9 నిమిషాల్లో...ఆధిక్యంనుంచి ఓటమికి... | India Lose to Oman Despite Taking Early Lead | Sakshi
Sakshi News home page

9 నిమిషాల్లో...ఆధిక్యంనుంచి ఓటమికి...

Published Fri, Sep 6 2019 2:10 AM | Last Updated on Fri, Sep 6 2019 2:10 AM

India Lose to Oman Despite Taking Early Lead - Sakshi

సునీల్‌ ఛెత్రీ

గువాహటి: చివరి నిమిషాల్లో అలసత్వం ప్రదర్శించిన భారత డిఫెండర్లు భారత్‌కు అద్భుత విజయాన్ని దూరం చేశారు. 81వ నిమిషం వరకు 1–0తో ఆధిక్యంలో ఉన్న భారత్‌ చివరి 9 నిమిషాల్లో ప్రత్యర్థి ముందు తలవంచింది. దీంతో ఇక్కడి ఇందిరా గాంధీ అథ్లెటిక్‌ స్టేడియంలో గురువారం జరిగిన ‘ఫిఫా’ వరల్డ్‌ కప్‌–2022 రెండో అంచె అర్హత మ్యాచ్‌లో భారత్‌ 1–2తో ఒమన్‌ చేతిలో ఓడింది. ఒమన్‌ మిడ్‌ఫీల్డర్‌ రబియా అల్వై అల్‌ మందర్‌ రెండు గోల్స్‌ (82, 90వ నిమిషాల్లో) చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. భారత్‌ తరఫున సారథి సునీల్‌ ఛెత్రీ 24వ నిమిషంలో గోల్‌ చేశాడు.

ఆరంభంలో మెరిశారు... చివర్లోతలవంచారు
ర్యాంకింగ్స్‌లో తన కంటే మెరుగైన దేశంతో ఆడుతున్నా భారత్‌ అది ఎక్కడా కనిపించకుండా ఆడింది. మొదటి నిమిషం నుంచే బంతిపై పూర్తి నియంత్రణతో... ప్రత్యర్థికి బంతిని చిక్కనివ్వకుండా కళాత్మక పాస్‌లతో అదరగొట్టింది. 15వ నిమిషంలో గోల్‌ చేసే అవకాశాన్ని భారత ఆటగాడు ఉదంత సింగ్‌ జారవిడిచాడు. సునీల్‌ ఛెత్రీ అందించిన పాస్‌ను అందుకున్న అతను ప్రత్యర్థి రక్షణశ్రేణిని, కీపర్‌ను బోల్తా కొట్టిస్తూ బంతిని గోల్‌పోస్టులోకి కొట్టాడు. కానీ అది గోల్‌పోస్టు బార్‌ను తగిలి దూరంగా పడటంతో భారత్‌ ఖాతా తెరవలేదు.

అయితే 24వ నిమిషంలో ఫ్రీ కిక్‌ ద్వారా బ్రెండన్‌ ఫెర్నాండెజ్‌ అందించిన పాస్‌ను అందుకున్న ఛెత్రీ ఎటువంటి పొరపాటు చేయకుండా ప్రత్యర్థి గోల్‌ పోస్టులోకి పంపి భారత్‌కు 1–0 ఆధిక్యాన్ని అందించాడు. దీంతో 22 వేల మంది ప్రేక్షకుల హర్షధ్వానాలతో స్టేడియం మార్మోగింది. అనంతరం దూకుడు పెంచిన ఒమన్‌ భారత గోల్‌ పోస్టుపైకి పదేపదే దాడులు చేసింది. 43వ నిమిషంలో ఒమన్‌ ఆటగాడు అహ్మద్‌ కనో కొట్టిన హెడర్‌ను భారత గోల్‌ కీపర్‌ అద్భుతంగా అడ్డుకున్నాడు. రెండో అర్ధభాగం చివర్లో భారత ఢిపెండర్ల నిర్లక్ష్యాన్ని సొమ్ము చేసుకున్న ఒమన్‌ మిడ్‌ఫీల్డర్‌ రబియా అల్వై అల్‌ మందర్‌ 82వ నిమిషంలో గోల్‌ చేసి స్కోర్‌ను సమం చేశాడు. మరో 7 నిమిషాల అనంతరం రబియా భారత గోల్‌ కీపర్‌కు దొరక్కుండా కళ్లు చెదిరే షాట్‌తో బంతిని గోల్‌ పోస్టులోకి పంపి ఒమన్‌కు విజయాన్ని ఖరారు చేశాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement