లక్ష మంది ప్రేక్షకులు... దాదాపు రెండేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల టి20 ప్రపంచ కప్–2020 ఫైనల్ వేదికను మెల్‌బోర్న్‌గా ప్రకటించినప్పుడు ఆశించిన సంఖ్య! మహిళా దినోత్సవం రోజున ఈ పోరును నిర్వహిస్తే అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచవచ్చని భావించిన నిర్వాహకుల ఆలోచన ఇప్పుడు సరిగ్గా కార్యరూపం దాలుస్తోంది. రికార్డు స్థాయిలో అభిమానుల హాజరయ్యే అవకాశం ఉన్న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో (ఎంసీజీ) రెండు అత్యుత్తమ జట్లు తుది పోరులో తలపడుతుండటంతో మహిళా క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేని క్రేజ్ ఈ ఫైనల్‌కు వచ్చేసింది. ఇక సమరం హోరాహోరీగా సాగడమే తరువాయి.
మొదటిసారి ఫైనల్లోకి ప్రవేశించిన జట్టు ఒకవైపు... నాలుగు సార్లు ఇప్పటికే చాంపియన్‌గా నిలిచిన టీమ్ మరోవైపు. సమష్టితత్వంతో వరుస విజయాలు సాధించి భారత్ తుది పోరుకు అర్హత సాధించగా... తొలి మ్యాచ్ ఓటమిని దాటి తమదైన ప్రొఫెషనలిజంతో ఆస్ట్రేలియా ముందంజ వేసింది. తొలి టైటిల్ సాధించే లక్ష్యంతో హర్మన్ సేనపై కాస్త ఒత్తిడి ఉండగా, ఇప్పటికే ఇలాంటి ఫైనల్స్ ఆడిన అనుభవంతో రాటుదేలిన ఆడ కంగారూలు ప్రశాంతంగా కనిపిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా టీవీల ముందే కాదు... ఎంసీజీలో కూడా భారీ సంఖ్యలోనే హాజరయ్యే భారత అభిమానుల ప్రపంచకప్ కల నెరవేరుతుందా!
మెల్‌బోర్న్: క్రికెట్ ప్రపంచంలో అత్యధిక ఆదరణ ఉన్న జట్టుకు, ప్రపంచ నంబర్‌వన్ జట్టుకు మధ్య విశ్వ వేదికపై తుది సమరానికి సమయం వచ్చేసింది. నేడు ఇక్కడి ఎంసీజీలో జరిగే మహిళల టి20 ప్రపంచకప్ ఫైనల్లో ఆతిథ్య ఆస్ట్రేలియాతో భారత జట్టు తలపడనుంది. వరుసగా ఆరోసారి ఫైనల్ చేరిన ఆసీస్ ఇప్పటికే నాలుగుసార్లు విజేతగా నిలవగా, భారత్ మొదటిసారి ఫైనల్ బరిలోకి దిగుతోంది. లీగ్ దశలో ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో భారత్ గెలిచింది. గ్రూప్ ‘ఎ’లో భారత జట్టు ఆడిన అన్ని మ్యాచ్‌లలో విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరుకుంది. ఇదే గ్రూప్‌లో భారత్ చేతిలో ఓడిన అనంతరం ఆస్ట్రేలియా మిగిలిన మూడు మ్యాచ్‌లలో నెగ్గింది. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్ వర్షం కారణంగా రద్దు కావడంతో భారత్ ముందంజ వేయగా...సెమీస్‌లో దక్షిణాఫ్రికాను ఓడించిన డిఫెండింగ్ చాంపియన్ ఫైనల్‌కు అర్హత సాధించింది.
గత కొన్నేళ్లుగా టి20ల్లో ఆసీస్ ఆధిపత్యం బాగా సాగింది. అయితే వారిని నిలవరించగలిగిన ఏకైక జట్టు భారత్ మాత్రమే. గత ఐదేళ్లలో ఇరు జట్ల మధ్య 10 మ్యాచ్‌లు జరిగితే భారత్ 5 గెలిచి, 5 ఓడింది. ఓడిన మ్యాచ్‌లతో సమాన సంఖ్యలో మరే జట్టు ఆసీస్‌పై గెలవలేకపోయింది. ఇటీవలి ముక్కోణపు టోర్నీతో కలిపి చూస్తే ఇరు జట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌లో భారత్ 3 గెలిచి ఆధిక్యంలో ఉంది. అందుకే సొంత మైదానంలో ఆడుతున్నా సరే... తమకు విజయం అంత సులువు కాదని ఆసీస్‌కూ బాగా తెలుసు. కీలకమైన మ్యాచ్‌కు ముందు తమ స్టార్ ప్లేయర్ ఎలీస్ పెర్రీ గాయంతో దూరం కావడం ఆసీస్‌కు పెద్ద దెబ్బ. అయితే కెప్టెన్ లానింగ్, బెత్ మూనీ, అలీసా హీలీలతో జట్టు బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. బౌలింగ్‌లో ఆ జట్టు ప్రధానంగా జెస్ జొనాసన్, మెగాన్ షూట్‌లపై ఆధారపడుతోంది.
భారత జట్టుకు మరోసారి సంచలన ఓపెనర్ షఫాలీ వర్మ ఇచ్చే ఆరంభం కీలకం కానుంది. ఆమె తనదైన శైలిలో చెలరేగితే ప్రత్యర్థి బౌలర్లకు ఇబ్బందులు తప్పవు. షఫాలీని నిలువరించేందుకు ఆసీస్ అన్ని ప్రయత్నాలు చేయడం ఖాయం. అయితే మిగతా బ్యాటర్ల ప్రదర్శన అంత గొప్పగా లేకపోవడం ఆందోళన కలిగించే అంశం. తుది పోరులోనైనా తమ స్థాయికి తగినట్లు కెప్టెన్ హర్మన్, స్మృతి, జెమీమా చెలరేగాల్సి ఉంది. లేదంటే గెలుపు ఆశలు నెరవేరడం కష్టం. బౌలింగ్‌లో మరోసారి భారత్ స్పిన్‌నే నమ్ముకుంది. తమ స్పిన్నర్లు ఈ టోర్నీలో కెప్టెన్ హర్మన్ ఉపయోగించిన తీరు ప్రశంసనీయం. ముఖ్యంగా పూనమ్ యాదవ్ తొలి మ్యాచ్‌లో ఆసీస్‌కు భారీ షాక్ ఇచ్చింది. కాబట్టి ఈసారి ఆమె కోసం వారు మరింత మెరుగ్గా సిద్ధమై రావడం ఖాయం. ఇతర స్పిన్నర్లు కూడా ఒత్తిడి పెంచగలిగితే ప్రత్యర్థిని నిలువరించవచ్చు.
వర్షం లేదు!
సెమీస్‌లో పోలిస్తే సంతోషకర విషయం ఆదివారం మెల్‌బోర్న్‌లో ఎలాంటి వర్ష సూచన లేదు. మ్యాచ్‌కు ఏ సమయంలోనా ఇబ్బంది ఉండకపోవచ్చు. అనూహ్యంగా వర్షం పడినా ఫైనల్‌కు రిజర్వ్ డే ఉంది. పిచ్ కూడా సాధారణ బ్యాటింగ్ వికెట్. మంచి స్కోరింగ్‌కు అవకాశం ఉంది. వరల్డ్ కప్ ఫైనల్ ఒత్తిడి ఉంటుంది కాబట్టి టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవడం ఖాయం.
ఫైనల్ చేరారిలా (భారత్) లీగ్ దశలో...
►ఆస్ట్రేలియాపై 17 పరుగులతో విజయం
►బంగ్లాదేశ్‌పై 18 పరుగులతో గెలుపు
►న్యూజిలాండ్‌పై 3 పరుగులతో విజయం
►శ్రీలంకపై ఏడు వికెట్లతో గెలుపు
సెమీఫైనల్...
►ఇంగ్లండ్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. లీగ్ దశలో ఎక్కువ పాయింట్లు సాధించినందుకు భారత్ ఫైనల్ చేరింది.
(ఆస్ట్రేలియా) లీగ్ దశలో...
►భారత్ చేతిలో 17 పరుగులతో ఓటమి
►శ్రీలంకపై 5 వికెట్లతో గెలుపు
►బంగ్లాదేశ్‌పై 86 పరుగులతో విజయం
►న్యూజిలాండ్‌పై 4 పరుగులతో గెలుపు
సెమీఫైనల్...
దక్షిణాఫ్రికాపై 5 పరుగులతో విజయం
టోర్నీలో భారత్ టాప్–3 బ్యాటర్లు
1. షఫాలీ వర్మ (161 పరుగులు)
2. జెమీమా (85)
3. దీప్తి శర్మ (84)
టాప్–3 బౌలర్లు
1. పూనమ్ యాదవ్ (9 వికెట్లు)
2. శిఖా పాండే (7)
3. రాధా యాదవ్, రాజేశ్వరి (5)
టోర్నీలో ఆస్ట్రేలియా టాప్–3 బ్యాటర్లు
1. మూనీ (181 పరుగులు)
2. హీలీ (161)
3. లానింగ్ (116)
టాప్–3 బౌలర్లు
1. షూట్ (9 వికెట్లు)
2. జొనాసన్ (7)
3. వేర్‌హామ్, క్యారీ (3)
Comments
Please login to add a commentAdd a comment