మన అమ్మాయిలదే ‘దక్షిణాసియా’
నాలుగోసారి ‘శాఫ్’ ఫుట్‌బాల్ టైటిల్ నెగ్గిన భారత్
సిలిగురి: ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన భారత అమ్మాయిలు నాలుగోసారి దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (శాఫ్) టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. బంగ్లాదేశ్‌తో బుధవారం జరిగిన ఫైనల్లో భారత్ 3–1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. 12వ నిమిషంలో దాంగ్మీ గ్రేస్ చేసిన గోల్‌తో భారత్ ఖాతా తెరిచింది. అయితే 40వ నిమిషంలో సిరాత్ జహాన్ గోల్‌తో బంగ్లాదేశ్ స్కోరును 1–1తో సమం చేసింది. రెండో అర్ధభాగంలో భారత అమ్మాయిలు జోరు పెంచారు.
60వ నిమిషంలో సస్మితా మలిక్ గోల్‌తో టీమిండియా 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. 67వ నిమిషంలో ఇందుమతి గోల్‌తో భారత్ 3–1తో ముందంజ వేసి విజయాన్ని ఖాయం చేసుకుంది. భారత్ 2010, 2012, 2014లలో కూడా ఈ టోర్నీలో విజేతగా నిలిచింది. మొత్తానికి ఈ టోర్నీ చరిత్రలో భారత్ అజేయంగా నిలిచింది. 18 మ్యాచ్‌ల్లో గెలిచి, మరో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది.