న్యూఢిల్లీ: మైదానంలో ఆటగాళ్లు గోల్ కోసం శ్రమిస్తుంటే... కేంద్ర మంత్రి స్థాయి వారు ఫుట్‌బాల్ సంఘంలో ఏళ్ల తరబడి తిష్టవేసి రాజకీయాలు చేశారు. ఇలా ఆటకు సంబంధంలేని వారే 85 ఏళ్ల పాటు అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్)ను ఏలారు. ఏనాడూ మాజీ కెప్టెన్ కానీ, దిగ్గజ ప్లేయర్ కానీ సమాఖ్యలో అధ్యక్ష స్థానంలో లేనే లేరు. దీంతో రాజకీయాలతో మసక బారిన ఏఐఎఫ్‌ఎఫ్ చివరకు మన ఫుట్‌బాల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ‘ఫిఫా’ నిషేధానికి గురైంది.
చివరకు రోజుల వ్యవధిలోనే సడలింపుతో ఊపిరి పోసుకున్న ఏఐఎఫ్‌ఎఫ్‌కు ఇప్పుడు కొత్త జవసత్వాలు మాజీ ఆటగాడి రూపంలో వచ్చాయి. భారత మాజీ గోల్ కీపర్ కల్యాణ్ చౌబే 85 ఏళ్ల ఏఐఎఫ్‌ఎఫ్ చరిత్రలో అధ్యక్షుడైన ఆటగాడిగా నిలిచారు. మాజీ కెప్టెన్, దిగ్గజం బైచుంగ్ భూటియా ఈ ఎన్నికలో ఓడినప్పటికీ మైదానంలోలాగే ఓ ఆటగాడి చేతిలోనే ఓడాడు. రాజకీయ నాయకుడి చేతిలో కాకపోవడం గొప్ప ఊరట. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో 46 ఏళ్ల కల్యాణ్ చౌబే అధ్యక్షుడిగా ఏకపక్ష విజయం సాధించారు.
ఆయన 33–1 ఓట్ల తేడాతో భూటియాను ఓడించారు. ఆశ్చర్యకరంగా మాజీ కెప్టెన్‌కు ఒక్క ఓటే రావడం విచిత్రం! భూటియా, ఐఎం విజయన్, లారెన్స్, హైదరాబాద్‌కు చెందిన భారత మాజీ కెప్టెన్ షబ్బీర్ అలీ ఆటగాళ్ల ప్రతినిధులుగా ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ) సభ్యులుగా వ్యవహరిస్తారు. మిగతా 14 మంది ఈసీ మెంబర్లంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందులో తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం జనరల్ సెక్రటరీ జీపీ ఫల్గుణతో పాటు అవిజీత్ పాల్, పి.అనిల్ కుమార్, వాలంక నటాష, మాలోజి రాజే ఛత్రపతి, మేన్ల ఎతెన్పా, మోహన్ లాల్, ఆరిఫ్ అలీ, కె.నీబౌ సెఖోస్, లాల్గింగ్లోవా, దీపక్ శర్మ, విజయ్ బాలి, ఇంతియాజ్ హుస్సేన్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన గోపాలకృష్ణ కొసరాజు కోశాధికారి పదవి కోసం పోటీపడి 1–32తో కిపా అజయ్ (అరుణాచల్ ప్రదేశ్) చేతిలో ఓడారు.
మంచి గోల్ కీపర్...
కల్యాణ్ చౌబే మాజీ గోల్ కీపర్, మంచి గోల్‌కీపర్ కూడా. 1996లో మోహన్ బగాన్ సీనియర్ క్లబ్ తరఫున అరంగేట్రం చేశారు. తదనంతరం ఈస్ట్ బెంగాల్, జేసీటీ, సాల్గావ్‌కర్ తదితర క్లబ్‌లకు 2003 ఏడాది వరకు ప్రాతినిధ్యం వహించారు. అంతకంటే ముందు జూనియర్ స్థాయిలో భారత అండర్–17, అండర్–20 జట్ల తరఫున ఆసియా యూత్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నారు. 1999–2000లో ప్రి–ఒలింపిక్ క్వాలిఫికేషన్‌లో భారత సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. దక్షిణాసి యా ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో భారత్ మూడుసార్లు విజేతగా నిలువడంలో గోల్‌కీపర్ గా చౌబే కీలకపాత్ర పోషించారు. ప్రత్యక్ష రాజకీయాల్లో 2019లో బీజేపీ తరఫున బెంగాల్‌లో ఎంపీ పదవికి పోటీ చేసి ఓడిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment