బ్లాటర్‌కే పట్టం
ఐదోసారి ఫిఫా అధ్యక్షుడిగా ఎన్నిక జోర్డాన్ ప్రిన్స్ హుస్సేన్‌కు నిరాశ
జ్యూరిచ్ : అవినీతి ఆరోపణలు చుట్టుముట్టినా... ఎన్నికలకు ఒక్కరోజు ముందు సహచరుల అరెస్టు జరిగినా... అమెరికా, ఇంగ్లండ్‌లతో పాటు యూరోపియన్ యూనియన్ బెదిరించినా... ఫుట్‌బాల్ ప్రపంచంలో సెప్ బ్లాటర్ ఆధిపత్యం చెక్కుచెదరలేదు. శుక్రవారం జరిగిన అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) అధ్యక్ష ఎన్నికల్లో బ్లాటర్... జోర్డాన్ ప్రిన్స్ బిన్ అల్ హుస్సేన్‌పై ఘన విజయం సాధించారు. నాటకీయ పరిణామాల మధ్య జరిగిన ఈ ఓటింగ్‌లో మొత్తం 209 మంది సభ్యులు పాల్గొన్నారు. తొలి రౌండ్‌లో 209కి గాను మూడు ఓట్లు చెల్లలేదు. మిగిలిన 206లో బ్లాటర్‌కు 133 ఓట్లు వచ్చాయి. హుస్సేన్‌కు 73 ఓట్లు మాత్రమే దక్కాయి.
ఫిఫా నిబంధనల ప్రకారం విజయం సాధించాలంటే మూడింట రెండొంతుల ఓట్లు (140) రావాలి. దీంతో రెండోరౌండ్ ఎన్నిక జరపాలని నిర్ణయించారు. రెండో రౌండ్‌లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్లే గెలిచినట్లు. అయితే రెండో రౌండ్ ఆరంభానికి ముందే జోర్డాన్ ప్రిన్స్ తన ఓటమిని అంగీకరించి పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో 79 ఏళ్ల బ్లాటర్ ఐదోసారి ఫిఫా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గత 17 సంవత్సరాలుగా ఆయనే ఈ పదవిలో ఉన్నారు.
ఈ ఎన్నిక వల్ల మరో నాలుగేళ్లు ఆయన కొనసాగుతారు. ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని మెజారిటీ దేశాలు బ్లాటర్‌కు అండగా నిలవడం ఆయనకు కలిసొచ్చింది. అంతకుముందు ఓటింగ్ జరుగుతున్న హాల్‌లో బాంబు ఉందనే ఫోన్‌కాల్‌తో కాసేపు గందరగోళం నెలకొంది. పోలీసులు, ఫిఫా భద్రతాధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత బాంబు లేదని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇటీ వల జరిగిన పరిణామాలతో ఫిఫా ప్రతిష్ట కొంత దెబ్బతిన్నదని, రాబోయే నాలుగేళ్లలో అంతా సరిదిద్దుతానని బ్లాటర్ వ్యాఖ్యానించారు.