగలను. 75 ఏళ్ల వయసులో నాకు భరతనాట్యం నేర్చుకోవాలనిపించింది. మన దేశంలో ఆ వయసులో భరతనాట్యం చేసి అరంగేట్రం చేసింది నేనొక్కదాన్నే. ఆ ఆరంగేట్రం చూసి చాలామంది మెచ్చుకున్నారు’ అంటుంది బకుళ.
500 మెడల్స్
‘నన్ను చూసి అందరూ స్ఫూర్తి పొందాలని ఇన్ని పనులు చేస్తున్నాను. సమాజంలో మహిళల పట్ల వివక్ష ఉంది. ఆ వివక్షను ఎదిరించాలంటే ఇలాంటి కృషి చేయాలి. నేను జాతీయ అంతర్జాతీయ సీనియర్ సిటిజన్స్ ఈత పో టీల్లో ఇప్పటివరకు 500 మెడల్స్ గెలుచుకున్నాను. అట్లాంటిక్, పసిఫిక్, బంగాళాఖాతాల్లో ఈత కొట్టాను. అమెరికా, ఆస్ట్రేలియా, కెనెడా, మలేసియా దేశాల్లో ఈతపో టీల్లో పాల్గొన్నాను. ఇంగ్లిష్ చానల్ ఈది గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చేరాలని నా కోరిక. ఇప్పటికి 400 మందికి ఈత నేర్పాను. ఈతలో ఉన్న ఆరోగ్యం, ఆనందం అంతా ఇంతా కాదు’ అంటుంది బకుళా బెన్.
Comments
Please login to add a commentAdd a comment