ఖరీదైన క్రీడ కాకపోవడం... ప్రావీణ్యం ఉంటే ఎక్కడైనా ఆర్థికంగా స్థిరపడే అవకాశాలు మెండుగా ఉండటం... ప్రపంచవ్యాప్తంగా ప్రొఫెషనల్ లీగ్‌లు జరుగుతుండటం... వెరసి ఫుట్‌బాల్ ఆడేవారి సంఖ్యలో పెరుగుదలే కానీ తరుగుదల కనిపించదు. అన్ని ఖండాలకు చెందిన జట్లు భాగస్వామ్యంగా నాలుగేళ్లకోసారి జరిగే ప్రతిష్టాత్మక ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఎనిమిది దేశాలు విశ్వవిజేతగా నిలిచాయి. ఇందులో ఐదు జట్లు (జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, ఇంగ్లండ్) యూరప్‌నకు చెందినవి కాగా మిగతా మూడు జట్లు (బ్రెజిల్, అర్జెంటీనా, ఉరుగ్వే) దక్షిణ అమెరికాకు చెందినవి.
అయితే ఆసియా, ఆఫ్రికా దేశాలు మాత్రం ఈ మెగా ఈవెంట్‌లో అడపాదడపా మెరిపిస్తున్నా నిలకడైన ప్రదర్శన ఇవ్వడంలో విఫలమవుతున్నాయి. 1938లో ఆసియా నుంచి ఇండోనేసియా తొలిసారి ప్రపంచకప్‌లో ఆడింది. ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధం కారణంగా 1942లో, 1946లో ప్రపంచపక్ జరగలేదు. 1950లో బ్రెజిల్‌లో ప్రపంచకప్ జరిగినా ఆసియా నుంచి ఒక్క దేశం కూడా పాల్గొనలేదు. 1954లో దక్షిణ కొరియా రూపంలో మళ్లీ ఆసియా నుంచి ప్రాతినిధ్యం మొదలైంది.
ఆ తర్వాత జరిగిన ఐదు ప్రపంచకప్‌లలో రెండుసార్లు మాత్రమే ఆసియా నుంచి జట్లు పాల్గొన్నాయి. 1978 నుంచి మాత్రం ప్రతి ప్రపంచకప్‌లో ఆసియా జట్లు బరిలోకి దిగుతున్నాయి. క్రమక్రమంగా ప్రపంచకప్‌లో పాల్గొనే జట్ల సంఖ్య పెరగడంతో ఆసియా జోన్ నుంచి మరిన్ని జట్లకు అవకాశం లభించింది.
ఇప్పటివరకు ఆసియా నుంచి 12 జట్లు ప్రపంచకప్‌లో ఒక్కసారైనా బరిలోకి దిగాయి. దక్షిణ కొరియా అత్యధికంగా 11 సార్లు ప్రపంచకప్‌లో పోటీపడింది. జపాన్ ఏడుసార్లు బరిలోకి దిగగా... ఆస్ట్రేలియా, ఇరాన్, సౌదీ అరేబియా ఆరుసార్లు చొప్పున ఈ మెగా ఈవెంట్‌లో పోటీపడ్డాయి.
1966లో ఉత్తర కొరియా క్వార్టర్ ఫైనల్ చేరగా... 2002లో జపాన్‌తో కలిసి ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇచ్చిన దక్షిణ కొరియా సెమీఫైనల్ చేరి ఈ ఘనత సాధించిన ఏకైక ఆసియా జట్టుగా నిలిచింది. అనంతరం నాలుగు ప్రపంచకప్‌లు జరిగినా మరో ఆసియా జట్టు సెమీఫైనల్ దశకు చేరుకోలేకపోయింది.
మరో పది రోజుల్లో ఖతర్‌లో ప్రారంభం కాబోతున్న ప్రపంచకప్‌లో ఆసియా నుంచి తొలిసారి అత్యధికంగా ఆరు జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఆతిథ్య ఖతర్ జట్టుకు నేరుగా ఎంట్రీ లభించగా... క్వాలిఫయింగ్ ద్వారా కొరియా, జపాన్, ఆస్ట్రేలియా, ఇరాన్, సౌదీ అరేబియా అర్హత పొందాయి. 20 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఈసారైనా మరో ఆసియా జట్టు సెమీఫైనల్ చేరుకుంటుందో లేదో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment