పతకాల సంఖ్య పెంపు
గ్లాస్గో: వచ్చే ఏడాది జరిగే కామన్వెల్త్ గేమ్స్‌లో క్రీడల్ని కుదించినప్పటికీ కొన్ని క్రీడలకు పెద్దపీట వేశారు. ముఖ్యంగా సైక్లింగ్, స్విమ్మింగ్, పారా పోటీల్లో గణనీయంగా పతకాల ఈవెంట్లు పెంచారు. దీంతో వచ్చే ఏడాది గ్లాస్గో ఆతిథ్యమివ్వబోయే ఈ కామన్వెల్త్ మెగా ఈవెంట్‌లో 200కు పైగా బంగారు పతకాలు అథ్లెట్ల పరం కానున్నాయి. దాదాపు 60 ఏళ్ల తర్వాత మిక్స్‌డ్ 4–400 మీటర్ల రిలే విభాగాన్ని తిరిగి ఈ కామన్వెల్త్‌లో చేర్చారు.
చివరిసారిగా 1966లో మిక్స్‌డ్ రిలే విభాగం పోటీలు నిర్వహించాక తదనంతరం క్రీడల్లో ఆ ఈవెంట్‌కు మంగళం పాడారు. దీనిపై ప్రపంచ అథ్లెటిక్స్ అధ్యక్షుడు సెబాస్టియన్ కో హర్షం వ్యక్తం చేశారు. 1930 నుంచి 1966 వరకు కామన్వెల్త్‌లో అలరించిన మిక్స్‌డ్ రిలే ఈవెంట్ మళ్లీ ఆరు దశాబ్దాల తర్వాత గ్లాస్గోలో పతకాల కోసం పరుగుపెట్టబోతోంది’ అని అన్నారు.
పారా అథ్లెటిక్స్‌లోని 10 ఈవెంట్లలో ఏకంగా ఆరు క్రీడాంశాలకు గేమ్స్ ఆర్గనైజింగ్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రికార్డుస్థాయిలో 47 పతకాలు పారా అథ్లెట్లు అందుకోనున్నారు. సైక్లింగ్‌లో 26 పతకాల ఈవెంట్లు (పారా సైక్లింగ్ కలిపి), స్విమ్మింగ్, పారా స్విమ్మింగ్‌లలో 56 పతకాలు ఈతకొలనులో కొల్లగొట్టనున్నారు. ఈ సారి కొత్తంగా 800 మీటర్ల ఫ్రీస్టయిల్, 1500 మీటర్ల మహిళల ఫ్రీస్టయిల్ రేసుల్ని చేర్చారు.
2026లో జూలై 23 నుంచి ఆగస్టు 2 వరకు 11 రోజుల పాటు గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ జరుగనున్నాయి. పది క్రీడాంశాలు జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, పారా అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, వీల్‌చైర్ బాస్కెట్‌బాల్, బాక్సింగ్, స్విమ్మింగ్, పారా స్విమ్మింగ్ , బౌల్స్, పారా బౌల్స్ (ఇండోర్), జూడో, నెట్‌బాల్, ట్రాక్ సైక్లింగ్, పారా సైక్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్, పారా పవర్‌లిఫ్టింగ్‌లో పోటీలుంటాయి.
కామన్వెల్త్ ఎరెనా, సర్ క్రిస్ హో వెలొడ్రోమ్, స్కాటిష్ ఎగ్జిబిషన్ సెంటర్ (ఎస్‌ఈసీ), స్కాట్స్‌టౌన్ స్టేడియం, టోల్‌క్రాస్ ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ సెంటర్ వేదికల్లో పది రోజుల పాటు పోటీలు జరుగుతాయి. తొలి రోజు కేవలం ఆరంభ వేడుకలు నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment