ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)కు సంబంధించిన క్రికెటర్ల మినీ వేలం వచ్చే నెల 15న బెంగళూరులో నిర్వహించనున్నారు. వచ్చే సీజన్ ఫిబ్రవరి–మార్చి నెలలో జరుగుతుంది. ఐదు ఫ్రాంచైజీల మొత్తం బడ్జెట్ రూ. 15 కోట్లు. గత సీజన్ రూ. 13.5 కోట్ల కంటే కొంచెం పెరిగింది.
ఒక్కో ఫ్రాంచైజీ వద్ద తక్కువ మొత్తమే ఉన్నప్పటికీ పలువురు స్టార్ క్రికెటర్లు వేలానికి రానున్నారు. ఇంగ్లండ్ కెప్టెన్ హిథెర్ నైట్, న్యూజిలాండ్ పేసర్ లీ తహుహు, వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డియాండ్ర డాటిన్ తదితర టాప్ స్టార్లు వేలంలో ఉన్నారు.
వీరితో పాటు భారత్‌కు చెందిన స్నేహ్ రాణా, పూనమ్ యాదవ్, వేద కృష్ణమూర్తిలు కూడా వేలంలోకి వచ్చారు. గత రెండు సీజన్లు (2023, 2024)గా రన్నరప్‌తో సరిపెట్టుకుంటున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ చేతిలో అందరికంటే కనిష్టంగా రూ.2.5 కోట్లు మాత్రమే ఉన్నాయి.
గుజరాత్ జెయింట్స్ చేతిలో గరిష్టంగా రూ. 4.4 కోట్లు అందుబాటులో ఉన్నాయి. డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) వద్ద రూ. 3.25 కోట్లున్నాయి. వేలానికి ముందు ఫ్రాంచైజీల మధ్య జరిగే బదిలీలకు సంబంధించిన గడువు ఈ నెలలో ముగియగా... ఒక్క డ్యానీ వ్యాట్ (ఇంగ్లండ్) బదిలీ జరిగింది. యూపీ వారియర్స్ నుంచి ఆర్‌సీబీ ఆమెను కొనుక్కుంది.
Comments
Please login to add a commentAdd a comment