
కడప స్పోర్ట్స్:
వైఎస్సార్ జిల్లా కడపలోని ఏసీఏ సౌత్‌జోన్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న కల్లూరు రేవంత్‌రెడ్డి సరికొత్త రికార్డు సృష్టించాడు. కడప నగరంలో సెప్టెంబర్ 17 నుంచి ప్రారంభమైన ఏసీఏ అండర్–14 అంతర్ జిల్లాల క్రికెట్ టోర్నమెంట్‌లో రెండు ట్రిపుల్ సెంచరీలు సాధించి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ చరిత్రలోనే రికార్డు నెలకొల్పాడు. ఒకే టోర్నమెంట్‌లో రెండు ట్రిపుల్ సెంచరీలు సాధించిన (అన్ని ఫార్మాట్లలో) ఏకైక క్రికెటర్‌గా రికార్డు నమోదు చేశాడు. నెల్లూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్‌రెడ్డి గతనెల 23వ తేదీన విజయనగరం జట్టుతో జరిగిన పోటీ మ్యాచ్‌లో 304 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
తాజాగా గురువారం పశ్చిమగోదావరి జట్టుపై 289 బంతుల్లో 301 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇప్పటివరకు ఈ టోర్నమెంట్‌లో 5 మ్యాచ్‌లు ఆడగా 95.76 స్ట్రయిక్ రేట్‌తో 746 పరుగులు సాధించడం విశేషం. కాగా రేవంత్‌రెడ్డి 2014 నుంచి కడప నగరంలోని ఏసీఏ సౌత్‌జోన్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. సౌత్‌జోన్ అకాడమీ హెడ్ కోచ్ పి. మధుసూదన్‌రెడ్డి, సహాయ శిక్షకులు శ్రీనివాస్, కిశోర్, ట్రైనర్ ఆనంద్‌కుమార్‌ల నేతృత్వంలో క్రికెట్‌లో చక్కటి ప్రతిభ కనబరుస్తున్నాడు. అతను ప్రస్తుతం కడప నగరంలోని గురుకులం టెక్నో స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. అతనిది నెల్లూరు నగరం బి.వి.నగర్ కాగా ఈయన తండ్రి రామచంద్రారెడ్డి హైదరాబాద్‌లో సివిల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. రేవంత్ ప్రదర్శన పట్ల సౌత్‌జోన్ అకాడమీ చైర్మన్ ఎం.వెంకటశివారెడ్డి, కన్వీనర్ డి. నాగేశ్వరరాజు తదితరులు అభినందనలు తెలిపారు.