![Naveen Ul Haq Post Goes Viral Afghanistan Historic Win Over Australia](/styles/webp/s3/article_images/2024/06/24/naveen2.jpg.webp?itok=aKRFik2f)
టీ20 ప్రపంచకప్-2024లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో సమష్టి ఆటతీరుతో అఫ్గానిస్తాన్ తమ క్రికెట్ చరిత్రలోనే చిరస్మరణీయ విజయం అందుకుంది. ప్రపంచ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్‌లలో (టెస్టు, వన్డే, టి20) విశ్వవిజేతగా నిలిచిన ఆస్ట్రేలియాను అఫ్గానిస్తాన్ తొలిసారి ఓడించింది.
గతంలో ఆస్ట్రేలియాతో ఆడిన నాలుగు వన్డేలలో, ఒక టి20 మ్యాచ్‌లో ఓడిపోయిన అఫ్గానిస్తాన్ ఆరో ప్రయత్నంలో మాత్రం క్రికెట్ అభిమానులందరూ అబ్బురపడే ఫలితాన్ని సాధించింది.
ప్రపంచవ్యాప్తంగా జరిగే టి20 ఫ్రాంచైజీ లీగ్‌లలో ఆడుతున్న అఫ్గాన్ క్రికెటర్లు ఆ అనుభవాన్నంతా రంగరించి పోరాడటంతో ఆస్ట్రేలియా తొలిసారి అఫ్గానిస్తాన్ ముందు తలవంచక తప్పలేదు.
అగ్రశ్రేణి జట్లపై గెలిచే సత్తా
తద్వారా.. ప్రపంచ క్రికెట్‌లో ఇక నుంచి తమను చిన్న జట్టుగా ఎవరూ పరిగణించకూడదని అఫ్గానిస్తాన్ చాటి చెప్పింది. అగ్రశ్రేణి జట్లపై గెలిచే సత్తా తమలోనూ ఉందని... క్రమం తప్పకుండా తమతో మేటి జట్లు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడితే మరింత రాటుదేలుతామని అఫ్గానిస్తాన్ క్రికెటర్లు నిరూపించారు.
ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్ జట్టుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. సూపర్‌గా ఆడారంటూ అభిమానులతో పాటు పలువురు మాజీ క్రికెటర్లు కూడా అభినందిస్తున్నారు. అంతేకాదు అఫ్గన్‌లోనూ అంబరాన్నంటేలా సంబరాలు చేసుకున్నారు.
ఇప్పుడు ఆహా ఓహో అంటూ
ఈ క్రమంలో అఫ్గనిస్తాన్ పేసర్ నవీన్ ఉల్ హక్ ఇన్‌స్టాలో షేర్ చేసిన పోస్టు వైరల్‌గా మారింది. క్లిష్ట సమయాల్లో తమకు అండగా రాని వాళ్లు సైతం.. ఇప్పుడు ఆహా ఓహో అంటూ ప్రశంసిస్తున్నారంటూ ఫొటో ద్వారా ఘాటుగా సెటైర్ వేశాడు నవీన్.
తమను విమర్శించే వాళ్లే ఇప్పుడు ఈ విజయం కారణంగా ఆకాశానికెత్తుతున్నారంటూ చురకలు అంటించాడు. స్టేడియంలో ఒకే ఒక్క వ్యక్తి ఉన్న ఫోటోకు సపోర్టు అని.. గుంపుగా స్టేడియమంతా నిండిన అభిమానులున్న ఫొటోకు కంగ్రాట్స్ అని రాసి ఉన్న దృశ్యాలు షేర్ చేశాడు.
ఎలాంటి పరిస్థితుల్లోనైనా మేము నీతోనే
ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్ స్పందించింది. నవీన్ పోస్టుకు బదులిస్తూ.. ‘‘ఎలాంటి పరిస్థితుల్లోనైనా మేము నీతోనే’’ అంటూ మద్దతు తెలిపింది.
కాగా టీ20 ప్రపంచకప్ ‘సూపర్–8’ దశలో భాగంగా మాజీ చాంపియన్ ఆస్ట్రేలియాతో ఆదివారం ఉదయం జరిగిన గ్రూప్–1 మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ 21 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గుల్బదిన్ నైబ్
ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. అనంతరం 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 19.2 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది.
మ్యాక్స్‌వెల్ (41 బంతుల్లో 59; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) మినహా ఇతర బ్యాటర్లు విఫలమయ్యారు. నవీనుల్ హక్ (3/20), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గుల్బదిన్ నైబ్ (4/20) తమ వైవిధ్యభరిత బౌలింగ్‌తో ఆస్ట్రేలియాను దెబ్బ కొట్టారు.
గతంలో ఒక్కసారి కూడా ఆస్ట్రేలియాపై నెగ్గని అఫ్గానిస్తాన్‌కు ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్ (49 బంతుల్లో 60; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఇబ్రహీం జద్రాన్ (48 బంతుల్లో 51; 6 ఫోర్లు) శుభారంభం అందించారు.
వీరిద్దరు తొలి వికెట్‌కు 118 పరుగులు జోడించారు. గుర్బాజ్, ఇబ్రహీం అవుటయ్యాక వచ్చిన ఇతర అఫ్గాన్ బ్యాటర్లు మెరిపించలేకపోయారు.
కమిన్స్ హ్యాట్రిక్
ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన ఆసీస్ పేసర్ కమిన్స్ చివరి బంతికి అఫ్గానిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ (2)ను అవుట్ చేశాడు. ఆ తర్వాత 20వ ఓవర్లో తొలి రెండు బంతులకు కరీమ్ జన్నత్ (9 బంతుల్లో 13; 1 సిక్స్), గుల్బదిన్ నైబ్ (0)లను అవుట్ చేసి ఈ టోర్నీలో రెండో ‘హ్యాట్రిక్’ నమోదు చేశాడు.
నవీనుల్, గుల్బదిన్ సూపర్ బౌలింగ్
కష్టసాధ్యంకాని లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది. నవీనుల్ హక్ అద్భుత బంతికి ఓపెనర్ ట్రవిస్ హెడ్ (0) బౌల్డయ్యాడు.
ఆ తర్వాత నవీనుల్ తన రెండో ఓవర్లో కెపె్టన్ మిచెల్ మార్ష్ (9 బంతుల్లో 12; 2 ఫోర్లు)ను అవుట్ చేశాడు. ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో వార్నర్ (3)ను నబీ పెవిలియన్‌కు పంపించడంతో ఆసీస్ కష్టాల్లో పడింది.
ఈ దశలో మ్యాక్స్‌వెల్, స్టొయినిస్ (17 బంతుల్లో 11; 1 ఫోర్) ఇన్నింగ్స్ చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. అయితే గుల్బదిన్ వైవిధ్యభరిత బంతులతో ముందుగా స్టొయినిస్‌ను, ఆ తర్వాత టిమ్ డేవిడ్‌ను అవుట్ చేశాడు.
అనంతరం ప్రమాదకరంగా మారిన మ్యాక్స్‌వెల్‌ను కూడా గుల్బదిన్ పెవిలియన్‌కు పంపించాడు. ఆ తర్వాత మాథ్యూ వేడ్‌ను రషీద్ ఖాన్ అవుట్ చేశాడు.
దీంతో ఆసీస్ 108 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి వైపు సాగింది. కమిన్స్ ఏమైనా అద్భుతం చేస్తాడా అని ఆశించినా అతడిని గుల్బదిన్ అవుట్ చేయడంతో ఆస్ట్రేలియా పరాజయం ఖాయమైంది.
చదవండి: కోహ్లి, రోహిత్‌లకు అదే ఆఖరి ఛాన్స్.. పట్టుబట్టిన గంభీర్!
Comments
Please login to add a commentAdd a comment