
సాక్షి క్రీడావిభాగం మేరీకామ్...! భారత బాక్సింగ్‌లో ఆమె ఓ సంచలన చాంపియన్. ముగ్గురు పిల్లలకు తల్లయినా... ఇప్పుడు ఓ ఎంపీ అయినా... రింగ్‌లో మాత్రం చాంపియన్ అయ్యే అలవాటును మార్చుకోలేదు. బహుశా ఈమె స్ఫూర్తితోనే ఏమో... భారత మహిళా క్రికెటర్ నేహా తన్వర్ కూడా ఓ అబ్బాయికి అమ్మయినా... మళ్లీ ఆటకు సై అంటోంది. భారత ‘ఎ’ మహిళల జట్టు తరఫున బంగ్లాదేశ్ ‘ఎ’ జట్టుతో వన్డే, టి20 సిరీస్‌కు సిద్ధమైంది. ఢిల్లీకి చెందిన నేహా ఆరేళ్ల (2011) క్రితం భారత మహిళల క్రికెట్ జట్టు తరఫున వెస్టిండీస్‌పై అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. అదే ఏడాది ఐదు వన్డేలు, రెండు టి20 మ్యాచ్‌లాడింది. 2014లో ఆమె రిటైరయ్యే నాటికి చెప్పుకోదగ్గ గణాంకాలేవీ లేకపోయినా... గర్భం దాల్చడంతో ఆటకు దూరమైంది. అక్టోబర్‌లో ఓ పండటి మగ శిశువుకు జన్మనిచ్చిన 31 ఏళ్ల నేహా... పుత్రోత్సాహంతో పూర్తిగా ఇంటికే పరిమితమైంది. కానీ ఆట లేని లోటు ఆమెను తొలచివేయడంతో మళ్లీ బ్యాట్ పట్టాలని నిర్ణయించుకుంది.
డాక్టర్ల సలహాతో కాన్పు జరిగిన ఆరు నెలల తర్వాత మెల్లగా ప్రాక్టీస్‌కు దిగింది. దీంతో అప్పుడు గానీ అసలు సమస్యలేవో తెలియలేదు. కడుపులో పిల్లాడి కోసం బలవర్ధమైన పోషకాహారం వల్ల ఆమె బరువు పెరిగింది. దీంతో ఆట అంత ఈజీ కాదని అర్థమైంది. అయినా పట్టుదల కొద్దీ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టింది. 60 కేజీల నుంచి ప్రెగ్నెన్సీ సమయంలో 80 కేజీలకి చేరిన ఆమె క్రమం తప్పని ప్రాక్టీస్‌తో ఇప్పుడు అటు ఇటూగా తన పూర్వస్థాయికి వచ్చేసింది. ఇక ఇప్పుడు బరిలోకి దిగడమే తరువాయి. నిజమే...ఆడాలన్న తపనే ఉంటే ఏదైనా సాధ్యమే కదా!! నా భర్త సహకారం వల్లే మళ్లీ బరిలోకి దిగుతున్నాను. మాతృత్వం వరమే. మహిళలకు అది పునర్జన్మ. అమ్మతనం అన్నీ మార్చేస్తుంది. జీవితంలో ప్రాధాన్యతలు మారిపోతాయి. కానీ కొన్ని విషయాలే ఎప్పటికీ మారవు. సాధించాలను కుంటే సాధ్యం కానిదేదీ ఉండదు. – నేహ తన్వర్
Comments
Please login to add a commentAdd a comment