womens cricket team
-
భారత ‘ఎ’ జట్టులో షబ్నమ్, యశశ్రీ
ముంబై: వచ్చే నెలలో ఆ్రస్టేలియాలో ఆ్రస్టేలియా ‘ఎ’ మహిళల క్రికెట్ జట్టుతో సిరీస్‌లో పాల్గొనే భారత ‘ఎ’ జట్టును ప్రకటించారు. 18 మంది సభ్యులతో కూడిన భారత ‘ఎ’ జట్టుకు కేరళకు చెందిన ఆఫ్ స్పిన్నర్ మిన్ను మణి కెప్టెన్ గా వ్యవహరిస్తుంది. ఆంధ్రప్రదేశ్ పేస్ బౌలర్ షబ్నమ్ షకీల్, హైదరాబాద్ అమ్మాయి సొప్పదండి యశశ్రీలకు కూడా భారత ‘ఎ’ జట్టులో చోటు లభించింది. ఆగస్టు 7 నుంచి 25 వరకు జరిగే ఈ సిరీస్‌లో ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టుతో టీమిండియా మూడు టి20లు, మూడు వన్డేలు, ఒక నాలుగు రోజుల మ్యాచ్ ఆడుతుంది. భారత ‘ఎ’ జట్టు: మిన్న మణి (కెప్టెన్ ), శ్వేత సెహ్రావత్ (వైస్ కెప్టెన్ ), ప్రియా పూనియా, శుభ సతీశ్, తేజల్ హసబీ్నస్, కిరణ్ నవ్‌గిరే, సజన, ఉమా చెత్రి, శిప్రా గిరి, రాఘవి బిష్త్, సైకా ఇషాక్, మన్నత్ కశ్యప్, తనుజా కన్వర్, ప్రియా మిశ్రా, మేఘన సింగ్, సయాలీ సట్గరే, షబ్నమ్ షకీల్, యశశ్రీ. -
భారత మహిళల క్రికెట్ జట్టులో షబ్నమ్
విశాఖ స్పోర్ట్స్: దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరుగుతున్న క్రికెట్ సిరీస్‌లో పాల్గొంటున్న భారత జట్టులో అదనంగా మరో ప్లేయర్‌ను చేర్చారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 17 ఏళ్ల మీడియం పేస్ బౌలర్ షబ్నమ్ షకీల్‌ను తొలిసారి భారత సీనియర్ జట్టులోకి ఎంపిక చేశారు. మూడు ఫార్మాట్లలోని (వన్డే, టెస్టు, టి20) టీమిండియాలో షబ్నమ్‌కు చోటు దక్కడం విశేషం.విశాఖపట్నంకు చెందిన షబ్నమ్ గత ఏడాది జనవరిలో జరిగిన అండర్–19 మహిళల టి20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టులో సభ్యురాలిగా ఉంది. ఈ ఏడాది మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) గుజరాత్ జెయింట్స్ తరఫున నాలుగు మ్యాచ్‌లు ఆడిన షబ్నమ్ నాలుగు వికెట్లు పడగొట్టింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టుతో జరుగుతున్న సిరీస్‌లో బెంగళూరు వేదికగా జరిగిన తొలి రెండు వన్డేల్లో భారత జట్టు గెలిచింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. ఈ రెండు జట్ల మధ్య చివరిదైన మూడో వన్డే ఆదివారం బెంగళూరులోనే జరుగుతుంది. -
న్యూజిలాండ్‌పై పాక్ తొలిసారి సిరీస్ సొంతం
సమష్టి ప్రదర్శనతో పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టు తొలిసారి న్యూజిలాండ్ జట్టుపై టి20 సిరీస్‌ను సొంతం చేసుకుంది. డ్యూనెడిన్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో పాక్ పది పరుగులతో నెగ్గి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–0తో దక్కించుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అలియా రియాజ్ (32 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), మునీబా అలీ (35; 6 ఫోర్లు) రాణించడంతో... పాక్ 6 వికెట్లకు 137 పరుగులు చేసింది. అనంతరం న్యూజిలాండ్ 7 వికెట్లకు 127 పరుగులకే పరిమితమైంది. -
India vs Sri Lanka Womens 2nd T20: భారత్‌దే సిరీస్
దంబుల్లా: సమష్టి ఆటతీరుతో రాణించిన భారత మహిళల క్రికెట్ జట్టు శ్రీలంకతో జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో ఐదు వికెట్లతో గెలిచింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 125 పరుగులు సాధించింది. ఓపెనర్లు విష్మి గుణరత్నే (45; 6 ఫోర్లు), చమరి ఆటపట్టు (43; 7 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్‌కు 13.5 ఓవర్లలో 87 పరుగులు జోడించారు. పూజా వస్త్రకర్ బౌలింగ్‌లో ఆటపట్టు అవుటయ్యాక లంక పతనం మొదలైంది. చివరి ఆరు ఓవర్లలో లంక 38 పరుగులు చేసి ఆరు వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ రెండు వికెట్లు తీయగా... కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, రేణుక సింగ్, రాధా యాదవ్, పూజా వస్త్రకర్ ఒక్కో వికెట్ పడగొట్టారు. అనంతరం భారత్ 19.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసి గెలిచింది. స్మృతి మంధాన (34 బంతుల్లో 39; 8 ఫోర్లు), షఫాలీ వర్మ (10 బంతుల్లో 17; 2 ఫోర్లు, 1 సిక్స్), సబ్బినేని మేఘన (10 బంతుల్లో 17; 4 ఫోర్లు) దూకుడుగా ఆడారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హర్మన్‌ప్రీత్ కౌర్ (32 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు) చివరిదాకా నిలిచి భారత్‌ను విజయతీరానికి చేర్చింది. చివరిదైన మూడో టి20 సోమవారం జరుగుతుంది. -
‘శభాష్’ అనిపించుకోగలిగాను!
2005... మెదక్ పట్టణంలో ఒక చిన్నస్థాయి క్రికెట్ టోర్నీ... అమ్మాయిలు క్రికెట్ ఆడటమే అరుదు అనుకుంటే కొందరు స్థానికుల చొరవతో టోర్నమెంట్ కూడా జరుగుతోంది. ఒక మ్యాచ్‌లో సరిగా చూస్తే మిథాలీ రాజ్ బ్యాటింగ్ చేస్తోంది. ఆమె భారత క్రికెట్ జట్టు తరఫున ఆడటం మొదలు పెట్టి అప్పటికే ఆరేళ్లు దాటింది... కానీ అక్కడ బరిలోకి దిగడానికి ఆమె సంకోచించలేదు... ఇలాంటి అంకితభావమే ఆమెను గొప్పగా తీర్చిదిద్దింది. ఆటపై ఉన్న అభిమానమే ఏకంగా 23 ఏళ్లు దేశం తరఫున ఆడేలా చేసింది. ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన మిథాలీ రాజ్ ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన పలు విశేషాలు... బయోపిక్... బయోగ్రఫీ... రిటైర్మెంట్ తర్వాతి కెరీర్‌పై కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. నాకు తెలిసిన విద్య క్రికెట్ మాత్రమే కాబట్టి ఆటకు సంబంధించిందే అవుతుంది. ప్రస్తుతం నా బయోపిక్ ‘శభాష్ మిథూ’ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నాను. నా బాల్యం నుంచి పెద్ద స్థాయికి ఎదిగే వరకు వేర్వేరు అంశాలతో సినిమా ఉంటుంది. అయితే ఎక్కడితో సినిమాను ముగిస్తున్నామో ఇప్పుడే చెప్పను. తాప్సీ చక్కటి నటి కావడంతో పాటు మహిళా ప్రధాన చిత్రాలు కూడా కొన్ని చేసింది కాబట్టి బయోపిక్ కోసం ఆమెను సరైన వ్యక్తిగా అనుకున్నాం. దీంతో పాటు నా ఆటోబయోగ్రఫీ పని కూడా నడుస్తోంది. త్వరలోనే పుస్తకం విడుదలవుతుంది. లోటుగా భావించడం లేదు ప్రపంచకప్ గెలవాలనేది నా కల. ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పాను కూడా. అయితే చివరకు అది లేకుండానే కెరీర్ ముగిసింది. కానీ అది లేనంత మాత్రాన నా ఇన్నేళ్ల ప్రదర్శన విలువ తగ్గదు. భారత పురుషుల క్రికెట్లోనూ చూస్తే ప్రపంచకప్ గెలిచిన టీమ్‌లో భాగం కాకపోయినా, క్రికెట్ చరిత్రలో గొప్ప ఆటగాళ్లుగా నిలిచినవారు ఎంతో మంది ఉన్నారు. రెండు ప్రపంచకప్‌లలో జట్టును ఫైనల్‌కు చేర్చడం కూడా చెప్పుకోదగ్గ ఘనతే కాబట్టి విచారం ఏమీ లేదు. సుదీర్ఘ కెరీర్‌కు అదే కారణం చాలా ఎక్కువగా కష్టపడే తత్వమే నన్ను ఈ స్థాయికి చేర్చింది. నిలకడగా, మార్పు లేకుండా ఇన్నేళ్ల పాటు ఒకే తరహా ‘టైమ్ టేబుల్’ను అమలు చేశాను. అత్యుత్తమంగా ఎదిగేందుకు సన్నద్ధత, ప్రతీ రోజూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడం, ఆటకు మెరుగులు దిద్దుకోవడం, అదే ప్రాక్టీస్, అదే డ్రిల్స్‌ను ఏకాగ్రత చెదరకుండా 23 ఏళ్ల పాటు కొనసాగించగలిగాను. రోజూ ఇదేనా అనే భావన లేకుండా మైదానంలోకి వచ్చేదాన్ని. నా సాధన నాకు ఎప్పుడూ బోర్ కొట్టలేదు. అందుకే ఇలాంటి కెరీర్ సాధ్యమైంది. సమాజంలో కొందరు నేను క్రికెట్ ఆడటంపై కామెంట్లు చేసినా... మైదానంలో మాత్రం ఎప్పుడూ, ఎలాంటి వివక్ష ఎదుర్కోలేదు. అలా అనుకోలేదు ఎన్నో గంటల ప్రాక్టీస్ తర్వాత కూడా ఆడింది చాలు, కొంత విరామం తీసుకుందాం, కొంచెం విశ్రాంతిగా కూర్చుందాం అనే ఆలోచన రాలేదు. చాలా ఎక్కువగా కష్టపడుతున్నాను కదా, ఇంత అవసరమా అనుకోలేదు. సరిగ్గా చెప్పాలంటే నాపై నేను ఎప్పుడూ జాలి పడలేదు. 23 ఏళ్ల కెరీర్లో నేను గాయాలపాలైంది కూడా చాలా తక్కువ. అప్పుడప్పుడు గాయపడినా సిరీస్ మొత్తానికో, ఒక టోర్నీకో ఎప్పుడూ దూరం కాలేదు. రక్తం కారినప్పుడు కూడా బయటకు వెళ్లాలనే భావన రాలేదు. నొప్పి, బాధను భరిస్తూనే ఆడేందుకు ప్రయత్నించా. ఆట ముగిసిన తర్వాతే కోలుకోవడంపై దృష్టి పెట్టా. ఇన్నేళ్ళలో ఇది కూడా నన్ను ప్రత్యేకంగా నిలబెట్టింది. ఒక్క 2009లో మాత్రమే మోకాలి గాయంతో చాలా బాధపడ్డా. రిటైర్మెంట్ ఇద్దామని అనుకున్న క్షణమది. అయితే అదృష్టవశాత్తూ కొన్నాళ్ల క్రితమే అధికారికంగా బీసీసీఐలోకి రావడంతో జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) సౌకర్యాలను తొలిసారి ఉపయోగించుకునే అవకాశం కలిగి కోలుకోగలిగాను. అన్ని చోట్లా ఆడాను కెరీర్ ఆరంభంలో బీసీసీఐ సహకారం లేని సమయంలో ఆర్థికపరంగా మేం ఎదుర్కొన్న సమస్యలు, వాటిని పట్టించుకోకుండా ఆడటం గురించి అందరికీ తెలుసు. అయితే మరో అంశం గురించి నేను చెప్పాలి. క్రికెట్‌పై ఆ సమయంలో నాకున్న అపరిమిత ప్రేమ, పిచ్చి ఎక్కడికైనా వెళ్లేలా చేసింది. భారత్ తరఫున అరంగేట్రం చేసి ఆరేళ్లు దాటిన తర్వాత కూడా నేను ‘ఇన్విటేషన్ టోర్నమెంట్’లకు వెళ్లడం మానలేదు. చిన్న పట్టణాల్లో, హైస్కూల్ మైదానాల్లో జరిగిన మ్యాచ్‌లలో కూడా పాల్గొన్నాను. టర్ఫ్ వికెట్, మ్యాట్ వికెట్ ఏదైనా సరే... ఆడే అవకాశం వస్తే చాలని అనిపించేది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే కాస్త ఆశ్చర్యంగా అనిపించినా, మంచి జ్ఞాపకాలవి. టి20లు కలిసి రాలేదు నేను అంతర్జాతీయ క్రికెట్ మొదలు పెట్టినప్పుడు టి20లు లేవు. మహిళల క్రికెట్లోనూ టెస్టులు ఉండి ఉంటే దాంతో పాటు వన్డేలను ఎంచుకొని అసలు టి20 ఆడకపోయేదాన్నేమో. కానీ టెస్టులు లేకపోవడంతో రెండో ఫార్మాట్ అవసరం ఏర్పడింది. నేను మూడో టి20 ఆడే సమయానికే నా అంతర్జాతీయ కెరీర్ పదేళ్లు పూర్తి చేసుకుంది. ఇంత ఆలస్యంగా మొదలు పెట్టడంతో నేను సర్దుకోవడానికే టైమ్ పట్టింది. ఓపెనర్‌గా వచ్చే సాహసం చేశాక పరిస్థితి కొంత మెరుగుపడింది. అయితే ఆశించినంత స్థాయిలో ఫలితాలు రాలేదు. కోచ్ రమేశ్ పొవార్‌తో వివాదంతో నా కెరీర్ ముగియలేదు. ఆ తర్వాతా రెండు సిరీస్‌లు ఆడి ఇక చాలనుకున్నాను. అందుకే రిటైర్మెంట్ ప్రకటించాను. ప్రస్తుత క్రికెటర్లతో పోల్చరాదు వాణిజ్యపరంగా నాకు ఆశించినంత గుర్తింపు రాలేదనేది వాస్తవం. వాస్తవికంగా చూస్తే సగంకంటే ఎక్కువ కెరీర్ నన్ను ఎక్కువ మంది కనీసం గుర్తు కూడా పట్టని విధంగానే సాగింది. అలాంటప్పుడు కార్పొరేట్లు ఎలా ముందుకొస్తాయి. సరిగా గమనిస్తే 2017 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ తర్వాతి నుంచి భారత మహిళల ప్రతీ మ్యాచ్ టీవీలో లైవ్‌గా వచ్చింది. అంతకుముందు అసలు టీవీల్లో కూడా కనిపిస్తే కదా! స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్‌లతో పోలిస్తే నా ప్రయాణం పూర్తిగా భిన్నం. వీరితో పోలిస్తే ఇప్పుడే వచ్చిన షఫాలీ, రిచాలు కూడా భిన్నం. కాబట్టి పోలిక అనవసరం. భారత మహిళల క్రికెట్ ఎదుగుదలలో నేనూ కీలక భాగం కావడమే అన్నింటికంటే ఎక్కువ సంతృప్తినిచ్చే అంశం. -
అంధుల క్రికెట్ కాంతిరేఖ
తెనాలి: బెంగళూరులో ఈనెల 28 నుంచి జరగనున్న జాతీయ అంధ మహిళల క్రికెట్ టోర్నమెంటులో ఆంధ్రప్రదేశ్ జట్టు తొలిసారిగా ప్రాతినిథ్యం వహించనుంది. గుంటూరు జిల్లాకు చెందిన తాహెరా ట్రస్ట్ దీనికి మార్గం సుగమం చేసింది. తొలి విమెన్స్ నేషనల్ క్రికెట్ టోర్నమెంట్ ఫర్ బ్లైండ్–2019 ఢిల్లీలో జరిగింది. టీ–20 ఫార్మట్‌లో జరిగిన ఈ టోర్నీలో వివిధ జిల్లాల నుంచి క్రీడాకారుల ప్రాతినిథ్యం ఉన్నా, ఆంధ్రప్రదేశ్ నుంచి జట్టు పాల్గొనలేదు. ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఫర్ బ్లైండ్ (సీఏబీఏపీ)కి నిధుల కొరత, స్పాన్సర్లు లేకపోవడమే దీనికి కారణం. ఇప్పటికే మెన్ బ్లైండ్ క్రికెట్లో ఏపీ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్లలో పాల్గొంటున్నారు. ఇండియా జట్టు వరల్డ్ కప్‌నూ సాధించింది. ముందుకొచ్చిన జహరాబేగం అంధ మహిళల విభాగంలో క్రికెట్ పోటీల ఆరంభంతో గత రెండేళ్లుగా సాధన చేసేవారి సంఖ్య పెరిగింది. అయినా మహిళల జట్టు ఎంపిక లేక నిరాశలో ఉన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన తాహెరా ట్రస్ట్ వ్యవస్థాపకురాలు, ఎన్నారై జహరాబేగంకు క్రీడాకారులు సమాచారం పంపారు. గతంలో బ్లైండ్ మెన్ వరల్డ్ కప్ టోర్నమెంటులో హైదరాబాద్, మూలపాడుల్లో జరిగిన రెండు మ్యాచ్‌లకు తాహెరా ట్రస్ట్ స్పాన్సర్ చేసింది. గతేడాది జాతీయ పోటీల్లో పాల్గొన్న ఏపీ మెన్ బ్లైండ్ టీమ్‌కు స్పాన్సర్‌గానూ వ్యవహరించింది. ఈ క్రమంలో ఏపీ నుంచి అంధ మహిళల జట్టును జాతీయ పోటీలకు పంపేందుకు తోడ్పడాలని క్రీడాకారుల నుంచి వచ్చిన వినతులను జహరాబేగం పరిగణనలోకి తీసుకున్నారు. ఏపీ జట్టుకు స్పాన్సర్ చేయాలని నిర్ణయించుకున్నారు. సీఏబీఏపీ చురుగ్గా ఏర్పాట్లు తాహెరా ట్రస్ట్ గ్రీన్ సిగ్నల్‌తో ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఫర్ బ్లైండ్ (సీఏబీఏపీ) చురుగ్గా ఏర్పాట్లు చేసింది. అనంతపురంలోని పోలీస్ ట్రైనింగ్ గ్రౌండ్లో క్రీడాకారులకు సన్నాహక శిబిరం చేపట్టింది. ఈనెల 15 నుంచి ఇది ప్రారంభమైంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 35 మంది క్రీడాకారులు ఈ శిబిరంలో పాల్గొన్నారు. జహరా బేగం సన్నాహక శిబిరానికి హాజరై, క్రీడాకారిణులకు వసతి, భోజనం, యూనిఫాం, కిట్‌ను సమకూర్చారు. వీరి నుంచి 14 మంది జట్టును ఈనెల 17న ఎంపిక చేశారు. మళ్లీ వీరికి పూర్తిస్థాయి శిక్షణ నడుస్తోంది. క్రికెట్ అసోసియేషన్ ఫర్ బ్లైండ్ ఇన్ ఇండియా కార్యదర్శి, ఏపీ అధ్యక్షుడు జాన్ డేవిడ్ నేతృత్వంలో జాతీయ క్రీడాకారుడు జి.వెంకటేష్ వీరికి శిక్షణనిస్తున్నారు. రాయలసీమ కో–ఆర్డినేటర్ ఫర్ బ్లైండ్ వెంకటనారాయణ పర్యవేక్షిస్తున్నారు. త్వరలో సీఎం వద్దకు.. అంధ క్రీడాకారుల్లో క్రీడాపరంగా అపూర్వమైన సామర్థ్యం ఉందని జహరాబేగం చెప్పారు. క్రికెట్ సాధనకు క్రీడాకారులకు తగిన ఆటస్థలం, వసతిగృహం అవసరం ఉందని పేర్కొన్నారు. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని త్వరలోనే కలవనున్నట్టు చెప్పారు. క్రీడాకారుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నట్టు వివరించారు. -
న్యూజిలాండ్‌తో ఏకైక టీ20.. భారత జట్టు ఓటమి
క్వీన్స్టౌన్ వేదికగా జరిగిన ఏకైక టీ20లో భారత్‌పై న్యూజిలాండ్ మహిళల జట్టు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో వికెట్లు కోల్పోయి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బ్యాటర్లలో సబ్భినేని మేఘన(37), యస్తికా భాటియా(26) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. న్యూజిలాండ్ బౌలర్లలో జెస్ కేర్, అమేలియా కెర్, జాన్సన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 155 పరుగులు సాధించింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో సుజీ బేట్స్(36), డివైన్( 31) పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఈ మ్యాచ్‌కు బారత జట్టు సీనియర్ ఓపెనర్ స్మృతి మంధాన దూరమైంది. ఇక న్యూజిలాండ్‌తో భారత మహిళల జట్టు 5 వన్డేల సిరీస్ ఆడనుంది. ఇరు జట్లు మధ్య తొలి వన్డే శనివారం జరగనుంది. చదవండి: MS Dhoni Gym Video: అదీ ధోని భాయ్ అంటే.. ఎంతో ఓపికగా జిమ్‌లో.. వీడియో వైరల్ -
పాక్ జట్టులో కరోనా కలకలం..ముగ్గురికి పాజిటివ్‌గా నిర్ధారణ
Three Pakistan Women Cricketers Tested For Covid Positive: పాకిస్థాన్ మహిళా క్రికెట్ జట్టులో కరోనా కలకలం రేపింది. జట్టులోని ముగ్గురు క్రికెటర్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు గురువారం వెల్లడించింది. స్వదేశంలో విండీస్‌తో జరగనున్న వన్డే సిరీస్ కోసం ఏర్పాటు చేసిన సన్నాహక శిబిరంలో జట్టు సభ్యులుండగా రొటీన్ చెకప్‌లో భాగంగా జరిపిన పరీక్షల్లో విషయం వెలుగు చూసినట్లు పేర్కొంది. అయితే, కోవిడ్ బారిన పడిన ఆటగాళ్ల వివరాలను మాత్రం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) వెల్లడించలేదు. బాధితులను 10 రోజుల క్వారంటైన్‌కు తరలించామని.. మిగతా జట్టు సభ్యులను వారి నుంచి వేరుగా ఉంచామని తెలిపింది. కాగా, పాక్ మహిళా జట్టు కరాచీ వేదికగా నవంబర్ 8, 11, 14 తేదీల్లో విండీస్‌తో మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. ప్రస్తుతం పాక్ జట్టులో కరోనా కలకలం రేగడంతో ఈ సిరీస్‌పై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. చదవండి: బీసీసీఐ బాస్ కీలక నిర్ణయం.. 'ఆ పదవికి' రాజీనామా -
ఏడాది దాటిపోయింది.. ఇంతవరకు ప్రైజ్‌మనీ చెల్లించలేదు
ముంబై: టీమిండియా మహిళల జట్టుపై బీసీసీఐ వివక్ష చూపించిందంటూ వారం క్రితం సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌కు పర్యటనకు టీమిండియా పురుషులు జట్టు, మహిళల జట్టు ఏకకాలంలో బయల్దేరాల్సి ఉంది. అయితే ఇరు జట్లు ఒకే ఫ్లైట్‌లో వెళ్లరని.. మహిళల జట్టుకోసం మరో చార్టడ్ ఫ్లైట్ సిద్ధం చేసినట్లు తెలిపింది. ఇక కరోనా టెస్టుల విషయంలోనూ వివక్ష చూపించినట్లు వార్తలు వచ్చాయి. అయితే వీటన్నింటిని ఖండించిన బీసీసీఐ మహిళల జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్, హర్మన్ ప్రీత్ లాంటి సీనియర్ క్రికెటర్లతో మాట్లాడించింది. బీసీసీఐ మాపై ఎలాంటి వివక్ష చూపించలేదని.. మాకు చార్టడ్ ఫ్లైట్ ఏర్పాటు చేసిందంటూ చెప్పుకొచ్చారు. తాజాగా జీతాల చెల్లింపు విషయంలో బీసీసీఐ మరోసారి వివక్ష చూపిస్తుందంటూ కొత్త అంశం తెరమీదకు వచ్చింది. పురుషుల జట్టులో ఆటగాళ్లకు చెల్లించే వేతనంలో 10 శాతం కూడా మహిళా క్రికెటర్లకు చెల్లించలేదని సమాచారం. విషయంలోకి వెళితే.. 2020లో ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓడిన ఇండియా రన్నరప్‌తో సరిపెట్టుకుంది. మెగా టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన భారత మహిళల జట్టుకు ఐసీసీ 5లక్షల డాలర్లు( భారత కరెన్సీలో రూ.36 కోట్లు) ప్రైజ్‌మనీ ఇచ్చింది. అయితే ఇంతవరకు బీసీసీఐ ఆ ప్రైజ్‌మనీని మహిళా క్రికెటర్లకు డిస్ట్రిబ్యూట్ చేయలేదని సమాచారం. టీ 20 ప్రపంచకప్‌లో పాల్గొన్న 15 మంది జట్టులో ఒక్కో ప్లేయర్‌కి 33వేల డాలర్లు అందుతుంది( ఇండియన్ కరెన్సీలో రూ. 24లక్షలు). దీనివల్ల మహిళ క్రికెటర్లు ఇబ్బందులు పడుతున్నారు. అదే పురుష క్రికెటర్లు ఒక సిరీస్ ఆడిన వారానికే వారి ఖాతాల్లో డబ్బులు వచ్చి చేరతాయి.. కానీ మహిళల జట్టు విషయానికి వచ్చే సరికి పరిస్థితి మారిపోతుంది. ఇదే విషయమై ఫిమేల్ క్రికెట్ ఫెడరేషన్ సభ్యులు స్పందించారు. ''బీసీసీఐకి పురుష క్రికెటర్లపై ఉన్న ప్రేమ మహిళల క్రికెటర్లపై ఎందుకు లేదు. ఏడాది క్రితం ఐసీసీ ఇచ్చిన ప్రైజ్‌మనీని ఇప్పటివరకు ఆటగాళ్లకు చెల్లించలేదు. దీనికి వివక్ష అనకుండా ఇంకేం అంటారో మీరే చెప్పిండి. సమయానికి ఆ డబ్బు అందించి ఉంటే కరోనా, లాక్డౌన్ సమయాల్లో వారికి ఎంతగానో ఉపయోగపడేవి. కాగా ఈ వార్తలపై బీసీసీఐ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. చదవండి: షూస్ కొనే స్థోమత లేదు సాయం చేయండి: క్రికెటర్ ఆవేదన కోహ్లి పెద్ద మనసు.. మాజీ క్రికెటర్ తల్లికి సాయం టీమిండియా మహిళా క్రికెటర్లపై బీసీసీఐ వివక్ష! -
టాప్–6లో నిలిచే జట్లు, ఇంగ్లండ్ నేరుగా అర్హత
దుబాయ్: ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారిగా సందడి చేయనున్న మహిళల క్రికెట్‌కు సంబంధించిన క్వాలిఫయింగ్ ప్రక్రియ వివరాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ), కామన్వెల్త్ గేమ్స్ సమాఖ్య (సీజీఎఫ్) విడుదల చేశాయి. దీని ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ వరకు ఐసీసీ మహిళల టి20 టీమ్ ర్యాంకింగ్స్‌లో తొలి ఆరు స్థానాల్లో ఉన్న జట్లతో పాటు.... ఆతిథ్య దేశమైన ఇంగ్లండ్ నేరుగా ఈ పోటీలకు అర్హత సాధించనుంది. ప్రస్తుతం భారత మహిళల జట్టు మూడో ర్యాంక్‌లో ఉంది. చివరిదైన ఎనిమిదో బెర్త్‌ను ‘కామన్వెల్త్ గేమ్స్ క్వాలిఫయర్ టోర్నీ’లో విజేత జట్టుతో భర్తీ చేస్తారు. 2022లో ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు కామన్వెల్త్ గేమ్స్ జరగనున్నాయి. ఓవరాల్‌గా కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్ పోటీలు భాగస్వామ్యం కావడం ఇది రెండో సారి మాత్రమే. 1998 కౌలాలంపూర్ క్రీడల్లో తొలిసారిగా పురుషుల క్రికెట్‌కు ఈ అవకాశం దక్కింది. అజయ్ జడేజా సారథ్యంలో ఈ క్రీడల్లో పాల్గొన్న భారత జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. -
