South Asian Football Confederation
-
భారత మహిళల జట్టు శుభారంభం
కట్మాండు: దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (శాఫ్) మహిళల చాంపియన్‌షిప్‌లో భారత్ భారీ విజయంతో శుభారంభం చేసింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా గురువారం ఇక్కడి దశరథ్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత జట్టు 5–2 గోల్స్ తేడాతో పాకిస్తాన్‌పై ఘనవిజయం సాధించింది. సగం మ్యాచ్ ముగిసేసరికే దాయాది జట్టుపై 4–1తో పూర్తిస్థాయి ఆధిపత్యం కనబరిచింది. తద్వారా కెప్టెన్ ఆశాలతా దేవి అంతర్జాతీయ కెరీర్లో 100వ మ్యాచ్‌ను చిరస్మరణీయం చేసుకుంది. ఐదో నిమిషంలోనే భారత్ ఖాతా తెరిచింది. భారత్ తరఫున గ్రేస్ డాంగ్మెయి (5వ, 42వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... మనీషా (17వ ని.లో), బాలాదేవి (35వ ని.లో), జ్యోతి చౌహాన్ (78వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. ఈ మ్యాచ్ ద్వారా బాలాదేవి 50 గోల్స్ మైలురాయిని అందుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారత ఫుట్‌బాలర్‌గా ఆమె గుర్తింపు పొందింది. పాక్ తరఫున సుహ హిరాణి (45+2వ ని.లో), మేరీ సిద్దిఖీ (47వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. -
భారత్ టైటిల్ నిలబెట్టుకునేనా?
బెంగళూరు: దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (శాఫ్) టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ తొమ్మిదోసారి టైటిల్ సాధించాలనే లక్ష్యంతో నేడు జరిగే ఫైనల్లో పటిష్టమైన కువైట్‌తో ఆడనుంది. ఈ టోర్నమెంట్లో భారత్, కువైట్‌లు తలపడటం ఇది రెండోసారి. లీగ్ దశలో హోరాహోరీగా జరిగిన మ్యాచ్ 1–1తో ‘డ్రా’గా ముగిసింది. లెబనాన్‌తో జరిగిన సెమీఫైనల్లో భారత్ చక్కని ప్రదర్శనతో పెనాల్టీ షూటౌట్లో గెలిచింది. మరోవైపు బంగ్లాదేశ్‌తో జరిగిన మరో సెమీస్‌లో కువైట్ 1–0తో విజయం సాధించింది. కువైట్, లెబనాన్ పశ్చిమ ఆసియా దేశాలైనప్పటికీ పోటీతత్వం ఉండాలనే ఉద్దేశంతో నిర్వాహకులు ఈ రెండు దేశాలకు ప్రత్యేకంగా ఆహ్వానించాయి. కంఠీరవ స్టేడియంలో ప్రేక్షకుల మద్దతుతో భారత్ నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. సొంతగడ్డపై జరుగుతుండటం భారత్‌కు అనుకూలాంశమైతే... హెడ్ కోచ్ ఇగోర్ స్టిమాక్ ఈ ఫైనల్‌కు కూడా జట్టుకు అందుబాటులో ఉండటం లేదు. పాకిస్తాన్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో మైదానంలోకి వెళ్లి ప్రత్యర్థి ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగడంతో ‘రెడ్ కార్డ్’తో ఓ మ్యాచ్ సస్పెన్షన్‌కు గురయ్యారు. దీంతో లెబనాన్ తో కీలకమైన సెమీస్ మ్యాచ్‌కు దూరమయ్యారు. అయితే టోర్నీ క్రమశిక్షణ కమిటీ అతనికి రెండు మ్యాచ్‌ల సస్పెన్షన్ విధించడంతో.... కువైట్‌తో అమీతుమీకి కూడా గైర్హాజరు కానున్నారు. 1: ఇప్పటి వరకు భారత్, కువైట్ జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. భారత్ ఒక మ్యాచ్‌లో గెలిచింది. ఒక మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. .ట్రోఫీతో భారత జట్టు డిఫెండర్ సందేశ్ జింగాన్, కువైట్ జట్టు గోల్‌కీపర్ బదర్ బిన్ సానూన్ -
భారత్‌దే ‘శాఫ్’ ఫుట్‌బాల్ టైటిల్
మాలీ: దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (శాఫ్) చాంపియన్‌షిప్‌లో భారత జట్టు ఎనిమిదోసారి విజేతగా నిలిచింది. నేపాల్ జట్టుతో శనివారం జరిగిన ఫైనల్లో సునీల్ ఛెత్రి నాయకత్వంలోని భారత్ 3–0 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున సునీల్ ఛెత్రి (49వ ని.లో), సురేశ్ సింగ్ (50వ ని.లో), అబ్దుల్ సమద్ (90వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ఈ మ్యాచ్‌లో చేసిన గోల్‌తో సునీల్ ఛెత్రి ప్రస్తుతం అంతర్జాతీయ ఫుట్‌బాల్ ఆడుతున్న వారిలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో లయెనెల్ మెస్సీ (అర్జెంటీనా–80 గోల్స్)తో కలిసి సంయుక్తంగా రెండో స్థానానికి చేరాడు. క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్–115 గోల్స్) టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు. -
మన అమ్మాయిలదే ‘దక్షిణాసియా’
నాలుగోసారి ‘శాఫ్’ ఫుట్‌బాల్ టైటిల్ నెగ్గిన భారత్ సిలిగురి: ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన భారత అమ్మాయిలు నాలుగోసారి దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (శాఫ్) టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. బంగ్లాదేశ్‌తో బుధవారం జరిగిన ఫైనల్లో భారత్ 3–1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. 12వ నిమిషంలో దాంగ్మీ గ్రేస్ చేసిన గోల్‌తో భారత్ ఖాతా తెరిచింది. అయితే 40వ నిమిషంలో సిరాత్ జహాన్ గోల్‌తో బంగ్లాదేశ్ స్కోరును 1–1తో సమం చేసింది. రెండో అర్ధభాగంలో భారత అమ్మాయిలు జోరు పెంచారు. 60వ నిమిషంలో సస్మితా మలిక్ గోల్‌తో టీమిండియా 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. 67వ నిమిషంలో ఇందుమతి గోల్‌తో భారత్ 3–1తో ముందంజ వేసి విజయాన్ని ఖాయం చేసుకుంది. భారత్ 2010, 2012, 2014లలో కూడా ఈ టోర్నీలో విజేతగా నిలిచింది. మొత్తానికి ఈ టోర్నీ చరిత్రలో భారత్ అజేయంగా నిలిచింది. 18 మ్యాచ్‌ల్లో గెలిచి, మరో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. -
‘శాఫ్’ ఫుట్‌బాల్ టోర్నీ ఫైనల్లో భారత్
