మెల్‌బోర్న్: డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా నాలుగుసార్లు విశ్వ విజేత అయినప్పటికీ ఈసారి ఫైనల్లో తమ జట్టే ఫేవరెట్‌గా అనిపిస్తోందని భారత సీనియర్ బ్యాటర్ వేద కృష్ణమూర్తి తెలిపింది. ఫైనల్లో టీమిండియానే గెలుస్తుందని తనకు గట్టి నమ్మకముందని ఆమె చెప్పింది. ‘ఇదంతా విధి రాత. నేను దీన్ని బాగా నమ్ముతాను. ట్రోఫీ గెలుస్తామనే విశ్వాసం ఉంది. అయితే ఈ ప్రపంచకప్ భారత్‌కు అనుకూలంగానే రూపొందించారనడం హాస్యాస్పదం. వికెట్లు, వాతావరణం సంగతెలా ఉన్నా మేం బాగా ఆడామన్నది నిర్వివాదాంశం. నిజానికి మేం ఈ మెగా టోర్నీలో ఫైనల్ చేరాలనే లక్ష్యంతో బరిలోకి దిగాం. అలా మొదటి దశను పూర్తి చేశాం. ఇప్పుడు అంతిమ దశ మిగిలుంది. ఆఖరి పోరులో ఏం చేయాలో కచ్చితంగా అదే చేస్తాం’ అని వేద పేర్కొంది.
భారత్ 2017లో వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓడి చివరకు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఆ జట్టులో వేద కూడా ఉంది. అయితే ఫైనల్ దాకా వచ్చి ట్రోఫీని చేజార్చుకోవడం జీర్ణించుకోలేని బాధను మిగులుస్తుందని ఆమె గత పరాజయం తాలుకు జ్ఞాపకాలను వెల్లడించింది. ‘వ్యక్తిగతంగా నా పాత్రను నేను చక్కగా పోషించాను. జట్టు లో అందరిని కలుపుకొని వెళ్లాను. ఏదో ఒకరిద్దరని కాకుండా... ప్రతీ ఒక్కరిని ఉత్సాహపరుస్తూనే ఉన్నాను’ అని 27 ఏళ్ల వేద తెలిపింది. ఈ టోర్నీలో భారత అమ్మాయిల జట్టు అజేయంగా ఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలి మ్యాచ్‌లో ఆసీస్‌ను ఓడించే... ఈ జైత్రయాత్రకు శ్రీకారం చుట్టడం విశేషం.
అమ్మో... పవర్‌ప్లేలో వాళ్లిద్దరికి బౌలింగా?
భారత్‌తో తలపడటం తనకు ఎంతమాత్రం ఇష్టం లేదన్న ఆసీస్ బౌలర్ మేగన్ షూట్ పవర్ ప్లేలో భారత స్టార్ బ్యాటర్లు షఫాలీ వర్మ, స్మృతి మంధానలకు బౌలింగ్ చేయలేనని చెప్పింది. షూట్ వేసిన టోర్నీ ఓపెనింగ్ ఓవర్లో నాలుగు బౌండరీలు బాదిన షఫాలీ ఈ మెగా ఈవెంట్‌కే మెరుపు ఆరంభాన్నిచ్చింది. ‘స్మృతి, షఫాలీ నన్ను అలవోకగా ఎదుర్కొంటారు. ముక్కోణపు సిరీస్‌లో షఫాలీ కొట్టిన సిక్సర్ ఇప్పటికీ మర్చిపోలేదు. నేను చూసిన భారీ సిక్సర్లలో అది ఒకటి. అందుకే పవర్‌ప్లేలో వారికి ఎదురుపడటం నాకిష్టం లేదు’ అని షూట్ చెప్పింది. ఏదేమైనా మా వ్యూహాలు మాకుంటాయని తప్పకుండా వాటిని ఆచరణలో పెడతామని చెప్పింది.
‘ఫైనల్’ ఫీల్డ్ అంపైర్లు వీరే...
ఇరు జట్ల మధ్య ఆదివారం జరిగే అంతిమ పోరాటంలో న్యూజిలాండ్‌కు చెందిన కిమ్ కాటన్, పాకిస్తానీ అహ్‌సాన్ రజా ఫీల్డు అంపైర్లు గా వ్యవహరిస్తారని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వెల్లడించింది. గ్రెగరీ బ్రాత్‌వైట్ (వెస్టిండీస్) మూడో అంపైర్‌గా ఉంటారు. అహ్‌సాన్ రజా 2017లో జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్, ఆస్ట్రేలియా సెమీస్ మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించింది.
Comments
Please login to add a commentAdd a comment