మోకాళ్ల నొప్పులు ఉన్నవారు వ్యాయామం చేస్తే... వారి మోకాలి కీళ్లు మరింతగా అరిగిపోయి, నొప్పులు పెరుగుతాయేమోనని చాలమంది అపోహ పడుతుంటారు. మరీ ఎక్కువ భారం పడకుండా, మరీ ఎక్కువగా శారీరక శ్రమ లేని వ్యాయామంతో మోకాళ్ల నొప్పులను అదుపులో పెట్టవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈదే సమయంలో మోకాళ్లపైనే కాదు... అసలు శరీరంపై ఎలాంటి భారం పడదు. కాబట్టి ఈత అన్నింటికంటే మంచి వ్యాయామం. అంతేకాదు... మోకాళ్ళ నొప్పులతో, మరీ ముఖ్యంగా ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నవారు కాస్తంత ఎక్కువగా నడిస్తే మోకాలి కీళ్లు అరిగిపోతాయనే మరో అపోహా ఉంది. ఇది నిజం కాదు.
మోకాలి కీలు ప్రాంతంలో నేరుగా రక్తప్రసరణ జరగదు. అందుకే ఆ కీలు దగ్గర కదలికలు ఎంతగా ఉంటే అక్కడంత సమర్థంగా రక్తప్రసరణ ఉంటుంది. దాంతో కీళ్లకు పోషకాలు అందడమే కాక, కండరాలు, ఎముకలూ బలపడతాయి. కొంతమంది సైక్లింగ్ వల్ల మోకాళ్ల నొప్పులు మరింత పెరుగుతాయని అనుకుంటుంటారు. సైక్లింగ్‌లో దేహం బరువు మోకాళ్లపై పడదు. కాబట్టి అది కూడా మంచి వ్యాయామమే. ఇప్పుడిప్పుడే మధ్యవయసులోకి వస్తున్న/రాబోతున్నవారు మోకాళ్ల నొప్పులు రాకముందే వాకింగ్ చేయడం మేలు. అవి మోకాలికి శ్రమ కలిగించనంత మేరకే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఒకవేళ అప్పటికే మోకాళ్లనొప్పులు మొదలై ఉంటే స్విమ్మింగ్ మంచిది. సైక్లింగ్ కూడా చేయవచ్చు. అయితే ఇలాంటి వ్యాయామాలు మొదలుపెట్టే ముందర ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి ప్రారంభించడం వల్ల వారిలో ఉన్న అపోహలు తొలగడమే కాకుండా... వారి వారి వ్యక్తిగత ఆరోగ్యపరిస్థితి ని అనుసరించి డాక్టర్లు మరికొన్ని సూచనలూ ఇస్తారు. ఇది వాళ్లకు మరింత మేలు చేస్తుందని చెప్పడంలో సందేహమే లేదు.
Comments
Please login to add a commentAdd a comment