సిలిగురి: దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఎస్ఏఎఫ్ఎఫ్) మహిళల టోర్నమెంట్లో భారత జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. కంచన్‌జంగ స్టేడియంలో సోమవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 3–1 గోల్స్ తేడాతో నేపాల్‌ను కంగుతినిపించింది. కమలా దేవి (45వ నిమిషంలో) చేసిన గోల్‌తో భారత్ తొలి అర్ధభాగంలో 1–0తో ఆధిక్యంలో నిలిచింది. అనంతరం ద్వితీయార్ధంలో భారత క్రీడాకారిణిలు మరింత రెచ్చిపోయారు. ఇందుమతి (58వ ని.లో), సస్మిత మలిక్ (83వ ని.లో) చెరో గోల్ చేసి భారత్‌కు తిరుగులేని ఆధిక్యాన్ని కట్టబెట్టారు. నేపాల్ తరఫున నమోదైన ఏకైక గోల్‌ను సబిత్రా భండారి (75వ ని.లో) సాధించింది. ఈనెల 4న జరిగే ఫైనల్లో బంగ్లాదేశ్‌తో భారత్ తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో బంగ్లాదేశ్ 6–0తో మాల్దీవులుపై గెలిచింది. -
భారత్ ప్రతీకార పోరు
నేడు అఫ్ఘానిస్తాన్‌తో ఫైనల్ * శాఫ్ కప్ ఫుట్‌బాల్ టోర్నీ * సాయంత్రం గం. 6.25 నుంచి స్టార్ స్పోర్ట్స్-4లో ప్రత్యక్ష ప్రసారం తిరువనంతపురం: దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (శాఫ్) టోర్నమెంట్ తుది పోరులో నేడు (ఆదివారం) భారత జట్టు అఫ్ఘానిస్తాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఓటమి లేకుండా కొనసాగుతున్న తమ జోరును తుది పోరులోనూ సాగించాలనే ఆలోచనలో భారత్ ఉంది. అయితే అఫ్ఘాన్ రూపంలో భారత్ ఈ మ్యాచ్‌లో గట్టి పోటీనే ఎదుర్కోబోతోంది. నేపాల్‌లో జరిగిన చివరి(2013) ఎడిషన్‌లో తమను ఓడించి చాంపియన్‌గా అవతరించిన అఫ్ఘాన్‌పై బదులు తీర్చుకునేందుకు ఆటగాళ్లు ఎదురుచూస్తున్నారు. మరోవైపు ప్రపంచకప్ ఫుట్‌బాల్ క్వాలిఫయింగ్ పోటీల్లో తీవ్రంగా నిరుత్సాహపరిచిన సునీల్ చెత్రి సేన ఈ విజయంతో అభిమానులను ఊరట పరచాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆరుసార్లు విజేతగా నిలిచిన భారత జట్టును ఆసియాలో రోజురోజుకూ పుంజుకుంటున్న అఫ్ఘాన్ జట్టు ఏమేరకు నిలువరిస్తుందో వేచి చూడాలి. స్వదేశంలో జరిగిన 2011 టోర్నీ ఫైనల్లో భారత్ 4-0తో అఫ్ఘాన్‌ను చిత్తు చేసింది. ఇందులో సునీల్ చెత్రి హ్యాట్రిక్‌తో రెచ్చిపోయాడు. అయితే రెండేళ్ల అనంతరం ఖాట్మండూలో జరిగిన శాఫ్ కప్ ఫైనల్లో అఫ్ఘాన్ జట్టు 2-0తో బదులు తీర్చుకుంది. అప్పటి జట్టులో ఉన్న ఆటగాళ్లలో చెత్రి, జేజే, రాబిన్ సింగ్, అర్నాబ్, సుబ్రతా పాల్ మాత్రమే ఇప్పుడున్నారు. చెత్రి, జేజే ఫామ్‌తో పాటు 18 ఏళ్ల చాంగ్టే ప్రదర్శన లాభిస్తోంది. మిడ్ ఫీల్డ్‌లో రౌలిన్ బోర్గెస్, లింగ్డో కీలకంగా ఉన్నారు. ఇదిలావుండగా అఫ్ఘాన్ జట్టును భారత్ తేలిగ్గా తీసుకుంటే మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. కోచ్ స్టీఫెన్ కాన్స్టాంటైన్ ఇప్పటికే ఆ జట్టును ఫేవరెట్‌గా పరిగణిస్తున్నారు. ఎందుకంటే ఆ జట్టులోని 15 మంది ఆటగాళ్లలో చాలా మంది యూరప్‌లో ఆడినవారే. ఆసియా, యూరప్ ఆటగాళ్ల మధ్య చాలా తేడా ఉంటుందని, ఇది ఫలితంపై ప్రభావం చూపిస్తుందని కోచ్ భావిస్తున్నారు.