కౌలాలంపూర్:మహిళల ఆసియా కప్‌లో భాగంగా మలేసియాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా భారీ విజయం సాధించింది. ఆదివారం ఇక్కడ కిన్‌రారా అకాడమీ ఓవల్ మైదానంలో ఆతిథ్య మలేసియాతో జరిగిన టీ20లో భారత మహిళలు 142 పరుగుల తేడాతో గెలుపొందారు. తొలుత బ్యాటింగ్ చేసిన హర్మన్ ప్రీత్ కౌర్ గ్యాంగ్ నిర్ణీతో 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతీ మంధాన(2) నిరాశపరిచినా, మరో ఓపెనర్ మిథాలీ రాజ్(97 నాటౌట్; 69 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్సర్) ధాటిగా బ్యాటింగ్ చేశారు. ఇక హర్మన్‌ప్రీత్ కౌర్(32; 23 బంతుల్లో 4 ఫోర్లు), దీప్తి శర్మ(18 నాటౌట్;12 బంతుల్లో 2ఫోర్లు)లు బ్యాట్ ఝుళిపించడంతో భారత జట్టు 170 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మలేసియా జట్టు 13.4 ఓవర్లలో 27 పరుగులకే చాపచుట్టేసింది. భారత మహిళలు చెలరేగి బౌలింగ్ చేయడంతో మలేసియా ఏ దశలోనూ కనీస పోటీ ఇవ్వలేకుండా వరుస వికెట్లను చేజార్చుకుని ఘోర ఓటమిని చవిచూసింది. భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్ మూడు వికెట్లతో రాణించగా, అనుజా పటేల్, పూనమ్ యాదవ్ తలో రెండు వికెట్లతో మెరిశారు. శిఖా పాండేకు వికెట్‌కు వికెట్ దక్కింది. మలేసియా మహిళల్లో సషా ఆజ్మీ(9)దే అత్యధిక వ్యక్తిగత స్కోరు కాగా, ఆరుగురు డకౌట్లగా నిష్క్రమించారు.
Comments
Please login to add a commentAdd a comment