
కడప, అనంతపురం జట్ల విజయభేరి
కడప స్పోర్ట్స్:
కడప నగరంలో నిర్వహిస్తున్న అంతర్ జిల్లాల సీనియర్ మహిళా క్రికెట్ పోటీల్లో మంగళవారం కడప, అనంతపురం జట్లు విజయం సాధించాయి. నగరంలోని వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్ మైదానంలో చిత్తూరు, అనంతపురం జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన చిత్తూరు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. అనంతపురం బౌలర్ల ధాటికి బెంబేలెత్తిన చిత్తూరు జట్టు 14.2 ఓవర్లలో కేవలం 27 పరుగులకే కుప్పకూలింది. అనంతపురం బౌలర్లు బి. అనూష 4, ఫరూఖున్నీసీ 2, పూజారిపల్లవి 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అనంతపురం జట్టు 15 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 28 పరుగులు చేసి విజయం సాధించింది. దీంతో అనంతపురం జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో అనంతపురం జట్టుకు 4 పాయింట్లు లభించాయి.
నెల్లూరుపై కడప జట్టు విజయం...
కేఎస్‌ఆర్‌ఎం క్రీడామైదానంలో నిర్వహించిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన కడప జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన నెల్లూరు జట్టు 36.3 ఓవర్లలో 80 పరుగులు చేసి ఆలౌట్ అయింది. జట్టులోని యామిని 25, సింధుజ 11 పరుగులు చేసింది. కడప బౌలర్లు మౌనిక 4, ఓబులమ్మ 3, శిరీష 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కడప జట్టు 22.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది. జట్టులోని రోజా 31, జ్యోతి 21, మౌనిక 19 పరుగులు చేసింది. దీంతో కడప జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో
కడప జట్టుకు 4 పాయింట్లు లభించాయి.