aca
-
షేక్ రషీద్‌కు 10 లక్షల నజరానా... రిషిత్ రెడ్డికి ఎంతంటే!
U 19 World Cup Winner India:- విశాఖ స్పోర్ట్స్: భారత జట్టు అండర్–19 ప్రపంచకప్ టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించిన ఆంధ్ర క్రికెటర్ షేక్ రషీద్‌కు ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) రూ. 10 లక్షల నజరానా ప్రకటించింది. రషీద్ భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఏసీఏ అధ్యక్షుడు శరత్చంద్ర రెడ్డి, కోశాధికారి గోపినాథరెడ్డి, ఏసీఏ ఆపరేషన్స్ డైరెక్టర్ వేణుగోపాలరావు, సీఈవో శివారెడ్డి ఆకాంక్షించారు. మరోవైపు ప్రపంచకప్‌లో భారత జట్టుకు స్టాండ్‌బై ప్లేయర్‌గా ఉన్న హైదరాబాద్ యువ క్రికెటర్ రిషిత్ రెడ్డికి రూ. 10 లక్షలు అందజేస్తామని హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అజహరుద్దీన్ ప్రకటించారు. చదవండి: U19 WC- Shaikh Rasheed: 40 లక్షల నగదు.. అంత డబ్బు ఎప్పుడూ చూడలేదు.. చిన్న ఇల్లు కొంటాను.. మిగతా మొత్తంతో.. -
‘ఒక క్రికెటర్‌ను బాధించే అంశం అదే’
విజయవాడ: జీవితంలో ఒక క్రికెటర్‌ను బాధించే అంశం ఏదైనా ఉంటే అది రిటైర్మెంటేనని టీమిండియా మాజీ క్రికెటర్ వేణుగోపాలరావు పేర్కొన్నారు. తాను 25 ఏళ్లు క్రికెటర్‌గా సేవలందించానని, తాను ఈ స్థాయిలో ఉండటానికి కుటుంబ ప్రోత్సహమేనని అన్నారు. ప్రత్యేకంగా తన తండ్రి వల్లే ఇన్ని విజయాలు సాధ్యమైనట్లు తెలిపారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ)కు నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు.. వేణుగోపాలరావును ఘనంగా సత్కరించారు. దీనిలో భాగంగా మాట్లాడిన వేణుగోపాలరావు.. ప్రతీ క్రికెటర్‌కు రిటైర్మెంట్ అనేది ఎక్కువగా బాధిస్తుందన్నారు. ఆంధ్ర నుంచి ఎక్కువ మంది యువ క్రికెటర్లు దేశానికి ఆడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇక ఈ కార్యక్రమానికి హాజరైన టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ మాట్లాడుతూ.. ఏసీఏకు కొత్తగా ఎన్నికైన సభ్యులకు అభినందనలు తెలియజేశారు. లోధా కమిటీ నిబంధనల ప్రకారమే నూతన కార్యవర్గ సభ్యుల ఎన్నిక జరిగిందన్నారు. ఏసీఏ నూతన కార్యవర్గం పి. శరత్ చంద్ర - అధ్యక్షులు వీవీఎస్‌ఎస్‌కేకే యాచేంద్ర వి. దుర్గా ప్రసాద్- ప్రధాన కార్యదర్శి కేఎస్. రామచంద్ర రావు-జాయింట్ సెక్రటరీ ఎస్. గోపినాధ్ రెడ్డి -కోశాధికారి ఆర్. ధనుంజయ రెడ్డి - కౌన్సిలర్ -
ఒకే టోర్నీలో రెండు ట్రిపుల్ సెంచరీలు
కడప స్పోర్ట్స్: వైఎస్సార్ జిల్లా కడపలోని ఏసీఏ సౌత్‌జోన్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న కల్లూరు రేవంత్‌రెడ్డి సరికొత్త రికార్డు సృష్టించాడు. కడప నగరంలో సెప్టెంబర్ 17 నుంచి ప్రారంభమైన ఏసీఏ అండర్–14 అంతర్ జిల్లాల క్రికెట్ టోర్నమెంట్లో రెండు ట్రిపుల్ సెంచరీలు సాధించి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ చరిత్రలోనే రికార్డు నెలకొల్పాడు. ఒకే టోర్నమెంట్లో రెండు ట్రిపుల్ సెంచరీలు సాధించిన (అన్ని ఫార్మాట్లలో) ఏకైక క్రికెటర్‌గా రికార్డు నమోదు చేశాడు. నెల్లూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్‌రెడ్డి గతనెల 23వ తేదీన విజయనగరం జట్టుతో జరిగిన పోటీ మ్యాచ్‌లో 304 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. తాజాగా గురువారం పశ్చిమగోదావరి జట్టుపై 289 బంతుల్లో 301 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇప్పటివరకు ఈ టోర్నమెంట్లో 5 మ్యాచ్‌లు ఆడగా 95.76 స్ట్రయిక్ రేట్‌తో 746 పరుగులు సాధించడం విశేషం. కాగా రేవంత్‌రెడ్డి 2014 నుంచి కడప నగరంలోని ఏసీఏ సౌత్‌జోన్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. సౌత్‌జోన్ అకాడమీ హెడ్ కోచ్ పి. మధుసూదన్‌రెడ్డి, సహాయ శిక్షకులు శ్రీనివాస్, కిశోర్, ట్రైనర్ ఆనంద్‌కుమార్‌ల నేతృత్వంలో క్రికెట్లో చక్కటి ప్రతిభ కనబరుస్తున్నాడు. అతను ప్రస్తుతం కడప నగరంలోని గురుకులం టెక్నో స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. అతనిది నెల్లూరు నగరం బి.వి.నగర్ కాగా ఈయన తండ్రి రామచంద్రారెడ్డి హైదరాబాద్‌లో సివిల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. రేవంత్ ప్రదర్శన పట్ల సౌత్‌జోన్ అకాడమీ చైర్మన్ ఎం.వెంకటశివారెడ్డి, కన్వీనర్ డి. నాగేశ్వరరాజు తదితరులు అభినందనలు తెలిపారు. -
దక్షిణాఫ్రికా పర్యటన లేదు!
సిడ్నీ: ఈ నెలలో దక్షిణాఫ్రికా పర్యటించాల్సిన ఉన్న ఆస్ట్రేలియా-ఎ క్రికెట్ జట్టు తన పర్యటనను బాయ్ కాట్ చేయడానికి సిద్ధమైంది. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ), ఆ దేశ ఆటగాళ్లకు మధ్య కొనసాగుతున్న వేతనాల ఒప్పందం ఇంకా కొలిక్కిరాని నేపథ్యంలో దక్షిణాఫ్రికా పర్యటన దాదాపు లేనట్లేనని ఆస్ట్రేలియా క్రికెటర్ల అసోసియేషన్(ఏసీఏ) స్పష్టం చేసింది. దక్షిణాఫ్రికా పర్యటన జరగాలంటే అనూహ్య మలుపులు సంభవించాల్సి ఉందని ఏసీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అలెస్టర్ నికోల్సన్ తెలిపారు.ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో దక్షిణాఫ్రికా పర్యటనను ఆస్ట్రేలియా-ఎ జట్టు బాయ్ కాట్ చేసినట్లేనని పేర్కొన్నారు. సీఏ నూతన ఒప్పందంపై గడువు జూన్ 30వ తేదీతో ముగిసిన తరుణంలో మెజారిటీ ఆసీస్ క్రికెటర్లంతా నిరుద్యోగులుగా మారిపోయారు. కొంతమంది క్రికెటర్లు మినహా ప్రధాన క్రికెటర్లంతా ఆసీస్ తరపున బరిలోకి దిగే అవకాశాన్ని కోల్పోయారు.ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు తరపున బరిలోకి దిగాలంటే కొత్త కాంట్రాక్ట్ పై ఆటగాళ్లు సంతకాలు చేయాల్సి ఉంది. అయితే దాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఆసీస్ క్రికెటర్లు అందుకు ఒప్పుకోలేదు. ఆ క్రమంలోనే మొత్తం 230 మంది ఆసీస్ క్రికెటర్ల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటివరకూ మ్యాచ్ ల ద్వారా వచ్చిన ఆదాయంలో 25 శాతాన్ని సీఏ క్రికెటర్లకు పంచుతూ వచ్చింది. అయితే తాజా ఒప్పందం ప్రకారం సీఏ మిగులు ఆదాయంలోమాత్రమే క్రికెటర్లకు ఇవ్వాలనేది సీఏ యోచన. ఈ మేరకు కొత్త కాంట్రాక్ట్ విధానాన్ని ప్రవేశపెట్టి ఆటగాళ్లకు డెడ్ లైన్ విధించింది.ఒకవేళ ఒప్పందం సంతంకం చేయని పక్షంలో కాంట్రాక్ట్ కోల్పోయి నిరుద్యోగులుగా మారతారంటూ హెచ్చరించింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్ ను కుదిపేస్తున్న ఈ వివాదం ఎంతవరకూ దారి తీస్తుందో చూడాలి. -
టోర్ని విజేత విజయవాడ
► ముగిసిన అంతర్ రాష్ట్రాల వెటరన్ క్రికెట్ టోర్నీ ► రన్నరప్‌గా హైదరాబాద్ ► ట్రోఫీలు బహుకరించిన జిల్లా క్రికెట్ సంఘం ప్రతినిధులు కడప స్పోర్ట్స్ : కడప నగరంలోని కేఎస్ఆర్ఎం, కేఓఆర్ఎం క్రీడామైదానంలో గత మూడు రోజులుగా నిర్వహించిన ఎం. చంద్రశేఖరరెడ్డి స్మారక అంతర్ రాష్ట్రాల వెటరన్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా విజయవాడ జట్టు నిలిచింది. ఆదివారం ఉదయం నిర్వహించిన ఫైనల్ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టుపై విజయవాడ జట్టు విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా విజేతలకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు, జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.వెంకటశివారెడ్డి ట్రోఫీలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెటరన్ క్రికెటర్లు మంచి ఆటతీరుతో అలరించారన్నారు. వయసుతో సంబంధం లేకుండా యువ క్రికెటర్ల మాదిరిగా చక్కగా పోటీపడ్డారన్నారు.జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రామ్మూర్తి మాట్లాడుతూ జిల్లాలకు వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసి ఆడటం సంతోషంగా ఉందన్నారు. గౌరవ అతిథిగా విచ్చేసిన జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్. జిలానీబాషా మాట్లాడుతూ క్రీడాకారుల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని ఏర్పరచే ఇటువంటి టోర్నమెంట్లు మరిన్ని నిర్వహించాలన్నారు. అనంతరం వివిధ విభాగాల్లో రాణించిన క్రీడాకారులకు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో వీకే హోండా అధినేత కరుణాకర్‌రెడ్డి, జిల్లా క్రికెట్ అసోసియేషన్ కోశాధికారి వై. శివప్రసాద్, సంయుక్త కార్యదర్శులు సంజయ్‌కుమార్‌రెడ్డి, ఎ.నాగసుబ్బారెడ్డి, సభ్యులు భరత్‌రెడ్డి, మునికుమార్‌రెడ్డి, రెడ్డిప్రసాద్, శేఖర్, ఖాజామైనుద్దీన్ పాల్గొన్నారు. హైదరాబాద్‌పై విజయవాడ విజయకేతనం వెటరన్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్మ్యాచ్లో విజయవాడ, హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన విజయవాడ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. జట్టులోని బాపిరాజు 62 పరుగులు, పి.శ్రీనివాస్ 25 పరుగులు, జనార్దన్ 23 పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లు నదీమ్ 2 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. -
వేణుగానానికి ని'బంధనాలు'!
అతను ఒకప్పుడు భారత్ తరఫున అంతర్జాతీయ వన్డేలు ఆడాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఏకంగా 18 సంవత్సరాల అనుభవం ఉంది. వయసు 34 ఏళ్లు. ఇంకా నాలుగైదేళ్లు క్రికెట్ ఆడే సత్తా ఉంది. ఆంధ్ర నుంచి దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఇద్దరిలో అతనూ ఒకడు. కానీ ఇంత అనుభవం, ఈ ఘనత ఆంధ్ర క్రికెట్ సంఘాని (ఏసీఏ)కి సరిపోవడం లేదు. కుర్రాళ్లకు మార్గనిర్దేశం కోసం అరువు ‘సీనియర్లను’ తెచ్చి ఆడిస్తున్న ఏసీఏ... సుదీర్ఘ అనుభవం ఉన్న సొంత క్రికెటర్‌ను మాత్రం పట్టించుకోవడం లేదు. కేవలం కొందరు పెద్ద మనుషుల సొంత ఈగోలతో వేణుగోపాలరావును పక్కన పెట్టేశారు. ఒకప్పుడు రాష్ట్రానికి ఖ్యాతి తెచ్చిన ఆటగాడిగా కీర్తి తెచ్చుకున్న క్రికెటర్... ఈ రోజు జట్టులో చోటు కోసం పది మందినీ బతిమిలాడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పటికే దిగజారిపోయిన ఆంధ్ర క్రికెట్ ఆటతీరు ఇలాంటి శైలి వల్ల అధఃపాతాళానికి పడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. * ఆంధ్ర క్రికెట్ సంఘానికి అక్కరకు రాని సొంత ఆటగాడు * వేణుగోపాలరావును అడ్డుకోవడానికి తెరపైకి కొత్త నిబంధన సాక్షి, విజయవాడ స్పోర్ట్స్: ఓ ఆటగాడు నేను ఆడతాను అని ముందుకు వస్తే... నువ్వు ఫామ్‌లో లేవనో లేకపోతే నీకంటే మెరుగైన ఆటగాళ్లు ఉన్నారనో చెబితే... ఆ ఆటగాడు మరింత కష్టపడో, ఇంకా మెరుగ్గా ఆడో జట్టులో స్థానం కోసం పోరాడతాడు. కానీ అనుభవం కోసం బయటి రాష్ట్రాల క్రికెటర్ల వైపు చూసే ఆంధ్ర క్రికెట్ సంఘం... తమ దగ్గరే అత్యంత అనుభవజ్ఞుడు ఉన్నా... జట్టులోకి తీసుకోవడం లేదు. కారణం ఏంటంటే... ‘కూలింగ్ ఆఫ్ పీరియడ్’ అనే నిబంధనను చూపిస్తోంది. నిజానికి ఈ నిబంధన దేశంలో ఏ క్రికెట్ సంఘంలోనూ లేదు. ఆంధ్ర క్రికెట్లోనూ ఈ ఏడాది కొత్తగా ఈ నిబంధనను ప్రవేశపెట్టారు. ఇంతకాలం లేనిది ఈసారి వేణుగోపాలరావు తిరిగి ఆంధ్రకు ఆడతానంటుండగానే ఎందుకు ఈ నిబంధన వచ్చింది..? ఆటగాడు దేశవాళీ క్రికెట్లో సొంత జట్టు నుంచి నిరభ్యంతరకర పత్రం (ఎన్ఓసీ) తీసుకొని మరో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తే పునరాగమనం చేసేందుకు కనీసం మూడేళ్ల వ్యవధి ఉండాలి... క్రికెటర్ల బదిలీలకు సంబంధించి ఉన్న నిబంధన ఇది. ఆంధ్ర క్రికెటర్ వేణుగోపాలరావు గత మూడు సీజన్లు గుజరాత్ తరఫున ఆడాడు. చెప్పుకోదగ్గ ప్రదర్శనతో ఆ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. మూడేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ అతను ఆంధ్రకు తిరిగి రావాలని భావించాడు. అయితే ‘కూలింగ్ ఆఫ్ పీరియడ్’ కనీసం ఏడాది ఉండాలంటూ తీసుకొచ్చిన కొత్త నిబంధన ఇప్పుడు అతడి అవకాశాన్ని దెబ్బ తీస్తోంది. బయటి జట్టుకు ఆడిన తర్వాత మళ్లీ సొంత టీమ్‌లోకి వచ్చే ముందు ఒక సీజన్ పాటు మరే జట్టుకూ ఆడకుండా విరామం పాటించాలనేదే ఈ నిబంధన. అరుుతే గతంలో ఎప్పుడూ ఇలా లేదు. దేశంలో ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహించినా... ఆడగల సామర్థ్యం, ఆసక్తి ఉంటే విరామంతో పని లేకుండా నేరుగా సొంత జట్టు సెలక్షన్సకు అర్హత పొందేవాడు. కానీ వేణుకు అలాంటి అవకాశం ఇవ్వకుండా ఈ నిబంధన తెచ్చారు. మార్గదర్శి కాలేడా... వేణుగోపాలరావు ఆటగాడిగా అద్భుతమైన ఫామ్‌లో లేకపోవచ్చు. కానీ ఇటీవల దేశవాళీ క్రికెట్లో కనిపిస్తున్న కొత్త ట్రెండ్ ప్లేయర్ కంమెంటర్ పాత్రకు అతను సరిగ్గా సరిపోతాడు. 120 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 7 వేలకు పైగా పరుగులు చేసిన అనుభవం అతనికి ఉంది. ఇప్పుడు ఆంధ్ర టీమ్‌లో ఎక్కువ మంది కుర్రాళ్లే ఉన్నారు. వారితో కలిసి ఆడుతూ, వారిలో భాగమై రంజీ ట్రోఫీలో వారిని సరైన దిశలో నడిపించగల వ్యక్తి జట్టుకు అవసరం. బయటి వ్యక్తికంటే మన మనిషిగా అతను ఆటగాళ్లందరితో కలిసిపోగలడు. ప్రస్తుతం ఆంధ్ర జట్టు గ్రూప్ ‘సి’లో ఉంది. ఇప్పుడు సీనియర్‌గా బాధ్యతలు చూడగలిగే మరో మంచి ప్రత్యామ్నాయం కూడా ఆంధ్ర వద్ద ఏమీ లేదు. సీనియర్ పేరు చెప్పి 36 ఏళ్ల బద్రీనాథ్‌ను హైదరాబాద్ తెచ్చుకుంటున్నప్పుడు నేను ఆడతానంటూ ముందుకు వస్తున్న 34 ఏళ్ల వేణుగోపాలరావును కాదనడంలో అర్థం లేదు. వీరికంటే మెరుగు కాదా..? అమోల్ మజుందార్ రెండేళ్ల కెప్టెన్సీలో ఆంధ్రకు పెద్దగా కలిసొచ్చిందేమీ లేదు. రెండో సీజన్లో అరుుతే అతను నా వల్ల కావడం లేదంటూ నాలుగు మ్యాచ్‌ల తర్వాతే చేతులెత్తేసి తప్పుకున్నాడు. మొహమ్మద్ కైఫ్ అరుుతే గత సీజన్లో 13 ఇన్నింగ్స లలో 27.50 సగటుతో కేవలం 330 పరుగులు చేశాడు. దాంతో ఆంధ్ర అతడిని ఈసారి వద్దనుకుంది. వేణుగోపాలరావు నుంచి ఇంతకంటే మెరుగైన ప్రదర్శనను ఆశించవచ్చు. గత ఏడాది వరకు హైదరాబాద్‌కు ఆడిన హనుమ విహారి, డీబీ రవితేజ ఈసారి ఆంధ్ర తరఫున ఆడేందుకు వెళ్లారు. వీరిద్దరు పుట్టిన ప్రాంతం ఆంధ్ర (కాకినాడ) కాబట్టి ఇంత కాలం ఆడినదానితో సంబంధం లేకుండా వీరిని సొంత ఆటగాళ్లుగానే పరిగణిస్తున్నారు. వీరికి ఎలాంటి నిబంధనల అడ్డంకులు లేవు. ఈ సీజన్లో కొత్తగా గుజరాత్ నుంచి వచ్చిన భార్గవ్ భట్‌కు ఆంధ్ర అవకాశం కల్పిస్తోంది. మరి వేణుగోపాలరావును మాత్రం దూరం పెట్టడంలో ఔచిత్యం అనిపించుకోదు. కొందరికే కష్టం..? వేణు తిరిగి ఆంధ్ర తరఫున ఆడతానని రాగానే ఏసీఏలోని మెజారిటీ వ్యక్తులు సంతోషించారు. ‘అరువు’ అవసరం లేకుండా సీనియర్ ఉన్నాడులే అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఏసీఏలో కీలకంగా వ్యవహరిస్తున్న ఒక వ్యక్తి మాత్రం వేణును అడ్డుకుంటున్నారు. త్వరలో లోధా కమిటీ నిబంధనలు అమల్లోకి వస్తే ప్రస్తుత ఏసీఏ కార్యవర్గంలో మార్పులు జరగాలి. కార్యదర్శిగా ఉన్న గోకరాజు గంగరాజు తప్పుకోవాలి. ఆయన తన కుమారుడిని కార్యదర్శిని చేయడానికి రంగం సిద్ధం చేశారు కూడా. ఈ సమయంలో ఏసీఏలో కీలకమైన వ్యక్తులతో విభేదించడం అనవసరమని ఆయన భావించినట్లున్నారు. కానీ ఇలా వ్యక్తుల అవసరాలు, ఈగోలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటే... నష్టపోయేది మాత్రం ఆంధ్ర క్రికెట్టే. ‘ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఆడిన వాళ్లు తిరిగి వస్తే ఒక సంవత్సరం ఆడించకూడదనే నిబంధన మేమే పెట్టుకున్నాం. గతంలో వేరే రాష్ట్రానికి ఆడి ఇప్పుడు ఇక్కడ ఆడతా అంటే కుదరదు. ఇక్కడ చాలా మంది యువ ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. జట్టుకు ఉపయోగపడతారనుకుంటే బయటి రాష్ట్రాల సీనియర్లను తీసుకుంటాం’. - గోకరాజు గంగరాజు, ఏసీఏ కార్యదర్శి -
సింధుకు ఏసీఏ రూ.25 లక్షల నజరానా
విజయవాడ స్పోర్ట్స్ : ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన సింధుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) రూ.25 లక్షల నజరానా ప్రకటించింది. కోచ్ పుల్లెల గోపీచంద్‌కు రూ.10 లక్షలు నజరానా అందించింది. ఐజీఎంసీ స్టేడియంలో మంగళవారం జరిగిన సన్మాన కార్యక్రమంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు చేతులు మీదుగా నగదు చెక్కులను సింధు, గోపీచంద్ అందుకున్నారు. -
ఉత్సాహం ఉంటే ..ఉన్నత స్థానమే
– మహిళా క్రికెటర్ల కొరతను అధిగమించేందుకు ఏసీఏ ప్రత్యేక దృష్టి –రిటైరైన మహిళా క్రికెటర్లకు మహిళా కోచ్‌లు, ఫిజియోథెరపిస్టులు వగైరా అవకాశాలు – విలేకరులతో సెంట్రల్ జోన్ సెక్రటరీ కోకా రమేష్, ఎన్సీఏ లెవల్బీ కోచ్ శ్రీనివాసరెడ్డి ఒంగోలు: ఉత్సాహం ఉంటే మహిళా క్రికెటర్లు అద్భుతాలు సృష్టించే అవకాశం ఉందని, దానిని అందిపుచ్చుకోవాలంటే అందుకు తల్లిదండ్రుల నుంచి సంపూర్ణ సహకారం అవసరమని సెంట్రల్ జోన్ సెక్రటరీ కోకా రమేష్ , నేషనల్ క్రికెట్ అసోసియేషన్ లెవల్ బీకోచ్ ఎస్.శ్రీనివాసరెడ్డిలు తెలిపారు. మంగళవారం వారు సాక్షితో కొద్దిసేపు మహిళా క్రికెటర్లకు ఏసీఏ అందిస్తున్న సహకారం గురించి మాట్లాడారు. ప్రశ్న: అండర్–10 వయస్సు వారిని కూడా సీనియర్ మహిళా క్రికెట్ జట్టులో ఆడిస్తున్నారు...ఇది సరైనదే అంటారా? సమాధానం: గుంటూరు జట్టులో మాత్రమే నలుగురు చిన్నారులు ఆడారు. మిగతా వారిలో కూడా ఎక్కువుగా అండర్–16 ఉన్న మాట నిజమే. అయితే తాము ఎంపిక చేసిన నలుగురు చిన్నారులు సీనియర్ మహిళా క్రికెటర్లు వేసే బంతులను సైతం «ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. ప్రశ్న: సీనియర్లను పక్కన బెట్టి మరీ చిన్న పిల్లలను ఆడిస్తే సీనియర్లకు ఇబ్బంది కాదా? సమాధానం: జట్టులో సీనియర్ల కొరత ఉండడం వల్లే జూనియర్లలో ప్రతిభ ఉన్నవారిని ఎంపిక చేశాం. అంతే తప్ప సీనియర్లను పక్కన బెట్టి జూనియర్లకు అవకాశం కల్పించడం ఎంత మాత్రంకాదు. ప్రశ్న: క్రికెట్లో మహిళా క్రికెటర్ల కొరత ఎక్కువుగా ఉన్నట్లుంది? సమాధానం: క్రికెట్‌కు ఎక్కువుగా గ్రామీణ ప్రాంతాల నుంచి విద్యార్థినులు వస్తున్నారు. అయితే వీరికి యుక్త వయసు రాగానే వివాహం చేసేందుకు తల్లిదండ్రులు సిద్ధపడుతున్నారు. దీంతో వారు శిక్షణ తీసుకున్నా ఎక్కువ కాలం క్రికెట్లో ఆడలేని పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ప్రశ్న: మహిళా క్రికెటర్ల కొరతను అధిగమించేందుకు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? సమాధానం: ఏసీఏ కార్యదర్శిగా గోకరాజు గంగరాజు బాధ్యతలు చేపట్టిన తర్వాత మహిళా క్రికెటర్లన ు ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అందులో జోనల్ స్థాయి టీంకు మహిళలు ఎంపికైతే వారికి ఏడాది పాటు నెలకు రూ.2వేలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు. రాష్ట్ర జట్టుకు ఎంపికైతే వారికి నెలకు రూ.4వేలు చొప్పున ఏడాదిపాటు అందిస్తోంది. ప్రశ్న: ప్రస్తుతం జిల్లాల వారీగా మహిళా క్రికెటర్లు ఎంతమందికి శిక్షణ ఇస్తున్నారు? సమాధానం: జిల్లాలో 28మంది, గుంటూరు–30, కృష్ణా–35, పశ్చిమ గోదావరి –30 మంది ఉన్నారు. ప్రకాశం జిల్లానే తీసుకుంటే మార్కాపురం జవహర్ నవోదయ విద్యార్థులు ఎక్కువగా ఉంటారు. ప్రస్తుత ప్రకాశం జట్టులో 15మంది సభ్యుల్లో ఏడుగురు మార్కాపురం జవహర్ నవోదయ విద్యార్థులే ఉన్నారు. అంతేగాక ప్రస్తుతం ఆడుతున్న వారిలో ఎక్కువ మంది 13 నుంచి 16 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు ఉన్నారు. మరో రెండు మూడేళ్లకు మంచి జట్టు సిద్ధం అవుతుందిన కచ్చితంగా చెప్పగలం. ప్రశ్న: మహిళా క్రికెటర్లకు ఏమైనా ప్రత్యేక అవకాశాలు కల్పిస్తున్నారా? సమాధానం: మహిళా క్రికెటర్లు 20 ఏళ్లు వచ్చేటప్పటికే వివాహం చేస్తుండడం సహజం. ఈ క్రమంలో వారు క్రికెట్‌కు దూరమవుతున్నారు. ఈ కారణంగా వారి సేవలను వినియోగించాలని ఏసీఏ భావించింది. ఈ మేరకే ఇటీవల క్రికెట్ ఆడేందుకు రిటైర్మెంట్ ప్రకటించిన రమాదేవిని పశ్చిమగోదావరి జట్టుకు కోచ్‌గా ఎంపిక చేశాం. జిల్లాలోను సీనియర్ ప్లేయర్ చంద్రికను మార్కాపురం జవహర్ నవోదయలోని పీడీసీఏ సబ్సెంటర్లో శిక్షణ ఇచ్చేందుకు తీసుకున్నాం. ప్రశ్న: ఇతర అవకాశాలు ఏమైనా ఉన్నాయా? సమాధానం: ప్రస్తుతం మహిళా క్రికెట్ జట్టుకు సంబంధించి మహిళల ద్వారానే శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. అందులో భాగంగానే న్యూజిలాండ్‌లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన మారియాఫాహేను ఏసీఏ మహిళా జట్టుకు కోచ్‌గా ఎంపిక చేశాం. ఫిజియోథెరపిస్టు, కోచ్, అంపైర్, వీడియో ఎనలిస్టు తదితరాలకు కూడా సీనియర్ మహిళా క్రికెటర్లు అయి ఉండి అర్హతలు గలవారిని ఎంపిక చేస్తున్నారు. ఈ పోస్టుల్లో అవకాశం దక్కించుకుంటే వారికి ఉండే జీతాలు కూడా భారీగానే ఉంటాయి. ప్రశ్న: మహిళలకు పాఠశాల స్థాయి క్రికెట్ పోటీలను ఎందుకు ఎంచుకోవడం లేదు? సమాధానం: పాఠశాల స్థాయిలో మహిళా జట్టు ఉండే అవకాశాలు తక్కువుగా ఉంటాయి. ఈ నేపథ్యంలో కొన్ని పాఠశాలలను కలిపి అయినా ఒక టీంగా చేస్తే బాగుండే అవకాశాలు లేక పోలేదు. ఈ అంశంపై తప్పకుండా ఏసీఏ బోర్డు దృష్టికి తీసుకువెళతాం. ప్రశ్న: మహిళా క్రికెటర్లకు ఇతర ఉద్యోగ అవకాశాల గురించి.. సమాధానం: మహిళా క్రికెటర్లకు ప్రస్తుతం రైల్వే ద్వారా మంచి అవకాశాలు లభిస్తున్నాయి. ఇటీవలే ప్రకాశం జిల్లాకు చెందిన సుధారాణి రైల్వేలో ఉద్యోగానికి ఎంపికైంది. వైజాగ్‌కు చెందిన స్నేహదీప్తికి కూడా ఉద్యోగం లభించింది. వీరికే గాక ఏసీఏ మహిళా టీంలో ఆడుతున్న మరో ఇద్దరికి కూడా ఉద్యోగాలు ఇచ్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. త్వరలోనే ఉత్వర్వులు వెలువడవచ్చు. -
కడప, అనంతపురం జట్ల విజయభేరి
కడప స్పోర్ట్స్: కడప నగరంలో నిర్వహిస్తున్న అంతర్ జిల్లాల సీనియర్ మహిళా క్రికెట్ పోటీల్లో మంగళవారం కడప, అనంతపురం జట్లు విజయం సాధించాయి. నగరంలోని వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్ మైదానంలో చిత్తూరు, అనంతపురం జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన చిత్తూరు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. అనంతపురం బౌలర్ల ధాటికి బెంబేలెత్తిన చిత్తూరు జట్టు 14.2 ఓవర్లలో కేవలం 27 పరుగులకే కుప్పకూలింది. అనంతపురం బౌలర్లు బి. అనూష 4, ఫరూఖున్నీసీ 2, పూజారిపల్లవి 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అనంతపురం జట్టు 15 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 28 పరుగులు చేసి విజయం సాధించింది. దీంతో అనంతపురం జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో అనంతపురం జట్టుకు 4 పాయింట్లు లభించాయి. నెల్లూరుపై కడప జట్టు విజయం... కేఎస్ఆర్ఎం క్రీడామైదానంలో నిర్వహించిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన కడప జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన నెల్లూరు జట్టు 36.3 ఓవర్లలో 80 పరుగులు చేసి ఆలౌట్ అయింది. జట్టులోని యామిని 25, సింధుజ 11 పరుగులు చేసింది. కడప బౌలర్లు మౌనిక 4, ఓబులమ్మ 3, శిరీష 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కడప జట్టు 22.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది. జట్టులోని రోజా 31, జ్యోతి 21, మౌనిక 19 పరుగులు చేసింది. దీంతో కడప జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో కడప జట్టుకు 4 పాయింట్లు లభించాయి. -
క్రికెటర్ కల్పనకు ACA సన్మానం
-
ఏసీఏలో పదపై ఎంపీ దృష్టి!
శ్రీకాకుళం స్పోర్ట్స్: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ)లో చక్రం తిప్పాలనే నెపంతో జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవిపై శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్నాయుడు కన్నేశారు. ఇందులో భాగంగా అధ్యక్షపదవికి ఇప్పటికే నామినేషన్ సమర్పించారు. కేంద్రస్థాయిలో పలు అధ్యయన, నివేదికల కమిటీ నియామకాల్లో సభ్యునిగా ఉన్న రామ్మోహన్ తాజాగా జిల్లా నుంచి మొదలుకుని రాష్ట్రస్థాయిలో పట్టు సాధించేందుకు క్రీడావేదికను సిద్ధం చేసుకుంటున్నారని ఆ పార్టీకి చెందిన వారంటున్నారు. కాగా జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షడుగా నాయుడు ఎంపిక లాంఛనమేనని ఆ సంఘ ప్రస్తుత కీలక ప్రతినిధులే బాహాటంగా చెబుతున్నారు. రామ్మోహన్ ఎంపిక కోసమే జిల్లా క్రికెట్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించిన వివరాలను ఎస్‌డీసీఏ పెద్దలు గొప్యంగా ఉంచినట్టు సమాచారం. ఎస్‌డీసీఏ అధ్యక్షునితోపాటు పలు కార్యవర్గ సభ్యుల ఎంపికలకు మంగళవారంతో నామినేషన్ల పర్వం ముగియనుందని ఎస్‌డీసీఏ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఎంపీకి తీరికలేని కారణంగా ఈనెల 29వ తేదీన జిల్లా క్రికెట్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.