దక్షిణాఫ్రికా పర్యటన లేదు!
సిడ్నీ: ఈ నెలలో దక్షిణాఫ్రికా పర్యటించాల్సిన ఉన్న ఆస్ట్రేలియా-ఎ క్రికెట్ జట్టు తన పర్యటనను బాయ్ కాట్ చేయడానికి సిద్ధమైంది. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ), ఆ దేశ ఆటగాళ్లకు మధ్య కొనసాగుతున్న వేతనాల ఒప్పందం ఇంకా కొలిక్కిరాని నేపథ్యంలో దక్షిణాఫ్రికా పర్యటన దాదాపు లేనట్లేనని ఆస్ట్రేలియా క్రికెటర్ల అసోసియేషన్(ఏసీఏ) స్పష్టం చేసింది. దక్షిణాఫ్రికా పర్యటన జరగాలంటే అనూహ్య మలుపులు సంభవించాల్సి ఉందని ఏసీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అలెస్టర్ నికోల్సన్ తెలిపారు.ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో దక్షిణాఫ్రికా పర్యటనను ఆస్ట్రేలియా-ఎ జట్టు బాయ్ కాట్ చేసినట్లేనని పేర్కొన్నారు.
సీఏ నూతన ఒప్పందంపై గడువు జూన్ 30వ తేదీతో ముగిసిన తరుణంలో మెజారిటీ ఆసీస్ క్రికెటర్లంతా నిరుద్యోగులుగా మారిపోయారు. కొంతమంది క్రికెటర్లు మినహా ప్రధాన క్రికెటర్లంతా ఆసీస్ తరపున బరిలోకి దిగే అవకాశాన్ని కోల్పోయారు.ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు తరపున బరిలోకి దిగాలంటే కొత్త కాంట్రాక్ట్ పై ఆటగాళ్లు సంతకాలు చేయాల్సి ఉంది. అయితే దాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఆసీస్ క్రికెటర్లు అందుకు ఒప్పుకోలేదు. ఆ క్రమంలోనే మొత్తం 230 మంది ఆసీస్ క్రికెటర్ల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.
ఇప్పటివరకూ మ్యాచ్ ల ద్వారా వచ్చిన ఆదాయంలో 25 శాతాన్ని సీఏ క్రికెటర్లకు పంచుతూ వచ్చింది. అయితే తాజా ఒప్పందం ప్రకారం సీఏ మిగులు ఆదాయంలోమాత్రమే క్రికెటర్లకు ఇవ్వాలనేది సీఏ యోచన. ఈ మేరకు కొత్త కాంట్రాక్ట్ విధానాన్ని ప్రవేశపెట్టి ఆటగాళ్లకు డెడ్ లైన్ విధించింది.ఒకవేళ ఒప్పందం సంతంకం చేయని పక్షంలో కాంట్రాక్ట్ కోల్పోయి నిరుద్యోగులుగా మారతారంటూ హెచ్చరించింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్ ను కుదిపేస్తున్న ఈ వివాదం ఎంతవరకూ దారి తీస్తుందో చూడాలి.