ఆస్ట్రేలియాపై చారిత్రక విజయం.. ఆఫ్ఘన్ల సంబురాలు మామూలుగా లేవుగా..! | T20 World Cup 2024: Afghanistan Celebrations After Historic Win Over Australia Goes Viral | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియాపై చారిత్రక విజయం.. ఆఫ్ఘన్ల సంబురాలు మామూలుగా లేవుగా..!

Published Sun, Jun 23 2024 3:57 PM | Last Updated on Sun, Jun 23 2024 4:04 PM

T20 World Cup 2024: Afghanistan Celebrations After Historic Win Over Australia Goes Viral

అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే పెద్దగా జట్టుగా పేరు తెచ్చుకుంటున్న ఆప్ఘనిస్తాన్‌.. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌ 2024లో సంచలన విజయాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. గ్రూప్‌ దశలో న్యూజిలాండ్‌ లాంటి పటిష్ట జట్టుకు షాకిచ్చిన ఆఫ్ఘన్లు.. సూపర్‌-8 సమరంలో మాజీ జగజ్జేత ఆస్ట్రేలియాకు జీర్ణించుకోలేని ఓటమిని రుచి చూపించింది. 

సూపర్‌-8 గ్రూప్‌-1లో భాగంగా ఇవాళ (జూన్‌ 23) జరిగిన మ్యాచ్‌లో అండర్‌ డాగ్‌ ఆఫ్ఘనిస్తాన్‌.. పటిష్టమైన ఆస్ట్రేలియాను 21 పరుగుల తేడాతో ఓడించి పెను సంచనలం సృష్టించింది. ఈ విజయం అనంతరం ఆఫ్ఘన్‌ ప్లేయర్లు, ఆ జట్టు అభిమానుల సంబురాలు అంతా ఇంతా కాదు. వారి విజయోత్సవాలు మాటల్లో వర్ణించలేని విధంగా ఉన్నాయి. బహుశా వారు స్వాతంత్ర్యం పొందినప్పుడు కూడా ఇంతలా సంబురాలు చేసుకుని ఉండరు. 

ఆసీస్‌పై చారిత్రక విజయం అనంతరం ఆఫ్ఘన్‌ హీరో గుల్బదిన్‌ నైబ్‌ను సహచర ఆటగాళ్లు భుజాలపై ఎత్తుకుని డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి మోసుకెళ్లి సంబురాలు చేసుకోగా.. ఆఫ్ఘన్‌ వీధుల్లో ఆ దేశ పౌరుల సంబురాలు అంబరాన్నంటాయి. ఆ దేశ రాజధాని కాబుల్‌ వీధుల్లో జనాలు రోడ్లపైకి వచ్చి టపాసులు కాలుస్తూ.. కేరింతలు కొడుతూ సంబురాలు చేసుకున్నారు. 

ఈ సంబురాలు ఒక్క కాబుల్‌కే పరిమితం కాలేదు. ఆఫ్ఘనిస్తాన్‌ మొత్తం ఈ విజయాన్ని పండుగలా సెలబ్రేట్‌ చేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్‌ చరిత్రలోనే బహుశా ఇంతమంది జనాలు బయటికి వచ్చి సమూహిక సంబురాలు చేసుకుని ఉండరు. గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో ఆసీస్‌ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్నామని ఆఫ్ఘన్లు సంబరపడిపోతున్నారు. మొత్తానికి ఆఫ్ఘనిస్తాన్‌ క్రికెట్‌ చరిత్రలో ఇది చిరస్మరణీ విజయంగా మిగిలిపోనుంది.

రాణించిన గుర్బాజ్‌, జద్రాన్‌.. వరుసగా రెండో మ్యాచ్‌లో కమిన్స్‌ హ్యాట్రిక్‌
కింగ్స్‌టౌన్‌లోని ఆర్నోస్‌ వేల్‌ మైదానం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘన్లు.. ఓపెనర్లు గుర్భాజ్‌ (60), ఇబ్రహీం జద్రాన్‌ (51) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఆసీస్‌ బౌలర్లలో పాట్‌ కమిన్స్‌ 3, జంపా 2, స్టోయినిస్‌ ఓ వికెట్‌ పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో కమిన్స్‌ హ్యాట్రిక్‌ వికెట్లతో చెలరేగాడు. అతనికి ఇది వరుసగా రెండో హ్యాట్రిక్‌. పొట్టి క్రికెట్‌ చరిత్రలో ఇప్పటివరకు ఏ బౌలర్‌ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హ్యాట్రిక్‌ వికెట్లు సాధించలేదు.

రెచ్చిపోయిన ఆఫ్ఘన్‌ బౌలర్లు.. ఆసీస్‌కు ఘోర పరాభవం
149 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో​కి దిగిన ఆసీస్‌.. ఆఫ్ఘన్‌ బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో 19.2 ఓరవ్లలో 127 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆఫ్ఘన్‌ బౌలర్లలో గుల్బదిన్‌ నైబ్‌ (4-0-24-4) ఆసీస్‌ను దారుణంగా దెబ్బకొట్టగా.. నవీస్‌ ఉల్‌ హక్‌ 3, ఒమర్‌జాయ్‌, నబీ, రషీద్‌ ఖాన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో మ్యాక్స్‌వెల్‌ (59) ఒంటిరి పోరాటం​ చేయగా.. మరో ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోర్లు (మార్ష్‌ (12), స్టోయినిస్‌ (11)) చేశారు. ఆసీస్‌ బ్యాటర్ల ఈ దుస్థితిని క్రికెట్‌ అభిమానులు ఇప్పటివరకు చూసి ఉండరు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement