– మహిళా క్రికెటర్ల కొరతను అధిగమించేందుకు ఏసీఏ ప్రత్యేక దృష్టి
–రిటైరైన మహిళా క్రికెటర్లకు మహిళా కోచ్‌లు, ఫిజియోథెరపిస్టులు వగైరా అవకాశాలు
– విలేకరులతో సెంట్రల్ జోన్ సెక్రటరీ కోకా రమేష్, ఎన్‌సీఏ లెవల్‌బీ కోచ్ శ్రీనివాసరెడ్డి
ఒంగోలు: ఉత్సాహం ఉంటే మహిళా క్రికెటర్లు అద్భుతాలు సృష్టించే అవకాశం ఉందని, దానిని అందిపుచ్చుకోవాలంటే అందుకు తల్లిదండ్రుల నుంచి సంపూర్ణ సహకారం అవసరమని సెంట్రల్ జోన్ సెక్రటరీ కోకా రమేష్ , నేషనల్ క్రికెట్ అసోసియేషన్ లెవల్ బీకోచ్ ఎస్.శ్రీనివాసరెడ్డిలు తెలిపారు. మంగళవారం వారు సాక్షితో కొద్దిసేపు మహిళా క్రికెటర్లకు ఏసీఏ అందిస్తున్న సహకారం గురించి మాట్లాడారు.
ప్రశ్న: అండర్–10 వయస్సు వారిని కూడా సీనియర్ మహిళా క్రికెట్ జట్టులో ఆడిస్తున్నారు...ఇది సరైనదే అంటారా?
సమాధానం: గుంటూరు జట్టులో మాత్రమే నలుగురు చిన్నారులు ఆడారు. మిగతా వారిలో కూడా ఎక్కువుగా అండర్–16 ఉన్న మాట నిజమే. అయితే తాము ఎంపిక చేసిన నలుగురు చిన్నారులు సీనియర్ మహిళా క్రికెటర్లు వేసే బంతులను సైతం «ధైర్యంగా ఎదుర్కొంటున్నారు.
ప్రశ్న: సీనియర్లను పక్కన బెట్టి మరీ చిన్న పిల్లలను ఆడిస్తే సీనియర్లకు ఇబ్బంది కాదా?
సమాధానం: జట్టులో సీనియర్ల కొరత ఉండడం వల్లే జూనియర్లలో ప్రతిభ ఉన్నవారిని ఎంపిక చేశాం. అంతే తప్ప సీనియర్లను పక్కన బెట్టి జూనియర్లకు అవకాశం కల్పించడం ఎంత మాత్రంకాదు.
ప్రశ్న: క్రికెట్‌లో మహిళా క్రికెటర్ల కొరత ఎక్కువుగా ఉన్నట్లుంది?
సమాధానం: క్రికెట్‌కు ఎక్కువుగా గ్రామీణ ప్రాంతాల నుంచి విద్యార్థినులు వస్తున్నారు. అయితే వీరికి యుక్త వయసు రాగానే వివాహం చేసేందుకు తల్లిదండ్రులు సిద్ధపడుతున్నారు. దీంతో వారు శిక్షణ తీసుకున్నా ఎక్కువ కాలం క్రికెట్‌లో ఆడలేని పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి.
ప్రశ్న: మహిళా క్రికెటర్ల కొరతను అధిగమించేందుకు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు?
సమాధానం: ఏసీఏ కార్యదర్శిగా గోకరాజు గంగరాజు బాధ్యతలు చేపట్టిన తర్వాత మహిళా క్రికెటర్లన ు ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అందులో జోనల్ స్థాయి టీంకు మహిళలు ఎంపికైతే వారికి ఏడాది పాటు నెలకు రూ.2వేలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు. రాష్ట్ర జట్టుకు ఎంపికైతే వారికి నెలకు రూ.4వేలు చొప్పున ఏడాదిపాటు అందిస్తోంది.
ప్రశ్న: ప్రస్తుతం జిల్లాల వారీగా మహిళా క్రికెటర్లు ఎంతమందికి శిక్షణ ఇస్తున్నారు?
సమాధానం: జిల్లాలో 28మంది, గుంటూరు–30, కృష్ణా–35, పశ్చిమ గోదావరి –30 మంది ఉన్నారు. ప్రకాశం జిల్లానే తీసుకుంటే మార్కాపురం జవహర్ నవోదయ విద్యార్థులు ఎక్కువగా ఉంటారు. ప్రస్తుత ప్రకాశం జట్టులో 15మంది సభ్యుల్లో ఏడుగురు మార్కాపురం జవహర్ నవోదయ విద్యార్థులే ఉన్నారు. అంతేగాక ప్రస్తుతం ఆడుతున్న వారిలో ఎక్కువ మంది 13 నుంచి 16 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు ఉన్నారు. మరో రెండు మూడేళ్లకు మంచి జట్టు సిద్ధం అవుతుందిన కచ్చితంగా చెప్పగలం.
ప్రశ్న: మహిళా క్రికెటర్లకు ఏమైనా ప్రత్యేక అవకాశాలు కల్పిస్తున్నారా?
సమాధానం: మహిళా క్రికెటర్లు 20 ఏళ్లు వచ్చేటప్పటికే వివాహం చేస్తుండడం సహజం. ఈ క్రమంలో వారు క్రికెట్‌కు దూరమవుతున్నారు. ఈ కారణంగా వారి సేవలను వినియోగించాలని ఏసీఏ భావించింది. ఈ మేరకే ఇటీవల క్రికెట్ ఆడేందుకు రిటైర్మెంట్ ప్రకటించిన రమాదేవిని పశ్చిమగోదావరి జట్టుకు కోచ్‌గా ఎంపిక చేశాం. జిల్లాలోను సీనియర్ ప్లేయర్ చంద్రికను మార్కాపురం జవహర్ నవోదయలోని పీడీసీఏ సబ్‌సెంటర్‌లో శిక్షణ ఇచ్చేందుకు తీసుకున్నాం.
ప్రశ్న: ఇతర అవకాశాలు ఏమైనా ఉన్నాయా?
సమాధానం: ప్రస్తుతం మహిళా క్రికెట్ జట్టుకు సంబంధించి మహిళల ద్వారానే శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. అందులో భాగంగానే న్యూజిలాండ్‌లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన మారియాఫాహేను ఏసీఏ మహిళా జట్టుకు కోచ్‌గా ఎంపిక చేశాం. ఫిజియోథెరపిస్టు, కోచ్, అంపైర్, వీడియో ఎనలిస్టు తదితరాలకు కూడా సీనియర్ మహిళా క్రికెటర్లు అయి ఉండి అర్హతలు గలవారిని ఎంపిక చేస్తున్నారు. ఈ పోస్టుల్లో అవకాశం దక్కించుకుంటే వారికి ఉండే జీతాలు కూడా భారీగానే ఉంటాయి.
ప్రశ్న: మహిళలకు పాఠశాల స్థాయి క్రికెట్ పోటీలను ఎందుకు ఎంచుకోవడం లేదు?
సమాధానం: పాఠశాల స్థాయిలో మహిళా జట్టు ఉండే అవకాశాలు తక్కువుగా ఉంటాయి. ఈ నేపథ్యంలో కొన్ని పాఠశాలలను కలిపి అయినా ఒక టీంగా చేస్తే బాగుండే అవకాశాలు లేక పోలేదు. ఈ అంశంపై తప్పకుండా ఏసీఏ బోర్డు దృష్టికి తీసుకువెళతాం.
ప్రశ్న: మహిళా క్రికెటర్లకు ఇతర ఉద్యోగ అవకాశాల గురించి..
సమాధానం: మహిళా క్రికెటర్లకు ప్రస్తుతం రైల్వే ద్వారా మంచి అవకాశాలు లభిస్తున్నాయి. ఇటీవలే ప్రకాశం జిల్లాకు చెందిన సుధారాణి రైల్వేలో ఉద్యోగానికి ఎంపికైంది. వైజాగ్‌కు చెందిన స్నేహదీప్తికి కూడా ఉద్యోగం లభించింది. వీరికే గాక ఏసీఏ మహిళా టీంలో ఆడుతున్న మరో ఇద్దరికి కూడా ఉద్యోగాలు ఇచ్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. త్వరలోనే ఉత్వర్వులు వెలువడవచ్చు.