ఇంగ్లండ్ మహిళలకు నాలుగో విజయం
డెర్బీ: ఇప్పటికే సిరీస్ సొంతం చేసుకున్న ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టు వెస్టిండీస్‌తో టి20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసేందుకు విజయం దూరంలో ఉంది. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన నాలుగో టి20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ 44 పరుగుల ఆధిక్యంతో గెలిచి సిరీస్‌లో 4–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు సాధించింది. అమీ జోన్స్ (37 బంతుల్లో 55; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), హీథర్‌నైట్ (30 బంతుల్లో 42; 5 ఫోర్లు, సిక్స్) దూకుడుగా ఆడారు. విండీస్ బౌలర్లలో ఆలియా అలెన్ రెండు వికెట్లు తీసింది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 122 పరుగులు చేసి ఓడిపోయింది. షెడిన్ నేషన్ (25 బంతుల్లో 30; 4 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఇంగ్లండ్ బౌలర్లలో కేథరిన్ బ్రంట్, సారా గ్లెన్ రెండేసి వికెట్లు తీశారు. సిరీస్‌లో చివరిదైన ఐదో టి20 మ్యాచ్ నేడు జరుగుతుంది. -
ఆసీస్‌దే టి20 సిరీస్
బ్రిస్బేన్: పొదుపైన బౌలింగ్, అద్భుత బ్యాటింగ్, రికార్డు వికెట్ కీపింగ్ నైపుణ్యాలతో ఆస్ట్రేలియా మహిళల జట్టు మ్యాచ్‌తో పాటు సిరీస్ విజయాన్ని సాధించింది. న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా 2–0తో సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో ఆసీస్ 8 వికెట్ల తేడాతో నెగ్గింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ 19.2 ఓవర్లలో 128 పరుగులకు ఆలౌటైంది. ఆమీ శాటర్‌వైట్ (30; 5 ఫోర్లు) రాణించింది. ఈ మ్యాచ్‌లో శాటర్వైట్ను స్టంపౌట్ చేయడం ద్వారా ఆసీస్ వికెట్ కీపర్ అలీసా హీలీ... టి20 ఫార్మాట్లో అత్యధిక వికెట్లలో పాలుపంచుకున్న వికెట్ కీపర్ల జాబితాలో భారత మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ధోని (97 ఇన్నింగ్స్‌లో 91)తో సమానంగా నిలిచింది. అనంతరం లారెన్ డౌన్ (12) క్యాచ్ తీసుకొని ధోనిని అధిగమించింది. 129 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 16.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అలీసా హీలీ (17 బంతుల్లో 33; 5 ఫోర్లు, 1 సిక్స్), రాచెల్ (40; 5 ఫోర్లు) సత్తా చాటారు. -
ఇంగ్లండ్ మహిళల జోరు
డెర్బీ: వెస్టిండీస్ మహిళలతో జరుగుతోన్న ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ మహిళల జట్టు ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. బుధవారం అర్ధరాత్రి ముగిసిన రెండో టి20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ 47 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. సారా గ్లెన్ (26; 4 ఫోర్లు), ఆమీ జోన్స్ (25; 1 ఫోర్, 1 సిక్స్), టామ్సిన్ బ్యూమోంట్ (21; 4 ఫోర్లు) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో షకీరా సెల్మన్, స్టెఫానీ టేలర్ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం సాధారణ లక్ష్యఛేదనలో వెస్టిండీస్ తడబడింది. బౌలర్లు సోఫీ ఎకెల్‌స్టోన్ (2/19), సారా గ్లెన్ (2/24), మ్యాడీ విలియర్స్ (2/10) కట్టుదిట్టంగా బంతులేయడంతో వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 104 పరుగులే చేసి పరాజయం పాలైంది. డాటిన్ (40 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ స్టెఫానీ టేలర్ (31 బంతుల్లో 28; 4 ఫోర్లు) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. ఇరు జట్ల మధ్య మూడో టి20 మ్యాచ్ శనివారం జరుగనుంది. ఆరు నెలల తర్వాత ఈ రెండు జట్ల మధ్య టి20 సిరీస్‌తో అంతర్జాతీయ మహిళల క్రికెట్ పునః ప్రారంభమైంది. -
ఇంగ్లండ్ మహిళలదే తొలి టి20
డెర్బీ: ఆరు నెలల తర్వాత ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్ల మధ్య టి20 సిరీస్‌తో అంతర్జాతీయ మహిళల క్రికెట్ పునః ప్రారంభమైంది. ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు 47 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 163 పరుగులు చేసింది. టామ్సిన్ బ్యూమోంట్ (49 బంతుల్లో 62; 9 ఫోర్లు, సిక్స్) అర్ధ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. విండీస్ బౌలర్లలో షకీరా కసాండ్రా మూడు వికెట్లు తీయగా... హేలీ మాథ్యూస్, స్టెఫానీ టేలర్ రెండేసి వికెట్లు పడగొట్టారు. 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 116 పరుగులు చేసి ఓడిపోయింది. విండీస్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ డీండ్రా డాటిన్ (59 బంతుల్లో 69; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) మినహా మిగతా వారెవరూ రెండంకెల స్కోరు చేరకపోవడం గమనార్హం. -
అమ్మాయిలు ఇంగ్లండ్‌కు వెళ్లరు
లండన్: భారత మహిళల క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం జూన్ 25 నుంచి ఇంగ్లండ్ మహిళల జట్టుతో నాలుగు వన్డేలు, రెండు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ల్లో భారత్ తలపడాల్సి ఉంది. కరోనా వైరస్ నేపథ్యంలో తమ దేశంలో అన్ని స్థాయిల్లోని ప్రొఫెషనల్ క్రికెట్‌ను జూలై 1 వరకు వాయిదా వేస్తున్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) శుక్రవారం ప్రకటించింది. దీంతో అక్కడ భారత పర్యటన వాయిదా పడింది. దేశవాళీ క్రికెట్ సీజన్లోనూ తొమ్మిది రౌండ్ల మ్యాచ్‌ల్ని కోల్పోతున్నట్లు ఈసీబీ తెలిపింది. ‘ఈ వేసవిలో కొంత వరకైనా క్రికెట్ కార్యకలాపాల్ని నిర్వహించగలమని మేం నమ్ముతున్నాం. వాయిదా పడిన అంతర్జాతీయ టోర్నీలను రీ షెడ్యూల్ చేసి మళ్లీ నిర్వహిస్తాం. ఈ సంక్షోభ పరిస్థితుల్లో ప్రస్తుతం ఆటగాళ్లు, సిబ్బంది ఆరోగ్యమే మాకు ముఖ్యం. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పరిస్థితులు సద్దుమణిగాకే ప్రొఫెషనల్ క్రికెట్‌ను నిర్వహిస్తాం’ అని ఈసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టామ్ హారిసన్ పేర్కొన్నారు. -
వైద్య సహాయకురాలిగా హెథర్ నైట్
లండన్: ప్రపంచాన్ని విలవిల్లాడిస్తోన్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా క్రీడా ప్రముఖులు విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వస్తుంటే ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హెథర్ నైట్ మరో అడుగు ముందుకు వేసి సేవ మార్గాన్ని ఎంచుకుంది. తమ దేశ ‘జాతీయ ఆరోగ్య సేవా సంస్థ’ (ఎన్హెచ్ఎస్)లో వలంటీర్‌గా సేవలందించేందుకు తన సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నట్లు ఆమె తెలిపింది. యునైటెడ్ కింగ్డమ్ (యూకే)లో ప్రాణాంతక వైరస్‌ను అరికట్టేందుకు నిరంతం శ్రమిస్తోన్న వైద్య వ్యవస్థకు తన సహాయాన్ని అందించనున్నట్లు 29 ఏళ్ల హెథర్ నైట్ పేర్కొంది. ఇందులో భాగంగా ఆమె చికిత్సకు అవసరమైన మందుల రవాణా చేయడంతోపాటు కరోనా వైరస్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించనుంది. ‘ఎన్హెచ్ఎస్ వలంటీర్ పథకంలో నేను చేరాను. ప్రస్తుతం ఏ పనీ లేకుండా ఉన్నాను. నా దగ్గర బోలెడంత ఖాళీ సమయం ఉంది. సాధ్యమైనంత వరకు సేవ చేస్తా. నా సోదరుడు, అతని భార్య ఇద్దరూ డాక్టర్లే. ఇంకా నాకు ఎన్హెచ్ఎస్లో పనిచేసే స్నేహితులు కూడా ఉన్నారు. ఈ కఠిన పరిస్థితుల్లో రోగుల కోసం వైద్యులు ఎంత కష్టపడుతున్నారో చూస్తున్నాను. అందుకే వారికి సహాయపడాలని ఈ నిర్ణయం తీసుకున్నా’ అని ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్న హెథర్ నైట్ వివరించింది. ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన మహిళల టి20 ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్ సెమీస్‌లో ఓడిపోయి ఇంటిదారి పట్టింది. అనంతరం హెథర్ యూకే నిబంధనల ప్రకారం ఐసోలేషన్లోకి వెళ్లింది. ప్రస్తుతం యూకేలో 14,543కి పైగా కోవిడ్–19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో బుధవారం వలంటీర్ పథకాన్ని ప్రవేశపెట్టగా... 5 లక్షల మంది ఇందులో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. -
మన వనిత... పరాజిత
మరో ప్రపంచ కప్ ఫైనల్... మళ్లీ అదే ఓటమి వ్యథ... విశ్వ వేదికపై భారత మహిళల క్రికెట్ జట్టు వేదన పునరావృతమైంది. గత వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో చివరి వరకు పోరాడి పరాజయం వైపు ఉండిపోయిన మన బృందం ఈసారి టి20 వరల్డ్ కప్ ఫైనల్లో కూడా ఓటమి పక్షానే నిలవాల్సి వచ్చింది. రికార్డు సంఖ్యలో మైదానంలో 86,174 మంది ప్రేక్షకులు, అటు ప్రత్యర్థిగా ఆతిథ్య జట్టు, భారీ లక్ష్యం... అన్నీ కలగలిసి తీవ్ర ఒత్తిడిలో హర్మన్ బృందం కుప్పకూలింది. కనీస పోటీ కూడా ఇవ్వలేక చేతులెత్తేసిన తీరు అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. లీగ్ దశలో భారత్ చేతిలో ఓడినా... అసలు పోరులో ఆస్ట్రేలియా జూలు విదిల్చింది. లోపాలు సరిదిద్దుకొని సరైన వ్యూహంతో బరిలోకి దిగి భారత్‌ను దెబ్బ కొట్టింది. సొంతగడ్డపై తిరుగులేని ప్రదర్శనతో ఐదోసారి పొట్టి ప్రపంచ కప్‌ను తమ ఖాతాలో వేసుకుంది. ఓపెనర్లు హీలీ, మూనీ ఇచ్చిన ఆరంభం భారీ స్కోరుకు బాటలు వేయగా, బౌలింగ్‌లో మెగాన్ షూట్, జొనాసెన్ చెలరేగి ప్రత్యర్థి ఆటకట్టించారు. టోర్నీలో ప్రయాణం తడబడుతూనే సాగినా ... చివరకు తమ స్థాయిని ప్రదర్శించి ఆసీస్ ఐదోసారి జగజ్జేతగా నిలిచింది. మెల్బోర్న్: భారత మహిళల క్రికెట్ జట్టు ప్రపంచ విజేతగా నిలవాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే! టి20 వరల్డ్ కప్‌లో తొలిసారి ఫైనల్ చేరి అరుదుగా లభించిన అవకాశాన్ని అందుకోవడంలో విఫలమైన మన జట్టు మళ్లీ రన్నరప్‌గానే ముగించింది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో ఆదివారం జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా 85 పరుగుల భారీ తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అలీసా హీలీ (39 బంతుల్లో 75; 7 ఫోర్లు, 5 సిక్సర్లు)... ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ బెత్ మూనీ (54 బంతుల్లో 78 నా టౌట్; 10 ఫోర్లు) తొలి వికెట్‌కు 70 బంతుల్లోనే 115 పరుగులు జోడించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. భారత్ 19.1 ఓవర్లలో 99 పరుగులకే ఆలౌటైంది. దీప్తి శర్మ (35 బంతుల్లో 33; 2 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. షూట్ (4/18), జొనాసెన్ (3/20) భారత ఇన్నింగ్స్ పతనాన్ని శాసించారు. హీలీ విధ్వంసం... స్పిన్ బలాన్ని నమ్ముకున్న భారత్... దీప్తి శర్మతో తొలి ఓవర్ వేయించింది. అయితే మొదటి బంతిని ముందుకు దూసుకొచ్చి ఆడి బౌండరీగా మలచిన హీలీ తన ఉద్దేశాన్ని స్పష్టం చేసింది. అదే ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టిన హీలీ... శిఖా వేసిన తర్వాతి ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టింది. పవర్‌ప్లే తర్వాత కూడా హీలీ దూకుడు తగ్గలేదు. రాజేశ్వరి వేసిన ఓవర్లో ఆమె వరుసగా రెండు సిక్సర్లు కొట్టింది. ఇందులో మొదటిది ఏకంగా 83 మీటర్ల దూరంలో పడింది! అనంతరం 30 బంతుల్లోనే ఆమె అర్ధ సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత శిఖా వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో హీలీ పండగ చేసుకుంది. వరుసగా మూడు బంతుల్లో ఆమె 6, 6, 6 బాదింది. ఈ ఓవర్లో మొత్తం 23 పరుగులు వచ్చాయి. తొలి వికెట్ భాగస్వామ్యం సెంచరీ దాటిన తర్వాత ఎట్టకేలకు రాధ యాదవ్ బౌలింగ్‌లో మరో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో హీలీ అవుట్ కావడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. హీలీకి జతగా మరోవైపు మూనీ చక్కటి బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చింది. ఆమె 41 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. వీరిద్దరి తర్వాత వచ్చిన ఇతర బ్యాటర్లను నిలువరించడంలో భారత్ సఫలమైంది. ఫలితంగా చేతిలో 9 వికెట్లు ఉన్నా... చివరి 5 ఓవర్లలో ఆసీస్ 42 పరుగులే చేయగలిగింది. దీప్తి మినహా... ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో షూట్ వేసిన మొదటి ఓవర్లో షఫాలీ 4 ఫోర్లతో 16 పరుగులు రాబట్టింది. కానీ ఈసారి షూట్ వంతు! తొలి ఓవర్ మూడో బంతికే హీలీ అద్భుత క్యాచ్‌కు షఫాలీ (2) వెనుదిరిగింది. జొనాసెన్ వేసిన రెండో ఓవర్లో మెడకు బంతి తగలడంతో తానియా (2) రిటైర్డ్‌హర్ట్‌గా నిష్క్రమించగా, జెమీమా (0) పేలవ షాట్‌తో వెనుదిరిగింది. ఆ తర్వాత మాలినెక్స్ కూడా తన మొదటి ఓవర్లోనే స్మృతి (11) పని పట్టింది. జొనాసెన్ తర్వాతి ఓవర్లో డీప్‌లో క్యాచ్ ఇచ్చి కెప్టెన్ హర్మన్ కౌర్ (4) అవుట్ కావడంతో భారత్ గెలుపు ఆశలు సన్నగిల్లాయి. వేద (24 బంతుల్లో 19; 1 ఫోర్), తానియా స్థానంలో కన్కషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన రిచా ఘోష్ (18; 2 ఫోర్లు)తో కలిసి దీప్తి కొద్దిసేపు పోరాడే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. ఆ రెండు క్యాచ్‌లు... ఆసీస్‌లాంటి జట్టుకు ‘లైఫ్’ ఇస్తే ఎలా ఉంటుందో ఫైనల్ మ్యాచ్ మళ్లీ చూపించింది. రెండుసార్లు తమకు వచ్చిన అవకాశాలను భారత్ జారవిడుచుకొని మూల్యం చెల్లించింది. తొలి ఓవర్ ఐదో బంతికి హీలీ వ్యక్తిగత స్కోరు 9 వద్ద ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను కవర్స్‌లో షఫాలీ వర్మ వదిలేయగా... రాజేశ్వరి తన మొదటి ఓవర్లోనే మూనీ తన వ్యక్తిగత స్కోరు 8 వద్ద ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను నేలపాలు చేసింది. వీరిద్దరే ఆ తర్వాత చెలరేగి భారత్ కథ ముగించారు. ►5 ఆస్ట్రేలియాకు ఇది 5వ ప్రపంచకప్ టైటిల్. 7 సార్లు టోర్నీ జరిగితే ఇంగ్లండ్, వెస్టిండీస్ ఒక్కోసారి నెగ్గాయి. ►30 అలీసా హీలీ అర్ధ సెంచరీకి తీసుకున్న బంతులు. ఏ ఐసీసీ టోర్నీ ఫైనల్లోనైనా (పురుషులతో సహా) ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. ►184 ఫైనల్లో ఆసీస్ స్కోరు. ఏ టి20 ప్రపంచకప్‌లోనైనా (పురుషులతో సహా) ఇదే అత్యధిక స్కోరు. ►85 భారత్‌కు ఇది రెండో (85 పరుగులు) అతి పెద్ద పరాజయం. గతంలో దక్షిణాఫ్రికా చేతిలో 105 పరుగులతో ఓడింది. ►52 శిఖా పాండే ఇచ్చిన పరుగులు. ప్రపంచ కప్ మ్యాచ్‌లో ఒక బౌలర్ ఇచ్చిన అత్యధిక పరుగులు ఇవే. 86, 174 ఎంసీజీలో ఫైనల్ మ్యాచ్‌కు హాజరైన ప్రేక్షకుల సంఖ్య. ఒక మహిళల క్రికెట్ మ్యాచ్‌కు ఎక్కడైనా హాజరైన అత్యధిక ప్రేక్షకుల సంఖ్య ఇది కాగా... ఆస్ట్రేలియా గడ్డపై ఏ క్రీడాంశంలోనైనా మహిళల మ్యాచ్‌కు హాజరైన అత్యధిక ప్రేక్షకుల సంఖ్య కూడా ఇదే. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: అలీసా హీలీ (సి) వేద (బి) రాధ 75; బెత్ మూనీ (నాటౌట్) 78; మెగ్ లానింగ్ (సి) శిఖా పాండే (బి) దీప్తి శర్మ 16; గార్డ్నర్ (స్టంప్డ్) తానియా (బి) దీప్తి శర్మ 2; హేన్స్ (బి) పూనమ్ 4; క్యారీ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 184. వికెట్ల పతనం: 1–115; 2–154; 3–156; 4–176. బౌలింగ్: దీప్తి శర్మ 4–0–38–2; శిఖా పాండే 4–0–52–0; రాజేశ్వరి 4–0–29–0; పూనమ్ యాదవ్ 4–0–30–1; రాధ యాదవ్ 4–0–34–1. భారత్ ఇన్నింగ్స్: షఫాలీ వర్మ (సి) అలీసా హీలీ (బి) షూట్ 2; స్మృతి మంధాన (సి) క్యారీ (బి) మాలినెక్స్ 11; తానియా (రిటైర్డ్‌హర్ట్) 2; జెమీమా రోడ్రిగ్స్ (సి) క్యారీ (బి) జొనాసెన్ 0; హర్మన్‌ప్రీత్ కౌర్ (సి) గార్డ్నర్ (బి) జొనాసెన్ 4; దీప్తి శర్మ (సి) మూనీ (బి) క్యారీ 33; వేద కృష్ణమూర్తి (సి) జొనాసెన్ (బి) కిమిన్స్ 19; రిచా ఘోష్ (సి) క్యారీ (బి) షూట్ 18; శిఖా పాండే (సి) మూనీ (బి) షూట్ 2; రాధ (సి) మూనీ (బి) జొనాసెన్ 1; పూనమ్ (సి) గార్డ్నర్ (బి) షూట్ 1; రాజేశ్వరి (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (19.1 ఓవర్లలో ఆలౌట్) 99. వికెట్ల పతనం: 1–2; 1–5 (రిటైర్డ్‌హర్ట్), 2–8; 3–18; 4–30; 5–58; 6–88; 7–92; 8–96; 9–97; 10–99. బౌలింగ్: మెగాన్ షూట్ 3.1–0–18–4; జొనాసెన్ 4–0–20–3; మాలినెక్స్ 4–0–21–1; కిమిన్స్ 4–0–17–1; క్యారీ 4–0–23–1. -
మెల్బోర్న్లో.... మహరాణులు ఎవరో?
లక్ష మంది ప్రేక్షకులు... దాదాపు రెండేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల టి20 ప్రపంచ కప్–2020 ఫైనల్ వేదికను మెల్బోర్న్గా ప్రకటించినప్పుడు ఆశించిన సంఖ్య! మహిళా దినోత్సవం రోజున ఈ పోరును నిర్వహిస్తే అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచవచ్చని భావించిన నిర్వాహకుల ఆలోచన ఇప్పుడు సరిగ్గా కార్యరూపం దాలుస్తోంది. రికార్డు స్థాయిలో అభిమానుల హాజరయ్యే అవకాశం ఉన్న మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో (ఎంసీజీ) రెండు అత్యుత్తమ జట్లు తుది పోరులో తలపడుతుండటంతో మహిళా క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేని క్రేజ్ ఈ ఫైనల్‌కు వచ్చేసింది. ఇక సమరం హోరాహోరీగా సాగడమే తరువాయి. మొదటిసారి ఫైనల్లోకి ప్రవేశించిన జట్టు ఒకవైపు... నాలుగు సార్లు ఇప్పటికే చాంపియన్‌గా నిలిచిన టీమ్ మరోవైపు. సమష్టితత్వంతో వరుస విజయాలు సాధించి భారత్ తుది పోరుకు అర్హత సాధించగా... తొలి మ్యాచ్ ఓటమిని దాటి తమదైన ప్రొఫెషనలిజంతో ఆస్ట్రేలియా ముందంజ వేసింది. తొలి టైటిల్ సాధించే లక్ష్యంతో హర్మన్ సేనపై కాస్త ఒత్తిడి ఉండగా, ఇప్పటికే ఇలాంటి ఫైనల్స్ ఆడిన అనుభవంతో రాటుదేలిన ఆడ కంగారూలు ప్రశాంతంగా కనిపిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా టీవీల ముందే కాదు... ఎంసీజీలో కూడా భారీ సంఖ్యలోనే హాజరయ్యే భారత అభిమానుల ప్రపంచకప్ కల నెరవేరుతుందా! మెల్బోర్న్: క్రికెట్ ప్రపంచంలో అత్యధిక ఆదరణ ఉన్న జట్టుకు, ప్రపంచ నంబర్‌వన్ జట్టుకు మధ్య విశ్వ వేదికపై తుది సమరానికి సమయం వచ్చేసింది. నేడు ఇక్కడి ఎంసీజీలో జరిగే మహిళల టి20 ప్రపంచకప్ ఫైనల్లో ఆతిథ్య ఆస్ట్రేలియాతో భారత జట్టు తలపడనుంది. వరుసగా ఆరోసారి ఫైనల్ చేరిన ఆసీస్ ఇప్పటికే నాలుగుసార్లు విజేతగా నిలవగా, భారత్ మొదటిసారి ఫైనల్ బరిలోకి దిగుతోంది. లీగ్ దశలో ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో భారత్ గెలిచింది. గ్రూప్ ‘ఎ’లో భారత జట్టు ఆడిన అన్ని మ్యాచ్‌లలో విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరుకుంది. ఇదే గ్రూప్‌లో భారత్ చేతిలో ఓడిన అనంతరం ఆస్ట్రేలియా మిగిలిన మూడు మ్యాచ్‌లలో నెగ్గింది. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్ వర్షం కారణంగా రద్దు కావడంతో భారత్ ముందంజ వేయగా...సెమీస్‌లో దక్షిణాఫ్రికాను ఓడించిన డిఫెండింగ్ చాంపియన్ ఫైనల్‌కు అర్హత సాధించింది. గత కొన్నేళ్లుగా టి20ల్లో ఆసీస్ ఆధిపత్యం బాగా సాగింది. అయితే వారిని నిలవరించగలిగిన ఏకైక జట్టు భారత్ మాత్రమే. గత ఐదేళ్లలో ఇరు జట్ల మధ్య 10 మ్యాచ్‌లు జరిగితే భారత్ 5 గెలిచి, 5 ఓడింది. ఓడిన మ్యాచ్‌లతో సమాన సంఖ్యలో మరే జట్టు ఆసీస్‌పై గెలవలేకపోయింది. ఇటీవలి ముక్కోణపు టోర్నీతో కలిపి చూస్తే ఇరు జట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌లో భారత్ 3 గెలిచి ఆధిక్యంలో ఉంది. అందుకే సొంత మైదానంలో ఆడుతున్నా సరే... తమకు విజయం అంత సులువు కాదని ఆసీస్‌కూ బాగా తెలుసు. కీలకమైన మ్యాచ్‌కు ముందు తమ స్టార్ ప్లేయర్ ఎలీస్ పెర్రీ గాయంతో దూరం కావడం ఆసీస్‌కు పెద్ద దెబ్బ. అయితే కెప్టెన్ లానింగ్, బెత్ మూనీ, అలీసా హీలీలతో జట్టు బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. బౌలింగ్‌లో ఆ జట్టు ప్రధానంగా జెస్ జొనాసన్, మెగాన్ షూట్లపై ఆధారపడుతోంది. భారత జట్టుకు మరోసారి సంచలన ఓపెనర్ షఫాలీ వర్మ ఇచ్చే ఆరంభం కీలకం కానుంది. ఆమె తనదైన శైలిలో చెలరేగితే ప్రత్యర్థి బౌలర్లకు ఇబ్బందులు తప్పవు. షఫాలీని నిలువరించేందుకు ఆసీస్ అన్ని ప్రయత్నాలు చేయడం ఖాయం. అయితే మిగతా బ్యాటర్ల ప్రదర్శన అంత గొప్పగా లేకపోవడం ఆందోళన కలిగించే అంశం. తుది పోరులోనైనా తమ స్థాయికి తగినట్లు కెప్టెన్ హర్మన్, స్మృతి, జెమీమా చెలరేగాల్సి ఉంది. లేదంటే గెలుపు ఆశలు నెరవేరడం కష్టం. బౌలింగ్‌లో మరోసారి భారత్ స్పిన్నే నమ్ముకుంది. తమ స్పిన్నర్లు ఈ టోర్నీలో కెప్టెన్ హర్మన్ ఉపయోగించిన తీరు ప్రశంసనీయం. ముఖ్యంగా పూనమ్ యాదవ్ తొలి మ్యాచ్‌లో ఆసీస్‌కు భారీ షాక్ ఇచ్చింది. కాబట్టి ఈసారి ఆమె కోసం వారు మరింత మెరుగ్గా సిద్ధమై రావడం ఖాయం. ఇతర స్పిన్నర్లు కూడా ఒత్తిడి పెంచగలిగితే ప్రత్యర్థిని నిలువరించవచ్చు. వర్షం లేదు! సెమీస్‌లో పోలిస్తే సంతోషకర విషయం ఆదివారం మెల్బోర్న్లో ఎలాంటి వర్ష సూచన లేదు. మ్యాచ్‌కు ఏ సమయంలోనా ఇబ్బంది ఉండకపోవచ్చు. అనూహ్యంగా వర్షం పడినా ఫైనల్‌కు రిజర్వ్ డే ఉంది. పిచ్ కూడా సాధారణ బ్యాటింగ్ వికెట్. మంచి స్కోరింగ్‌కు అవకాశం ఉంది. వరల్డ్ కప్ ఫైనల్ ఒత్తిడి ఉంటుంది కాబట్టి టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవడం ఖాయం. ఫైనల్ చేరారిలా (భారత్) లీగ్ దశలో... ►ఆస్ట్రేలియాపై 17 పరుగులతో విజయం ►బంగ్లాదేశ్‌పై 18 పరుగులతో గెలుపు ►న్యూజిలాండ్‌పై 3 పరుగులతో విజయం ►శ్రీలంకపై ఏడు వికెట్లతో గెలుపు సెమీఫైనల్... ►ఇంగ్లండ్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. లీగ్ దశలో ఎక్కువ పాయింట్లు సాధించినందుకు భారత్ ఫైనల్ చేరింది. (ఆస్ట్రేలియా) లీగ్ దశలో... ►భారత్ చేతిలో 17 పరుగులతో ఓటమి ►శ్రీలంకపై 5 వికెట్లతో గెలుపు ►బంగ్లాదేశ్‌పై 86 పరుగులతో విజయం ►న్యూజిలాండ్‌పై 4 పరుగులతో గెలుపు సెమీఫైనల్... దక్షిణాఫ్రికాపై 5 పరుగులతో విజయం టోర్నీలో భారత్ టాప్–3 బ్యాటర్లు 1. షఫాలీ వర్మ (161 పరుగులు) 2. జెమీమా (85) 3. దీప్తి శర్మ (84) టాప్–3 బౌలర్లు 1. పూనమ్ యాదవ్ (9 వికెట్లు) 2. శిఖా పాండే (7) 3. రాధా యాదవ్, రాజేశ్వరి (5) టోర్నీలో ఆస్ట్రేలియా టాప్–3 బ్యాటర్లు 1. మూనీ (181 పరుగులు) 2. హీలీ (161) 3. లానింగ్ (116) టాప్–3 బౌలర్లు 1. షూట్ (9 వికెట్లు) 2. జొనాసన్ (7) 3. వేర్హామ్, క్యారీ (3) -
ఆమె కోసం అతడు తిరుగుముఖం
మెల్బోర్న్: ఐసీసీ మహిళల టి20 ప్రపంచకప్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు ఆదివారం అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఆసీస్ జట్టులో స్టార్క్ సతీమణి అలీసా హీలీ వికెట్ కీపర్, బ్యాటర్. మిచెల్ స్టార్క్ దక్షిణాఫ్రికా పర్యటనలో ఆస్ట్రేలియా వన్డే జట్టు తరఫున సిరీస్‌లో బిజీగా ఉన్నాడు. అయినా సరే... తన భార్య ఆడే ఫైనల్ పోరును ప్రత్యక్షంగా తిలకించాలనుకున్న స్టార్క్ అంతే ఠంచనుగా తిరుగుముఖం పట్టేశాడు. దీంతో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా పురుషుల జట్ల మధ్య శనివారం జరిగే ఆఖరి వన్డేకు స్టార్క్ దూరమయ్యాడు. ఆస్ట్రేలియా టీమ్ మేనేజ్మెంట్ సంతోషంగానే అతనికి అనుమతిచ్చింది. ‘ఇలాంటి అవకాశం జీవితంలో ఎవరికో ఒకరికి చాలా అరుదుగా వస్తుంది. స్టార్క్‌కు ఇప్పుడా చాన్స్ వచ్చింది. కాబట్టి తన శ్రీమతి ఆడే మ్యాచ్‌కు ప్రత్యక్షంగా మద్దతుగా నిలిచేందుకు సమ్మతించాం’ అని ఆస్ట్రేలియా పురుషుల జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ చెప్పాడు. మూడు వన్డేల సిరీస్‌ను ఆసీస్ 0–2తో కోల్పోయింది. ఇక అమ్మాయిల మెగా ఫైనల్ విషయానికొస్తే... భారత్ ఈ పొట్టి ఫార్మాట్లో తొలిసారి టైటిల్ పోరుకు అర్హత సంపాదించగా... ఆసీస్ ఈ ఇప్పటికే నాలుగుసార్లు విజేతగా నిలిచింది. అన్నట్లు ఆసీస్ డిఫెండింగ్ చాంపియన్ కూడా! కానీ తొలి మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓడింది. -
మేమే ఫేవరెట్...
మెల్బోర్న్: డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా నాలుగుసార్లు విశ్వ విజేత అయినప్పటికీ ఈసారి ఫైనల్లో తమ జట్టే ఫేవరెట్‌గా అనిపిస్తోందని భారత సీనియర్ బ్యాటర్ వేద కృష్ణమూర్తి తెలిపింది. ఫైనల్లో టీమిండియానే గెలుస్తుందని తనకు గట్టి నమ్మకముందని ఆమె చెప్పింది. ‘ఇదంతా విధి రాత. నేను దీన్ని బాగా నమ్ముతాను. ట్రోఫీ గెలుస్తామనే విశ్వాసం ఉంది. అయితే ఈ ప్రపంచకప్ భారత్‌కు అనుకూలంగానే రూపొందించారనడం హాస్యాస్పదం. వికెట్లు, వాతావరణం సంగతెలా ఉన్నా మేం బాగా ఆడామన్నది నిర్వివాదాంశం. నిజానికి మేం ఈ మెగా టోర్నీలో ఫైనల్ చేరాలనే లక్ష్యంతో బరిలోకి దిగాం. అలా మొదటి దశను పూర్తి చేశాం. ఇప్పుడు అంతిమ దశ మిగిలుంది. ఆఖరి పోరులో ఏం చేయాలో కచ్చితంగా అదే చేస్తాం’ అని వేద పేర్కొంది. భారత్ 2017లో వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓడి చివరకు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఆ జట్టులో వేద కూడా ఉంది. అయితే ఫైనల్ దాకా వచ్చి ట్రోఫీని చేజార్చుకోవడం జీర్ణించుకోలేని బాధను మిగులుస్తుందని ఆమె గత పరాజయం తాలుకు జ్ఞాపకాలను వెల్లడించింది. ‘వ్యక్తిగతంగా నా పాత్రను నేను చక్కగా పోషించాను. జట్టు లో అందరిని కలుపుకొని వెళ్లాను. ఏదో ఒకరిద్దరని కాకుండా... ప్రతీ ఒక్కరిని ఉత్సాహపరుస్తూనే ఉన్నాను’ అని 27 ఏళ్ల వేద తెలిపింది. ఈ టోర్నీలో భారత అమ్మాయిల జట్టు అజేయంగా ఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలి మ్యాచ్‌లో ఆసీస్‌ను ఓడించే... ఈ జైత్రయాత్రకు శ్రీకారం చుట్టడం విశేషం. అమ్మో... పవర్‌ప్లేలో వాళ్లిద్దరికి బౌలింగా? భారత్‌తో తలపడటం తనకు ఎంతమాత్రం ఇష్టం లేదన్న ఆసీస్ బౌలర్ మేగన్ షూట్ పవర్ ప్లేలో భారత స్టార్ బ్యాటర్లు షఫాలీ వర్మ, స్మృతి మంధానలకు బౌలింగ్ చేయలేనని చెప్పింది. షూట్ వేసిన టోర్నీ ఓపెనింగ్ ఓవర్లో నాలుగు బౌండరీలు బాదిన షఫాలీ ఈ మెగా ఈవెంట్‌కే మెరుపు ఆరంభాన్నిచ్చింది. ‘స్మృతి, షఫాలీ నన్ను అలవోకగా ఎదుర్కొంటారు. ముక్కోణపు సిరీస్‌లో షఫాలీ కొట్టిన సిక్సర్ ఇప్పటికీ మర్చిపోలేదు. నేను చూసిన భారీ సిక్సర్లలో అది ఒకటి. అందుకే పవర్‌ప్లేలో వారికి ఎదురుపడటం నాకిష్టం లేదు’ అని షూట్ చెప్పింది. ఏదేమైనా మా వ్యూహాలు మాకుంటాయని తప్పకుండా వాటిని ఆచరణలో పెడతామని చెప్పింది. ‘ఫైనల్’ ఫీల్డ్ అంపైర్లు వీరే... ఇరు జట్ల మధ్య ఆదివారం జరిగే అంతిమ పోరాటంలో న్యూజిలాండ్‌కు చెందిన కిమ్ కాటన్, పాకిస్తానీ అహ్సాన్ రజా ఫీల్డు అంపైర్లు గా వ్యవహరిస్తారని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వెల్లడించింది. గ్రెగరీ బ్రాత్‌వైట్ (వెస్టిండీస్) మూడో అంపైర్‌గా ఉంటారు. అహ్సాన్ రజా 2017లో జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్, ఆస్ట్రేలియా సెమీస్ మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించింది. -
