ఏఎఫ్‌సీ ఆసియాకప్ క్వాలిఫయింగ్‌లో భాగంగా భారత్, అఫ్గానిస్తాన్ మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్ యుద్ద వాతావరణాన్ని తలపించింది. మ్యాచ్ ముగిసిన అనంతరం ఇరుజట్ల ఆటగాళ్లు ఒకరినొకరు తోసుకుంటూ.. తిట్టుకుంటూ కొట్టుకునే స్థాయికి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
విషయంలోకి వెళితే.. కోల్‌కతాలోని వీఐబీకే స్టేడియంలో శనివారం రాత్రి భారత్, అఫ్గానిస్తాన్‌ల మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్ జరిగింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో సునీల్ చెత్రీ సేన(టీమిండియా) 2-1 తేడాతో అఫ్గానిస్తాన్‌పై విజయం సాధించింది. ఆఖరి వరకు డ్రా దిశగా సాగిన ఈ మ్యాచ్‌లో 85వ నిమిషంలో భారత్‌కు వచ్చిన ఫ్రీకిక్ గోల్ అవకాశాన్ని సునీల్ చెత్రీ చక్కగా ఉపయోగించుకున్నాడు.
తన మ్యాజిక్‌తో మ్యాచ్‌లో భారత్ తొలి గోల్ చేసి 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే అఫ్గన్స్ కూడా ధీటుగా బదులిచ్చారు. ఆట 88వ నిమిషంలో అఫ్గన్ మిడ్ ఫీల్డర్ జుబైర్ అమిరి హెడర్ గోల్ చేశాడు. దీంతో నిర్ణీత సమయం ముగిసేసరికి ఇరుజట్లు 1-1తో ఉన్నాయి. అదనపు సమయంలో భారత్ స్ట్రైకర్ సాహల్ అబ్దుల్ సమద్ సూపర్ గోల్ కొట్టడంతో భారత్ 2-1తో ఆధిక్యంలో వెళ్లడంతో పాటు మ్యాచ్‌ను కూడా కైవసం చేసుకుంది.
ఇంతవరకు బాగానే ఉన్నప్పటికి అసలు కథ ఇక్కడే మొదలైంది. ఓడిపోయామన్న బాధను అఫ్గన్ ఆటగాళ్లు జీర్ణించుకోలేకపోయారు. పెవిలియన్ వెళ్తున్న ఇద్దరు భారత ఆటగాళ్ల వైపు దూసుకొచ్చిన అఫ్గన్ ఆటగాళ్లు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. చీటింగ్ చేసి మ్యాచ్ గెలిచారంటూ అసహనం వ్యక్తం చేశారు. దీనికి భారత్ ఆటగాళ్లు కూడా కౌంటర్ ఇవ్వడంతో ఒకరినొకరు తోసుకున్నారు.
ఇంతలో అక్కడికి వచ్చిన భారత్ గోల్‌కీపర్ గుర్‌ప్రీత్ సింగ్ సర్ది చెప్పాలని చూడగా అతన్ని కూడా తోసేశారు. ఇలా చూస్తుండగానే పెద్దదిగా మారిన గొడవ పతాక స్థాయికి చేరుకుంది. ఇరుజట్ల ఆటగాళ్లు ఒకరిని ఒకరు తోసుకుంటూ కొట్టుకున్నంత పని చేశారు. ఈ క్రమంలో ఇదంతా గమనించిన ఆసియన్ ఫుట్‌బాల్ కాన్ఫిడరేషన్(ఏఎఫ్‌సీ) అధికారులు గ్రౌండ్‌లోకి పరిగెత్తుకొచ్చి ఆటగాళ్లను విడదీసి అక్కడి నుంచి పంపించేశారు. అయితే ఏఎఫ్‌సీ గొడవకు కారణమేంటి.. ఇందులో తప్పెవరిది.. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం కొసమెరుపు.
చదవండి: Cristiano Ronaldo: రొనాల్డోపై అత్యాచారం కేసు.. కోర్టు కీలక తీర్పు
ఓవైపు భారత్, సౌతాఫ్రికా మ్యాచ్.. స్టేడియంలో కొట్టుకు చచ్చిన అభిమానులు
Comments
Please login to add a commentAdd a comment