న్యూఢిల్లీ: భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు హెడ్ కోచ్ ఇగోర్ స్టిమాక్‌కు ఉద్వాసన పలికారు. 2026 ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో టీమిండియా మూడో రౌండ్‌కు అర్హత సాధించలేకపోవడంతో అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) స్టిమాక్ సేవలకు మంగళం పాడింది. క్రొయేషియాకు చెందిన ఈ మాజీ ఫుట్‌బాలర్‌ను 2019లో కోచ్‌గా నియమించారు. ఆయన శిక్షణలో భారత జట్టు నాలుగు మేజర్ ట్రోఫీలను సాధించింది.
ఇందులో రెండు ‘శాఫ్’ చాంపియన్‌షిప్ టైటిళ్లు కాగా, ఇంటర్‌కాంటినెంటల్ కప్, ముక్కోణపు సిరీస్ ఉన్నాయి. దీంతో గత అక్టోబర్‌లో ఆయనకు 2026 వరకు పొడిగింపు ఇచ్చారు. అయితే సునీల్ ఛెత్రి (ప్రస్తుతం రిటైరయ్యాడు) నేతృత్వంలోని భారత్ క్వాలిఫయర్స్‌లో ఎప్పటిలాగే రెండో రౌండ్‌ను దాటలేకపోయింది. దీంతో జట్టు ప్రదర్శన సరిగాలేని కారణంతో గడువుకు ముందే స్టిమాక్‌ను తొలగించారు. ఒప్పందం ప్రకారం ఇలా అర్ధంతరంగా సాగనంపితే స్టిమాక్‌కు 3,60,000 డాలర్లు (రూ. 3 కోట్లు) ఏఐఎఫ్‌ఎఫ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ మొత్తం చెల్లించేందుకు సమాఖ్య సిద్ధమైంది.
హెప్టాథ్లాన్‌లో శ్రీతేజకు కాంస్య పతకం
జాతీయ యూత్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారిణి థోలెం శ్రీతేజ కాంస్య పతకం సాధించింది. ఛత్తీస్‌గఢ్‌లో సోమవారం ముగిసిన ఈ టోర్నీలో శ్రీతేజ ఏడు క్రీడాంశాల (100 మీటర్ల హర్డిల్స్, హైజంప్, షాట్‌పుట్, 200 మీటర్లు, లాంగ్‌జంప్, జావెలిన్ త్రో, 1000 మీటర్లు) సమాహారమైన హెప్టాథ్లాన్‌లో మూడో స్థానంలో నిలిచింది.
శ్రీతేజ ఓవరాల్‌గా 4136 పాయింట్లు సాధించింది. రినీ ఖాతూన్ (పశి్చమ బెంగాల్; 4357 పాయింట్లు) స్వర్ణ పతకం సొంతం చేసుకుంది.
స్నేహిత్‌కు కాంస్యం
సాక్షి, హైదరాబాద్: బ్రిక్స్ గేమ్స్‌లో భారత టేబుల్ టెన్నిస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ ప్లేయర్ సూరావజ్జుల స్నేహిత్ కాంస్య పతకాన్ని సాధించాడు. రష్యాలోని కజాన్ పట్టణంలో జరుగుతున్న ఈ క్రీడల్లో స్నేహిత్ పురుషుల సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్లో ఓడిపోయాడు. కిరిల్ స్కచ్‌కోవ్ (రష్యా)తో జరిగిన సెమీఫైనల్లో స్నేహిత్ 9–11, 8–11, 6–11తో ఓటమి చవిచూశాడు.
Comments
Please login to add a commentAdd a comment