భారత్ సెమీస్ ప్రత్యర్థి ఇంగ్లండ్
సిడ్నీ: మహిళల టి20 ప్రపంచకప్ సెమీఫైనల్లో తలపడే జట్లు ఖరారయ్యాయి. తొలి సెమీఫైనల్లో మాజీ చాంపియన్ ఇంగ్లండ్‌ను భారత్... రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఆ స్ట్రేలియాతో దక్షిణాఫ్రికా ‘ఢీ’కొంటాయి. ఈ రెండు మ్యాచ్‌లు కూడా ఒకే రోజు (గురువారం) జరుగుతాయి. వర్షం కారణంగా గ్రూప్ ‘బి’లో భాగంగా మంగళవారం జరిగిన రెండు మ్యాచ్‌ల్లో కూడా ఫలితం రాలేదు. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ పూర్తిగా రద్దు కావడంతో ఇరు జట్లకు ఒక్కో పాయింట్ కేటాయించారు. దాంతో మొత్తం 7 పాయింట్లతో దక్షిణాఫ్రికా గ్రూప్ ‘బి’ టాపర్‌గా నిలిచింది. రెండో స్థానం సాధించిన ఇంగ్లండ్ జట్టు హర్మన్‌ప్రీత్ సేనతో సవాల్‌కు సన్నద్ధమైంది. మరోవైపు ఇదే గ్రూప్‌లో పాకిస్తాన్, థాయ్‌లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా రద్దయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన థాయ్‌లాండ్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 150 పరుగులు చేసింది. ఆ తర్వాత వర్షంతో పాకిస్తాన్‌కు బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. ఎలీస్ పెర్రీ అవుట్...: కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియాకు గట్టి దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ క్రీడాకారిణి ఎలీస్ పెర్రీ కండరాల గాయంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. వరల్డ్ నంబర్‌వన్ ఆల్‌రౌండర్ అయిన ఎలీస్ లేకపోవడం ఆ జట్టు అవకాశాలను ప్రభావితం చేయవచ్చు. 2009లో మహిళల టి20 ప్రపంచ కప్ ప్రారంభమైన నాటినుంచి ఇప్పటి వరకు ఆస్ట్రేలియా 36 మ్యాచ్‌లు ఆడితే అన్నింటిలోనూ పెర్రీ భాగం కావడం విశేషం. -
చివరి బెర్త్ ఆసీస్‌దే
మెల్బోర్న్: సెమీఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన చోట ఆస్ట్రేలియా మహిళల జట్టు ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. మహిళల టి20 ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం న్యూజిలాండ్ జట్టుతో జరిగిన గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 4 పరుగుల తేడాతో గెలిచింది. దాంతో వరుసగా ఏడోసారి టి20 ప్రపంచ కప్‌లో సెమీస్ చేరిన తొలి జట్టుగా రికార్డు నెలకొల్పింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 155 పరుగులు చేసింది. ఓపెనర్ బెత్ మూనీ (50 బంతుల్లో 60; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకుంది. ఆమెకు మెగ్ ల్యానింగ్ (21; 4 ఫోర్లు), గార్డ్నెర్ (20; 2 ఫోర్లు), ఎలీస్ పెర్రీ (21; 2 ఫోర్లు) సహాయపడగా... చివర్లో రాచెల్ హైనస్ (8 బంతుల్లో 19; 2 ఫోర్లు, సిక్స్) దూకుడుగా ఆడింది. అనంతరం ఛేదనలో కివీస్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసి ఓడింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జార్జియా వారెమ్ (3/17), మేఘాన్ షూట్ (3/28) ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. నిలకడగా ఆడుతున్నట్లు కనిపించిన సోఫీ డివైన్ (31; 2 ఫోర్లు, సిక్స్), సుజీ బేట్స్ (14; 2 ఫోర్లు), మ్యాడీ గ్రీన్ (28; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)లను వారెమ్ పెవిలియన్‌కు చేర్చి మ్యాచ్‌ను ఆసీస్ వైపుకు తిప్పింది. మార్టిన్ (18 బంతుల్లో 37; 4 ఫోర్లు, సిక్స్) కివీస్ విజయం కోసం తుది వరకు పోరాడినా ఫలితం లేకపోయింది. చివరి ఓవర్లో గెలుపు కోసం 20 పరుగులు చేయాల్సి ఉండగా... కివీస్ 15 పరుగులను మాత్రమే రాబట్టగలిగింది. ఇదే గ్రూప్‌లో నామమాత్రంగా జరిగిన మరో మ్యాచ్‌లో శ్రీలంక 9 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 91 పరుగులు చేసింది. నిగర్ సుల్తానా (39; 5 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది. శశికళ సిరివర్దనే 4 వికెట్లతో రాణించింది. శ్రీలంక 15.3 ఓవర్లలో వికెట్ నష్టపోయి 92 పరుగులు చేసి విజయంతో టోర్నీని ముగించింది. -
అంజలి అద్భుతం
సాక్షి, మంగళగిరి: బీసీసీఐ జాతీయ మహిళల అండర్ –23 వన్డే ట్రోఫీ క్రికెట్ టోర్నీలో ఆంధ్ర జట్టు హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. ఒడిశా జట్టుతో బుధవారం జరిగిన మ్యాచ్ లో ఆంధ్ర ఐదు వికెట్ల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఒడిశాను ఆంధ్ర బౌలర్లు అంజలి శర్వాణి (6/11), సింధూజ (3/7) హడలెత్తించారు. ఫలితంగా ఒడిశా 34.1 ఓవర్లలో 45 పరుగులకే ఆలౌటైంది. అనంతరం ఆంధ్ర 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసి గెలిచింది. శిరీష (20 నాటౌట్), అంజలి (10 నాటౌట్) రాణించారు. -
టీ20 వరల్డ్ కప్ టీమిండియా కెప్టెన్‌గా..
ముంబై : ఆస్ర్టేలియాలో ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభమయ్యే ఐసీసీ మహిళల టీ 20 వరల్డ్ కప్‌కు టీమిండియా కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ ఎంపికైంది. కౌర్ నేతృత్వంలో భారత జట్టు తరపున ఆడే 15 మంది జట్టు సభ్యుల పేర్లను బీసీసీఐ ప్రకటించింది. వరల్డ్ కప్ టీంలో రిచా ఘోష్ ఒక్కరే కొత్త ముఖం కావడం గమనార్హం. ఇటీవల మహిళల ఛాలెంజర్స్ ట్రోఫీలో సత్తా చాటిన రిచాకు టీమిండియాలో చోటు కల్పించారు. వరల్డ్ టీ20 టీంలో హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్) సహా స్మృతి మంధానా, అరుంధతి రెడ్డి, షఫాలి వర్మ, జెమిమా రోడ్రిగ్జ్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, వేదా కృష్ణమూర్తి, రిచా ఘోష్, తానియా భాటియా, పూనం యాదవ్, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, శిఖా పాండే, పూజా వస్త్రాకర్‌లకు చోటు దక్కింది. -
భారత మహిళల జట్లలో ముగ్గురు ఆంధ్ర క్రికెటర్లు
ముంబై: నాలుగు జట్ల అంతర్జాతీయ టి20 మహిళల క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే భారత ‘ఎ’, ‘బి’ జట్లను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శుక్రవారం ప్రకటించింది. ఈ రెండు జట్లలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు క్రికెటర్లు రావి కల్పన, సబ్బినేని మేఘన, అంజలి శర్వాణి ఎంపికయ్యారు. పట్నాలో ఈనెల 16 నుంచి 22 వరకు జరిగే ఈ టోర్నీలో భారత్ ‘ఎ’... ‘బి’ జట్లతోపాటు బంగ్లాదేశ్, థాయ్‌లాండ్ జట్లు బరిలోకి దిగుతాయి. దేశవాళీ టోర్నీల్లో రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (ఆర్ఎస్పీబీ) తరఫున ఆడే కల్పన భారత ‘ఎ’ జట్టులో... మేఘన, అంజలి భారత ‘బి’ జట్టులో చోటు దక్కించుకున్నారు. భారత ‘ఎ’ జట్టుకు దేవిక వైద్య... భారత ‘బి’ జట్టుకు స్నేహ రాణే కెప్టెన్‌గా వ్యవహరిస్తారు.